TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
చేప-లేడి
నల్లమల అడవుల్లో చిట్టి లేడిపిల్ల ఒకటి ఉండేది. హాయిగా గంతులు వేస్తూ అడవిలో ఎక్కడ పడితే అక్కడ తిరిగేదది. ఒకసారి అట్లా తిరుగుతూ తిరుగుతూ అకస్మాత్తుగా అది ఓ నదీ తీరాన్ని చేరుకున్నది. చిట్టి లేడిపిల్ల అప్పటివరకూ ఏనాడూ నది అన్నదాన్ని చూసి ఉండలేదు. అన్నన్ని నీళ్ళను మోసుకొని బరువుగా ప్రవహిస్తూ పోతున్న నదిని చూస్తే దానికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. అది నదిలోకి దిగి కాళ్ళు కడుక్కున్నది, మునిగి లేచింది, అటూ ఇటూ గెంతింది, కొంచెం దూరం కొట్టుకుపోయింది, మళ్ళీ తేరుకొని బయటికి ఎగిరి దూకి ముచ్చట పడ్డది. అట్లా షికార్లు చేస్తుంటే దానికి నీళ్ళలో చక్కని చేప ఒకటి కనిపించింది.
అది కూడా చిట్టి లేడిపిల్లను చూసి చాలా సంతోష పడ్డది. నీళ్లలో నుంచి పైకి ఎగురుతూ, కిందికి పడుతూ విన్యాసాలు చేసింది. "ఏ..య్! చిట్టి పిల్లా! నీళ్ళతో జాగ్రత్త! ఒడ్డుకు దగ్గరగానే ఉండు- నదిలో లోపలికి పోకు! సుడిగుండాలుంటాయి!" జాగ్రత్తలు చెప్పింది. చిట్టి లేడి పిల్లకు నది నచ్చింది, చేప ఇంకా చాలా నచ్చింది. చేప విన్యాసాలను చూస్తూ చూస్తూ, గంతులు వేయటం కూడా మరిచిపోయిందది. దానికి చేపతో స్నేహం చేద్దామనిపించింది. అలా అనుకున్నదే తడవు, చేపతో తన మనసులోని మాటను చెప్పింది.
"అమ్మో! భూమి మీద తిరిగే లేడిపిల్లతో స్నేహమా? ఇంకేమైనాఉందా?!" ఆలోచిం-చింది చేప. "నువ్వేమేం తింటావు?" అడిగింది జింకను. "గడ్డి, చిగుర్లు, కాయలు.." అంది జింక. "మాంసం తినవు కదా?" అడిగింది చేప. "ఉహు. తోడేళ్లయితే తింటాయి. నాకు అవంటే భయం" చెప్పింది జింకపిల్ల. "అయితే సరే, మనిద్దరం ఇవాల్టి నుండి స్నేహితులం. నాకు తోడేళ్ళంటే భయం లేదుగానీ, కోరపళ్ళ చేపలంటే మటుకు చాలా భయం" అన్నది చేప. అంతలోనే అకస్మాత్తుగా ఎక్కడినుండో ఊడిపడిందొక తోడేలు! మెల్లగా అడుగులు వేసుకుంటూ జింకపిల్ల వైపుకు రాసాగింది. అయితే ఆ సమయానికి జింకపిల్ల తోడేలును చూడటం లేదు. దాని చూపంతా నీళ్ళలో చక్కని చేప వైపుకు దూసుకువస్తున్న కోరపళ్ళ పెద్ద చేప మీదనే ఉన్నది! ముందుగా తోడేలును చూసిన చేప- "ఏయ్, తోడేలు! పరుగు తియ్యి!" అని అరిచింది.
"ఓయ్! కోరపళ్ళ చేప! నీమీదికే వస్తోంది! పారిపో!" అరిచింది జింక పిల్ల. చక్కని చేప చటుక్కున నీళ్ళలోకి దూకి ఎటో పోయింది. జింక పిల్ల మెరుపు వేగంతో తమ ఇంటివైపుకు పరుగెత్తింది. కోపంగా దాన్ని వెంటాడిన తోడేలు కొంత సేపటికి నిరాశగా వెనుతిరిగింది. మరునాడు జింకపిల్ల మళ్ళీ నది దగ్గరికి వెళ్ళి, చక్కని చేపను పిలిచింది- "ఓయ్! మిత్రమా! ఎలా ఉన్నావు? కోరపళ్ళ చేపనుండి తప్పించుకున్నావా?" అని అడిగింది. చేప నీళ్ళ పైకి ముఖం పెట్టుకొని విచారంగా ఉన్నది- జింక పిల్లను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లు.
"అబ్బ! బాగానే ఉన్నావా! నీకేమైపోయిందో అని నేను తెగ ఆందోళన పడ్డాను. చూడు, ఎలా జరిగిందో! నీళ్ళలో అయితే నేను నీకు ఏదో కొంచెం సాయం చేసేదాన్ని. కానీ భూమి మీద నేను ఎక్కువసేపు ఉండలేను కదా! నువ్వు ఆపదలోఉన్నప్పుడు నేను ఏమాత్రం ఆదుకోలేకపోయాను. నేను నీకు మిత్రుడిగా సరిపోను" అని బాధపడింది. "అయ్యో! అదేం మాట! నువ్వు సమయానికి హెచ్చరించకపోతే నేను ఏమైపోయి ఉండేదాన్ని?! నువ్వు నన్ను ఎంత ఆదుకున్నావో నీకేం తెలుసు?" అడిగింది జింకపిల్ల. "నిజమేలే! నువ్వు నన్ను హెచ్చరించి ఉండకపోతే నా పనీ సరి అయ్యేది!" అన్నది చేప.
"మరింకేమి, ఇద్దరం ఒకరికొకరం సాయపడ్డట్లే! నీకు నేలపై పోరాడగల శక్తి ఉంటే నా దారిన నన్ను వదిలి పెట్టే దానివి కాదు. నీళ్లలో అయితే నన్ను కాపాడే దానివి కదా! నేను కూడా నేలపై నీకు సహాయం చేసి ఉండేదాన్ని. కాబట్టి బాధ పడాల్సింది ఏమీ లేదు. అయినా స్నేహం అనేది లాభ, నష్టాలపై ఆధారపడకూడదు. స్నేహం స్నేహమే!" చెప్పింది జింక పిల్ల. అటుపైన చేప- జింకల స్నేహం ఎంతో కాలం కొనసాగింది. తమకు వీలు చిక్కినప్పుడల్లా రెండూ కలుసుకొని నీటిలోను, భూమి మీద జరిగే ముచ్చట్లను కథలు కథలుగా చెప్పుకుంటూ సంతోషంగా ఉన్నాయి!
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో