Facebook Twitter
క్రిస్మస్ భూతాలు..

క్రిస్మస్ భూతాలు..!

 

అనగనగా ఒక వేటగాడు ఉండేవాడు. అతనికి ఒకసారి ధృవపు ఎలుగుబంటి పిల్ల ఒకటి దొరికింది. నిండా దట్టంగా ఊలుతో, అమాయకంగా ముద్దు గొలుపుతూ ఉండిందది. ఒక్క మచ్చలేకుండా మంచులాగా మొరిసిపోతున్న ఆ చిట్టి పిల్లని చూసేసరికి వేటగాడికి ముచ్చట వేసింది. అతను దానిని చాలా ఇష్టంగా పెంచుకోసాగాడు. సొంత బిడ్డలాగా పెంచుతూ, దానిని రకరకాల విన్యాసాలు వగైరాలు నేర్పాడు. అది రెండు కాళ్ల మీద నడిచేది, ఒంటి కాళ్ల మీద డాన్సు చేసేది, ఎవరైనా మెచ్చుకుంటే వంగి అభివాదం కూడా చేసేది! కొన్నేళ్లకు అది బాగా పెద్దదైంది. అది ఎంత సాధువంటే, ఇప్పుడు అది వేటగాడిని తన వీపు మీద ఎక్కించుకొని మంచు కొండల మీదంతా త్రిప్పేది!!

ఒకరోజున దాన్ని చూసి వేటగాడు అనుకున్నాడు- "ఇప్పుడు ఇది చాలా పెద్దదైంది. నా దగ్గర ఉండేకంటే డెన్మార్క్ దేశపు రాజు గారి దగ్గర ఉంటే దీనికి మర్యాద, మన్నన. బహుశా ఆయన నాకు తిరిగి ఇంకా గొప్ప బహుమానం కూడా ఇవ్వచ్చు!" అని. ఆ సంవత్సరం నవంబరు నెలలో బయలుదేరి అతను నార్వే మీదుగా డెన్మార్కుకు ప్రయాణం కట్టాడు. మంచు కొండల్లోంచి వేగంగా వీచే ఈదురు గాలులు, చెలరేగే మంచు తుఫానులు అతని ప్రయాణాన్ని ఘోరంగా అడ్డుకున్నాయి. దాంతో క్రిస్‌మస్ నాటికి అతను ఇంకా డోవర్‌ఫెల్‌లోనే ఉన్నాడు! (మధ్య నార్వేలోని ఒక కొండ ప్రాంతం అది!)

 

ఆరోజు చీకటి అయింది. వాతావరణం అయితే ఇంకా చాలా చల్లగా ఉంది. వేటగాడికి ఆ రాత్రి ఎక్కడ గడపాలో కూడా అర్థం కాలేదు. అంతలో కొంచెం దూరంగా పొదలమాటున ఒక కుటీరం కనిపించింది. వేటగాడు ఆ ఇంటి దగ్గరకు వెళ్లి తలుపు తట్టి మర్యాదగా "నేను, నా చక్కని ఈ ఎలుగుబంటి- ఇద్దరమూ కోపెన్‌హాగన్‌కు పోతున్నాం. డెన్మార్క్ రాజుగారికి ఈ ఎలుగుబంటిని బహుమతిగా ఇవ్వాలని నా ఉద్దేశ్యం. అయితే దారిలో ఇక్కడే చీకటి అయింది. ఈ క్రిస్‌మస్ రాత్రిని మీ ఇంట్లో గడిపేందుకు ఏదో ఒక మూలన మాకు ఇంత చోటు ఇచ్చారంటే, మీ పుణ్యాన్ని మరచిపోను" అన్నాడు.

తలుపు తీసిన ఇంటి యజమాని పేరు హాల్వర్. అతనన్నాడు "బాబూ! నేను చెప్తున్నది నిజం అని ఆ పైవాడికి ఒక్కడికే ఎరుక- కానీ సంగతేమంటే, మేం బయటి వాళ్లనెవ్వరినీ, ఈ రోజు రాత్రికి మటుకు- ఇక్కడ ఉండనిచ్చే అవకాశం లేదు. ఎందుకంటే, ప్రతి క్రిస్‌మస్ నాటి రాత్రీ మా ఇంటికి ఒక భూతాల గుంపు వస్తూ ఉంటుంది. వాటికి బెదురుకొని ఈ రాత్రంతా మేం- ఇంటి వాళ్లమే, ఓ గదిలో దూరి, వణుక్కుంటూ కాలక్షేపం చేస్తుంటాం; ఇక మీకు చోటు ఎక్కడ ఇవ్వగలం? అందునా అతిథులను అట్లాంటి భయంకరమైన అనుభవాలకు గురిచేయటం మాకు ఏం బాగుంటుంది చెప్పు?” అన్నాడు.

"అంతేనా?!" అన్నాడు వేటగాడు తేలికగా. "మాకు భూతాలు అంటే ఏం భయం లేదు. నా ఈ పెంపుడు ఎలుగును కుంపటి క్రింద ముడుచుకొని పడుకోనివ్వండి. నేను ఆ ప్రక్క గదిలో పడుకుంటాను. మీరెవ్వరూ మా గురించి చింత పడకండి. మమ్మల్ని మర్చిపోండి!" అన్నాడు. "సరే నీ ఇష్టం!" అన్నాడు ఇంటి యజమాని, వాళ్ళని లోనికి రానిస్తూ. "కానీ నేను ముందుగా చెప్పలేదు" అని మాత్రం అనకు. భూతాలు నిన్ను ఏం చేసినా నీదే బాధ్యత సుమా!" వేటగాడు, ఎలుగుబంటి లోపలికి వెళ్లే సరికే ఇంట్లో వాళ్లు ఓ పెద్ద క్రిస్‌మస్ విందును తయారుచేసి టేబుల్ మీద పెట్టి ఉన్నారు.

ఉడకబెట్టిన చేపలు, క్యాబేజ్ ఊరగాయ, ధృవపు జింక మాంసం, క్రిస్‌మస్‌కు ప్రత్యేకంగా చేసే పాయసం- అన్నీ అందంగా పెట్టి ఉన్నాయి. "ఇవన్నీ ఇదిగో, మాకు దాపురించబోయే భూతాల కోసమే! ఇక మీరెవరో మాకు తెలీదు! మీ క్షేమం మీరు చూసుకోవాలంతే!" అని ఇంట్లో వాళ్లు అందరూ ఓ మూల గదిలోకి పోయి తలుపులు మూసేసుకున్నారు. కొంచెం సేపు అటూ ఇటూ తిరిగి చూసుకొని వేటగాడు-ఎలుగుబంటి కూడా కొద్దిగా కునుకుతీశారు.

 

అర్ధ రాత్రి కావస్తుండగా అనుకున్నట్లే భూతాల గుంపు ఒకటి వచ్చి పడింది! ఆ భూతాలు ఎట్లా ఉన్నాయో ఏమని వర్ణించాలి!? కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, కొన్నింటికి పొడవాటి తోకలున్నాయి, కొన్నింటికి అయితే అసలు తోకలే లేవు. కొన్నింటికి చాలా చాలా పొడవైన ముక్కులున్నాయి. కాని వాటికి వేటికీ ఏ కొంచెం కూడా మర్యాదలు లేవు. అవన్నీ ఇష్టం వచ్చినట్లు తిన్నాయి; త్రాగాయి; పాటలు పాడాయి; డాన్సులు చేశాయి; అటూ ఇటూ దూకాయి; పదార్థాలన్నింటినీ తన్ని తగలేశాయి; గ్లాసులు పగలగొట్టాయి, గది అంతటా వీరంగం చేశాయి! అట్లా చాలా సేపు జరిగాక పిల్ల దయ్యం ఒకటి కుంపటి క్రిందికి వంగి చూసింది. చిన్న మాంసపు ముక్కను ఒకదాన్ని గుచ్చి పట్టుకొని, అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్న ఎలుగుబంటి ముక్కులోకి గ్రుచ్చుతూ "ఏయ్ పిల్లీ! పిల్లీ! ఇదిగో నీకో మాంసపు ముక్క" అని పాడటం మొదలుపెట్టింది.

ఎలుగుబంటి ఏం చేసినా భరిస్తుంది కానీ, నిద్ర లేపితే మాత్రం అది అస్సలు ఊరుకోదు. పిల్లదయ్యం చేష్టలకు ఉలిక్కిపడి నిద్ర లేచిన ధృవపు ఎలుగుబంటి తటాలున దాని మెడను ఒడిసి పట్టుకొని, భయంకరంగా గర్జిస్తూ లేచి నిలబడ్డది! అంతెత్తున లేచి అది ఒళ్లు విరుచుకుంటే, దాని చేతిలోని పిల్లభూతం కీచు కీచు మని మొత్తుకుంటే, వణికి పోయిన భూతాలన్నీ చెల్లా చెదురుగా, కనబడ్డ దారి గుండా భయటికి పరుగెత్తాయి! మర్నాటి రోజున తలుపు తీసిన హాల్వర్‌కు, అతని కుటుంబ సభ్యులకు ఏం జరిగిందో చెప్పి, నవ్వుతూ సెలవు పుచ్చుకున్నారు వేటగాడు-ఎలుగుబంటి.

ఆ తర్వాతి సంవత్సరం క్రిస్‌మస్ రోజు- మధ్యాహ్నం సమయంలో- ఇంటి యజమాని పొయ్యిలోకి కట్టెలు ఏరుకుంటూ ఉన్నాడు. అప్పటికే ఇంట్లో వాళ్లు వంటలు కూడా మొదలు పెట్టి ఉన్నారు- ప్రతిసారి లాగే ఈసారీ రాబోయే భూతాలకోసం. అంతలో అతని వెనక ఉన్న చెట్లలోంచి గుసగుసగా ఓ గొంతు వినిపించింది: "హాల్వర్! హాల్వర్!” అని. అతను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఉన్నది ఒక కుర్ర భూతం! "హాల్వర్! నీ ఆ పెద్ద పిల్లి- అది ఇంకా నీ దగ్గరే ఉందా?" అడిగింది ఆ భూతం, భయం భయంగా, కొద్దిగా వణుకుతున్న గొంతుతో.

"ఓ ఉన్నది! అదెక్కడికి పోతుంది?” అన్నాడు హాల్వర్ చిరునవ్వుతో. "అది ఇంకా కుంపటి క్రిందే పడుకొని ఉంది. ఈ ఏడాది దానికి ఇంకో ఏడు పిల్లలు పుట్టాయి; అవన్నీ దానికంటే పెద్దగా అయ్యాయి; దాని కంటే తిక్కగానూ, కోపంగానూ ప్రవర్తిస్తున్నాయి. అయినా మీరు రాత్రి భోజనానికి వస్తారుగా, అవన్నీ‌ మీకు పరిచయం అవుతాయిలేండి.." “-అయ్యో, అది చెప్పేందుకే వచ్చాను- విను! " అన్నది భూతం- "ఇక మీద మేం క్రిస్‌మస్‌కి మీ ఇంటికి రాలేము- మమ్మల్ని క్షమించు. ఏమీ అనుకోకు; ఇది చెప్పేందుకే వచ్చాను నేను!" అని ఆ భూతం చటుక్కున మాయమైపోయింది! అది విన్నాక హాల్వర్, అతని కుటుంబ సభ్యులు అందరూ సంతోషంతో చిందులు వేశారు- ఎందుకంటే వాళ్లకు ఏనాడూ ఇంత మంచి క్రిస్‌మస్ బహుమతి దొరకలేదు మరి!

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో