TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
ఆరియన్-డాల్ఫిన్ కథ
ఏసుక్రీస్తు పుట్టటానికి ఆరువందల సంవత్సరాల ముందు గ్రీసు దేశంలో కోరీంత్ అనే నగరం ఒకటి ఉండేది. పెరియాందర్ అనే రాజు పరిపాలించేవాడు కోరీంత్‌ను. ఆ రాజుకు కళలన్నా వృత్తులన్నా చాలా ఇష్టం ఉండేది. పెద్ద పెద్ద భవంతులు కట్టిన వాస్తు శిల్పులు, ఎర్రమట్టిపై చిత్రాలు గీసే కళాకారులు, గాయకులు- ఇట్లా అనేక మంది కళాకారుల్ని ఆయన పోషించేవాడు. అట్లాంటి ఆ సమయంలో కోరీంత్‌కు దగ్గర్లోనే ఉన్న మరో గ్రీసు ద్వీపంలో ఒక క్రొత్త సంగీతపు కెరటం ఎగసింది. 'ఆరియాన్ ' అనే గాయకుడొకడు, అద్భుతమైన తన గానంతో పిల్లల నుండి ముసలివాళ్ల వరకూ అందరినీ మెప్పించసాగాడు. అతనుండే చిరుద్వీపం లెస్‌బోస్ నుండి అతని ఖ్యాతి సుదూరంగా ఉండే టర్కీ వరకూ ప్రాకింది.
అతని సంగీతాన్ని గురించి విన్న పెరియాందర్ అతన్ని తన సభలో పాడేందుకు రప్పించుకొని విని, పరవశించి పోయాడు. పెద్ద జీతం ఇచ్చి అతన్ని తన ఆస్థాన విద్వాంసుడిగా చేర్చుకున్నాడు. 'లైర్' అనే తీగల వాయిద్యాన్ని వాయిస్తూ లోకాన్ని సమ్మోహింపజేసేటట్లు పాడేవాడు ఆరియన్. గ్రీకులకు సారాయి త్రాగుతూ నాట్యం చేయటం అంటే ఇష్టం. ఆరియన్ పాడే పాటలు దానికి అనువుగా ఉండేవి. దాంతో అతన్ని తమ వద్దకు వచ్చి వెళ్ళమంటూ ఎక్కడెక్కడినుండో ఆహ్వానాలు వస్తుండేవి. ఇట్లా ఆస్థాన విద్వాంసుడైనాక, రాజుగారి ఖర్చుతో దేశదేశాలూ తిరిగి సంగీత సభలు చేసేవాళ్ళు, ఆరియన్, అతని బృందమూనూ. అట్లా అతని పాట వినేందుకు వందల సంఖ్యలో బంగారు నాణాలను వెచ్చించేవాళ్లట, ఆనాటి ధనికులు! అట్లా ఆరియన్‌కు ఒట్టి పేరే కాక లెక్కలేనంత సంపద కూడా సమకూరింది.
అట్లా ఉండగా ఒకసారి ఇటలీ చివర్లో ఉన్న 'సిసిలీ' నుండి అతనికి ఒక ఆహ్వానం వచ్చింది. పెరియాందర్ అనుమతి తీసుకొని, అనేక రోజుల పడవ ప్రయాణం తరువాత ఆరియన్ సిసిలీ చేరుకున్నాడు. అక్కడి ప్రజలు, రాజులు అతనికి బ్రహ్మరధం పట్టారు. లెక్కలేనంత బంగారాన్ని, నగల్ని కానుకలుగా ఇచ్చారు. సిసిలీ నుండి ఆ సంపదనంతా తీసుకొని, ఒక పెద్ద పడవలో తిరిగి కోరింత్‌కు బయలుదేరాడు ఆరియన్. అయితే ఆ పడవను నడిపే వాళ్లు చాలా దుర్మార్గులు. తమ పడవలో ఉన్న ప్రయాణీకుడు ఎవరో వాళ్లకు బాగా తెలుసు. అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని కూడా వాళ్లకు తెలుసు. నడి సముద్రంలో వాళ్ళు తమ అసలు ఉద్దేశాన్ని బయట పెట్టారు. సంతోషంగా వెనక్కి వస్తున్న ఆరియన్‌కు ఆ విధంగా కష్టాలు ఎదురైనాయి. పడవ సరంగు కత్తి చూపి బెదిరిస్తూ, ఆరియన్‌ను "నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా, లేకపోతే కాళ్లు చేతులు కట్టేసి నిన్ను సముద్రంలో పడేయమంటావా?!" అని అడిగాడు కర్కశంగా. రెండూ ప్రాణాంతకాలే, అయితే ఆత్మహత్య చేసుకుంటే సరంగులు అతని శరీరాన్ని నేలకు చేర్చి దహనం చేస్తారట; లేకపోతే అతనే స్వయంగా జలచరాలకు ఆహారం అయిపోవచ్చట!
అయితే అంత కష్టంలో కూడా ఆరియన్ బెదిరిపోలేదు. సముద్రంలోకే తనని పడేయమన్నాడు: అయితే 'ఆలోగా తనకు నచ్చిన పాటలు కొన్ని పాడుకోనీ'యమన్నాడు. మామూలుగా తాను పాటలు పాడేటప్పుడు ధరించే ప్రత్యేకమైన డ్రస్ వేసుకొని, లైర్ వాయిస్తూ గొంతెత్తి పాడటం మొదలు పెట్టాడు ఆరియాన్ . అంత గొప్ప గాయకుడు, ప్రత్యేకంగా 'తాము మాత్రమే వినేందుకు పాడుతున్నాడు' అని పడవ నడిపే నావికులందరూ సంతోషపడి ఉంటారు. ఇతను పాటలు పాడుతున్నప్పుడు బహుశ: బాగా త్రాగి ఉంటారు కూడా. అతని చివరిపాటల్ని తాము మాత్రమే వింటామని నావికులు అనుకున్నారేమో గానీ, అంతకు మించిన అద్భుతం ఒక్కటి జరిగింది. ఆరోజున ఆరియన నిజంగా హృదయాన్ని కరిగించే పాటలు పాడాడు. వాటిని వినేందుకు సముద్రంలోని డాల్ఫిన్లు అన్నీ అక్కడ వందల కొద్దీ జమ అయినాయట!
పాట ముగియగానే ఆరియన్ తనంతట తాను సముద్రంలోకి దూకేశాడు. 'అతని కాళ్ళు చేతులు కట్టెయ్యలేకపోయామే' అని ఆ పని పెట్టుకున్న నావికులు కొందరు బాధ పడ్డారుగానీ, "ఇంత నడి సముద్రంలోని షార్క్ చేపలు వాడిని ఈపాటికే చప్పరించేసి ఉంటయిలే; తాళ్ళు మనదగ్గర ఉంటే నష్టం లేదు" అని మిగిలినవాళ్ళు వాళ్లను ఊరడించారు. ఆపైన అందరూ "పీడ విరగడైంది-బంగారం సొంతమైంది" అని సంతోషంగా పాటలు పాడుకుంటూ వేగంగా తమ దారిన తాము పోయారు. అయితే ఎంత నడి సముద్రమైనా, వాళ్లు ఊహించినట్లు ఆరియన్ మునిగీ పోలేదు; షార్కులకూ బలి కాలేదు. అతని పాటను విన్నదో ఏమోగాని, సముద్రంలో ఈది ఈది అలసి, మునిగిపోతున్న ఆరియన్‌ను డాల్ఫిన్ ఒకటి తన మీదికి ఎక్కించుకొని క్షేమంగా అవతలి ఒడ్డుకు చేర్చింది! 'కేప్టీనేరమ్' అని పిలిచే ఆ తీరంలో సముద్ర దేవత గుడి ఒకటి ఉండేది. అక్కడి తేరుకుంటూ కొన్నాళ్ళు గడిపిన ఆరియన్ను అక్కడి ప్రజలు "డాల్ఫిన్‌నెక్కి వచ్చిన వీరుడు" అని పిలుచుకున్నారట! వాళ్ళకు అందరికీ అతను తన సంగీతాన్ని, సంతోషాన్ని పంచాడట! అలా 'అతని సంగీతం మరింత పదునెక్కింది' అని చెబుతారు.
కొంత బలం వచ్చాక అక్కడినుండి బయలుదేరిన ఆరియన్ అనేక కష్టాల తర్వాత మెల్లగా కోరింత్ చేరుకున్నాడు. రాజు పెరియాందర్ అతన్ని చూసి ఆశ్చర్యాన్నీ సంతోషాన్నీ ప్రకటిస్తూ "ఏమైంది నీకు? ఇన్నాళ్లయినా రాకపోతే, ఇక మరి మా ఆస్థానాన్ని వదిలేసావేమో అని బాధ పడ్డాను!" అన్నాడు. ఆరియన్ ఆయనకు జరిగిన కథనంతా చెప్పి, నావికుల మోసాన్ని, డాల్ఫిన్లు తనని కాపాడటాన్ని వివరించాడు. అయితే ప్రయాణం వల్లనైతే నేమి, తను భరించిన కష్టాలవల్లనైతే నేమి ఆరియన్ గొంతు బాగా మారిపోయి ఉన్నది. రాజుకు అతను చెప్పిన ఈ కథ నమ్మశక్యం కాలేదు. దాంతో పాటు అసలు ఇతను "ఆరియన్ కాదేమో" అని కూడా అనుమానం వచ్చింది. అందుకని ఆయన ముందుగా ఆరియన్‌ను ఇంట్లో నుంచి బయటికి రాకుండా కట్టడి చేసి, వైద్య సదుపాయాలు వగైరా కల్పించి, ఆనక సిసిలీ నుండి రావలసిన పడవకోసం కబురు పంపాడు. ఆ పడవ కోరింత్ చేరుకోగానే సైనికులు అందులోని నావికులను అందరినీ రాజాజ్ఞ ప్రకారం పెరియాందర్ ముందు ప్రవేశపెట్టారు.
రాజుగారు ఆ నావికులతో "మీ ప్రయాణాలు బాగా జరుగుతున్నాయా? ప్రఖ్యాత గాయకుడు ఆరియన్ ఎలా ఉన్నాడు? తిరిగి ఎప్పుడు వస్తాడట?" అని అడిగాడు. కంగారు పడిన నావికులు, బయట పడకుండా "బాగున్నాడు ప్రభూ! సిసిలి అంతటా సంగీతాన్ని ప్రవహింపజేస్తున్నాడు. ఒకసారి అక్కడంతా పాటలు పాడాక, అప్పుడు తిరిగి వస్తాడు" అనేసారు. అంతలోనే తెరవెనకనుండి బయటికి వచ్చి నిలబడ్డాడు ఆరియన్. తను సముద్రంలోకి దూకినప్పుడు వేసుకున్న దుస్తులే వేసుకొని ఉన్నాడతను! అతన్ని, అతని నవ్వుని చూసిన నావికులంతా "భూతమేమో!" అనుకొని వణుక్కుంటూ సాగిలపడ్డారు. పెరియాందర్ గట్టిగా అడగగానే తమ నేరాన్ని పూర్తిగా ఒప్పుకున్నారు. అయినా కథని పూర్తిగా నమ్మని పెరియాందర్ తన రాజ్య ప్రజల్నే కాకుండా అనేక మంది యాత్రికుల్ని కూడా ఈ విషయమై ప్రశ్నించాడట. వాళ్లలో కొందరు చెప్పిన ప్రకారం అతను కేప్టినేరమ్ చేరుకొని అక్కడి గుడిలోకూడా చూసాడని, 'సముద్రంలో డాల్ఫిన్‌పై తేలుతూ వస్తున్న ఆరియన్ ' కంచు విగ్రహాన్ని ఆ గుడిలో చూసిన తర్వాతగానీ అతనికి డాల్ఫిన్‌ల మంచితనంపై గురి కుదరలేదని, చెబుతారు.
ఈ కథను వెతికి తీసిన చరిత్రకారులు కూడా చాలామంది దీన్ని నమ్మలేదు. కానీ ఈ మధ్య కాలంలో మనకి డాల్ఫిన్ల గురించి అనేక సంగతులు తెలిసాయి. అవి చేపల జాతి సముద్ర జీవులు కాదు: భూమి మీద తిరిగే జంతువులలాగా అవి కూడా క్షీరదాలు- అంటే పిల్లలకు పాలు ఇచ్చి పెంచుతాయి! అంతే కాదు; అవి శబ్దాల ద్వారా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి! మనుషులతో స్నేహం చేయగలుగుతాయి! ఆధునిక కాలంలో కూడా సముద్రంలో చిక్కుకుపోయిన వారిని కొందరిని అవి కాపాడాయి! అట్లా చూస్తే ఈ కథ ఏమంత కట్టుకథ కాదనిపిస్తుంది. అయినా మరి నున్నగా జారే డాల్ఫిన్ మీదినుండి జారిపోకుండా ఆరియన్ ఎలా వచ్చాడో?! మనషులు, జంతువులు ఒకప్పుడు నిజంగానే స్నేహంగా ఉండేవాళ్లేమో?! -ఇవన్నీ మీకై మీరు కనుక్కోవాలి; ఆ క్రమంలో పాత కట్టు కథల్లో దాక్కున్న నిజాల్ని బయటికి తేవాలి.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో