TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
చిత్తైన పులి
అనగనగా ఒక అడవి, అడవి ప్రక్కనే ఒక ఊరు ఉండేవి. ఆ ఊళ్లో నివసించే రామయ్యకు పెద్ద గొర్రెలమంద ఉండేది. తరతరాలుగా వాళ్ళది అదే వృత్తి. గొర్రెల్ని పెంచటం, అవి ఎదిగినాక మంచి ధరకు అమ్మటం. చాలా ఏళ్ళపాటు అతని వ్యాపారం బాగానే సాగింది. అయితే కొంతకాలంగా అదంతా కష్టాల్లో పడింది. ఆ కష్టాలకు కారణం ఒక చిరుతపులి. ఆ చిరుతపులి అడవిలో తిరుగాడేది; రోజూ రాత్రిపూట వచ్చి, ఒకటి రెండు గొర్రెలను ఎత్తుకెళ్ళేది. రామయ్య దాన్ని గురించి అటవీశాఖ వాళ్లకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
అట్లా అని దాన్ని చంపటమేమో నేరం! అయినా "ఏదైతే అదౌతుంది- పులిని చంపేస్తాను" అని రామయ్య ఎంత ప్రయత్నించినా, ఎన్ని రకాలుగా మాటు వేసినా, చిరుతపులి మాత్రం తెలివిగా ఎలాగోలా కనీసం ఒక గొర్రెనైనా తిని పోతూనే ఉంది. దాంతో రామయ్య వ్యాపారం, దానితో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతిన సాగినై. "ఈ పులి బాధనుండి తప్పించుకోవటం ఎలా?" అని సతమతమౌతూండగా, దేవుడు పంపించినట్లు వాళ్ళ అన్నయ్య వచ్చాడు ఊరికి. రామయ్య శరీరపు తీరుని, అనారోగ్యాన్ని గమనించి "ఏమైందిరా?" అని అడిగాడు. రామయ్య చెప్పింది అంతా విని, "నాకు తెలుసు, ఏం చేయాలో!" అన్నాడు అన్నయ్య.
ఆ రోజు రాత్రి చిరుతపులి ఎప్పటిలాగే గొర్రెలను తిందామని వచ్చింది. ఆరోజున దానికి అక్కడ పుష్టిగా ఉన్న గొర్రెలు చాలా కనిపించాయి. అవన్నీ ఒకదానినొకటి ఆనుకొని నిలబడి ఉన్నాయి. పులి తటాలున ఒక గొర్రె మీదికి దూకి, దాని మెడను పట్టుకొని కొరికేసింది. మామూలుగా అది ఒక గొర్రెమీదికి దూకగానే మిగతా గొర్రెలన్నీ ప్రాణభయంతో అరుస్తూ పారిపోయేవి. కానీ ఆరోజున అవేవీ పారిపోలేదు. నిశ్శబ్దంగా అలాగే దానికేసే చూస్తూ నిలబడ్డాయి. చిరుతపులికి ఏమీ అర్థం కాలేదు. 'ఇవాళ్ల నేను రెండు గొర్రెల్ని ఈడ్చుకు పోతాను" అని అది వెంటనే మరో గొర్రె మీదికి దూకి, దాని మెడను పట్టుకొని చీల్చివేసింది. అయితే అదేం చిత్రమో, సరిగ్గా అదే క్షణానికి దానికి కళ్ళు తిరిగినట్లయింది!
"ఏమౌతున్నది?" అనుకునేలోగానే దానికి ఎక్కడ లేని మైకం వచ్చి, తటాలున పడిపోయింది. అంతలోనే ప్రక్క గదిలోంచి వచ్చిన రామయ్య, వాళ్ల అన్నయ్య ఇద్దరూ తాము తెచ్చిన తాళ్లతో పులి కాళ్ళు, నోరు అన్నీ కట్టేసారు. పులికి అన్నీ తెలుస్తూనే ఉన్నాయి, కానీ ఏమీ చెయ్యలేక ఊరుకున్నదది! తెల్లవారాక, పులిని అటవీ శాఖ వారికి అప్పజెప్పారు రామయ్య, అన్నయ్య. వాళ్ళు వచ్చి, పులిని బోనులో పెట్టుకొని తీసుకుపోయారు. ఇంతకీ అన్నయ్య ఏం చేసాడు? ఆరోజు ఉదయం అంతా కూర్చొని దూదితో ఒక పదికి పైగా గొర్రెల్ని చేయించాడు. వాటి మెడ దగ్గర మటుకు గొర్రె మాంసపు ముక్కలు పెట్టి కుట్లు వేయించాడు. మాంసంలోను, గొర్రె బొమ్మల మెడల దగ్గర కూడాను, అంతటా దట్టంగా మత్తు మందు చల్లించాడు.
ఇక ఆరోజు రాత్రి నిజం గొర్రెలన్నింటినీ పాకలోంచి రామయ్య పడుకునే గదిలోకి తెచ్చి, తలుపులు, కిటికీలు అన్నీ బిగించాడు. పులి అలవాటుగా అవి ఉండే పాకలోకే వెళ్ళి, అక్కడ ఉన్న గొర్రె బొమ్మల్ని చూసి, నిజం గొర్రెలు అనుకున్నది. నిజంగానే మరి, అది కొరికిన చోటల్లా గొర్రె మాంసమే ఉందాయె! అట్లా మత్తు మందు ప్రభావానికి గురైన పులి, రెండో గొర్రెను కొరకటం వరకూ చేయగలిగింది గానీ, ఆ తర్వాత ఇక తట్టుకోలేక పడిపోయింది! ఆ రకంగా అది అత్తవారింటికి- అంటే అటవీ శాఖవారి సంరక్షణ శాలకు- చేరుకున్నది!
ఇక అటుపైన రామయ్య గొర్రెల వ్యాపారం దిన దినాభివృద్ధి చెందింది.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో