Facebook Twitter
చిన్న సాయం

చిన్న సాయం

 

కంకణాలపల్లిని ఆనుకొని చాలా కొండలు ఉండేవి. రాము అనే పిల్లవాడు ఒకడు రోజూ సాయంత్రం బడి వదిలాక, ఊరి అవతల ఉన్న బండమీదికి వచ్చి కూర్చునేవాడు. చుట్టూ ఉన్న కొండల్ని, ప్రకృతిని చూసి సంతోషపడేవాడు.


రెండు మూడు రోజులుగా అతనికి అక్కడ ఒక ఆవు, దూడ కనిపిస్తున్నాయి. రెండూ పడుకొనే ఉంటున్నాయి- పెద్దగా కదలట్లేదు, మెదలట్లేదు. బాగా సన్నగా ఉన్నాయి. రాముకి వాటిని చూస్తే జాలివేసింది. "అయ్యో! వీటికి మేత ఉన్నట్లు లేదు. ఎక్కడా గడ్డి కూడా లేదు. పాపం" అనిపించింది. దగ్గర్లోనే ఉన్న చెట్టు నొకదాన్ని ఎక్కి, కొన్ని కొన్నిగా ఆకులు తుంచి వాటికి అందించాడు. తరువాతి రోజున రాము వచ్చేసరికి ఆవు-దూడ రెండూ అక్కడే కూర్చొని ఉన్నాయి.


ఆరోజున కూడా వాటికి ఆకులు తుంచివేశాడు రాము. అట్లా కొన్ని రోజులు గడిచే సరికి అవి కొంచెం తేరుకున్నాయి. అప్పుడు రాముకి ఒక ఆలోచన వచ్చింది. కొండపైన అంతా తిరిగి, దొరికినన్ని ఎండిన తాటి మట్టల్ని ఈడ్చుకొచ్చాడు. వాటిని ఒక్కటొక్కటిగా తీగలతో వ్రేలాడగట్టాడు చెట్టుకు. అలా రోజుకు కొన్ని చొప్పున తెచ్చి చిక్కగా కట్టి, అక్కడ ఒక నీడ కల్పించాడు.


కొన్ని రోజులకు వాన పడింది. పోయి రాము తయారుచేసిన కప్పు కింద నిలబడ్డాయి ఆవు-దూడ. చూసి రాము అనందపడ్డాడు. మరి కొన్ని రోజులయ్యేసరికి ఆ చుట్టుప్రక్క-లంతా పచ్చి గడ్డి మొలిచింది. బలం పుంజుకున్న ఆవు-దూడ ఇప్పుడు తమంతట తాము పోయి పచ్చిగడ్డి మేస్తున్నాయి. "అరె..వాటికి మేత దొరికింది!" అని రాము ఎంతో సంతోషపడ్డాడు. ఇక ఆకులు తుంచలేదు. పైకి చెట్టుమీదకు చూశాడు. అక్కడ ఆకులు తుంచిన చోట మళ్ళీ ఇగురు వచ్చింది. అది చూసి ఇంకా సంతోషపడ్డాడు రాము. 

 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో