TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
ఆలోచించాలి
నల్లమల అడవుల్లో వీరసముద్రం చెరువు చుట్టుప్రక్కల పెద్ద పెద్ద ఏనుగుల గుంపులు నివసించేవి. దట్టమైన ఆ అడవుల్లో దొరికే మెత్తని పచ్చిగడ్డిని, ఎత్తైన చెట్ల మీద చివురించే లేత ఆకుల్ని నములుతూ, ఎల్లప్పుడూ పుష్కలంగా నీళ్ళుండే ఆ చెరువు మీద ఆధారపడి హాయిగా జీవించేవి. అదే చెరువులో మొసళ్ళు కూడా ఉన్నాయి. నీళ్ళు త్రాగడానికి వచ్చే జింకలు, గాడిదలు మొదలైన చిన్న జంతువుల్ని పట్టి చంపి తినేవి అవి. సామాన్యంగా ఏనుగుల జోలికి వచ్చేవి కావు: పెద్దగా ఉంటాయని కొంత, అన్నీ కలిసి కట్టుగా ఉంటాయని మరికొంత, భయం వాటికి. సాధారణంగా ఏనుగులు గుంపుగా వచ్చి, చెరువులోని నీళ్ళన్నీ కలిసి ఒక గుంపుగా త్రాగి వెళ్లిపోయేవి. అవి అట్లా గుంపుగా వచ్చినప్పుడు చూస్తే మొసళ్ళకి భయం. ఒకసారి ఒక మొసలికి వేరే ఆలోచన వచ్చింది. "అన్ని ఏనుగులు వస్తున్నాయి కదా, ఆ గుంపులోంచి కనీసం ఒక్క ఏనుగునైనా పడితే ఏమౌను?" అనుకొంది.
వెంటనే అది ఓ దుష్టపన్నాగం పన్నింది. పాక్కుంటూ పోయి, ఎక్కడెక్కడో ఉన్న లేత వెదురు పిలకలను, మంచి పచ్చగడ్డిని నోట కరుచుకొని వచ్చి, చెరువు అంచునే ఒక చెట్టు మరుగున దాచి ఉంచింది. ఆరోజు తెల్లవారుతుండగానే తను పోయి, అక్కడికి దగ్గర్లోనే ఇసకలో పడుకున్నది. కొంచెం సేపటికి ఏనుగులగుంపు వచ్చింది. అన్ని ఏనుగులూ నీరు త్రాగి వెళ్ళిపోసాగాయి. మొసలి అదృష్టం కొద్దీ వాటిలో ఒక ఏనుగు మటుకు ఇంకొన్ని నీళ్ళు త్రాగుతూ కొంత వెనక పడింది. "అమ్మయ్య! ఇక దొరికినట్టే, ఏనుగు!" అనుకొని మొసలి తను మరుగున దాచిన గడ్డిని, వెదురు మొలకలను నీళ్ల మధ్యకు చేర్చి అల్లాడించటం మొదలు పెట్టింది. అలా కదలాడుతున్న గడ్డి ఏనుగు దృష్టిని ఆకర్షించింది. వెంటనే దానికి నోరు ఊరింది కూడా.
"లేత వెదురు చిగుర్లు!" అని ఆశ పుట్టింది. చూస్తే అవతల తన మిత్రులందరూ వెనుదిరిగి పోతున్నారు. 'తను ఈ కాస్తంతా తినేసి పరుగు పెడితే వాళ్లను చేరుకోవచ్చులే' అనుకొని నీళ్లలోకి దిగి అటుగా నాలుగడులు వేసింది ఏనుగు. అంతే- మొసలి చటుక్కున దాని కాలు పట్టుకున్నది! ఏనుగు పెనుగులాడింది. మొసలి తన పళ్ళను ఇంకా గట్టిగా దాని కాలులోకి దింపింది. ఇక బాధతో ఘీంకారాలు మొదలు పెట్టింది ఏనుగు. నీళ్లలో పొర్లింది, మిగిలిన కాళ్ళతో ఎగిరేందుకు ప్రయత్నించింది, ఎలాగైనా మొసలిని నీళ్ళ బయటికి ఈడ్చాలని చూసింది, రెండవ కాలితో మొసలి తలమీద మోదేందుకు ప్రయత్నించింది. ఏం చేసినా మొసలి పట్టు వీడట్లేదు.
ఆ ఏనుగు ఘీంకారాలు వినబడినై, మందలోని మిగిలిన ఏనుగులకు. తమ సహచరుడికి ప్రమాదం సంభవించిందని వాటికి అర్థమైంది. అన్నీ గబగబా వెనక్కి తిరిగి వచ్చి, మొసలికి చిక్కిన ఏనుగును చూసినై, ఏనుగుల నాయకుడు వాటికి తక్షణం ఆదేశాలు జారీ చేశాడు- ఒక ఏనుగు వెళ్ళి తొండంతో అక్కడికి దగ్గర్లోని మర్రి చెట్టును ఒకదాన్ని గట్టిగా పట్టుకొన్నది. మరొక ఏనుగు దాని కాళ్లను తొండంతో చుట్టి పట్టింది. మరొక ఏనుగు దాని కాళ్ళను.. అట్లా ఒక ఏనుగుల గొలుసు తయారయింది. ధైర్యశాలులైన ఏనుగులు కొన్ని ఆ క్రమంలో నీళ్లలోకి కూడా దిగినై! అన్నీ కలిసి ఏనుగును మొసలితో సహా బయటికి లాగేందుకు ప్రయత్నిద్దామనుకున్నై.
తెలివైన ఏనుగొకటి వాటిని ఒక్క క్షణం ఆగమన్నది. "నీటిలో మొసలికి అమితమైన శక్తి ఉంటుంది! మీరు ఎందరు కలిసి లాగినా అది మనవాడిని అంత సులభంగా విడచి పెట్టదు. నేను దాన్ని బలహీనపరుస్తాను- ఆగండి" అని అది పరుగున వెళ్ళి, అల్లంత దూరాన పడి ఉన్న ఓ పెద్ద, బరువైన దుంగను తొండంతో చుట్టి ఎత్తుకున్నది; దుంగతోబాటు వేగంగా వచ్చి, మొసలి తలపైన దుంగతో బలంగా ఒక్క పెట్టు పెట్టింది. దెబ్బకు మొసలి కళ్ళు బైర్లు కమ్మాయి! దాని పట్టు కొంచెంగా తప్పింది. అవకాశాన్ని అంది పుచ్చుకున్న ఏనుగుల గొలుసు తమ సహచరుడిని గబుక్కున బయటికి లాగేసింది!
దెబ్బ తిన్న మొసలి, ఏనుగుల్ని తిట్టుకుంటూ, బుడుంగున మునిగి తన దారిన తాను పోయింది. అటుపైన ఏనుగులన్నీ సంతోషంగా పోతున్నప్పుడు, ముసలి ఏనుగు ఒకటి వాటికి సుద్దులు చెప్పింది: "చెరువు మధ్యలో వెదురు మొక్కలు, పచ్చని గడ్డి కనిపించటం అసహజం కదా?! అట్లా సహజంగా లేనివి ఏమైనా కనిపిస్తే గబుక్కున ముందుకు పోకూడదు. ఒక క్షణం ఆగి ఆలోచించాలి తప్పకుండా. మనల్ని మోసం చేయడానికి మొసలి, మనిషి లాంటి జంతువులు రకరకాల ఉచ్చులు పన్నుతుంటాయి. కృత్రిమంగా కనబడిన ఆహార పదార్థాలపట్ల జాగరూకతతో ఉండాలి. అత్యాశతో వాటి జోలికి పోతే ఇట్లా అవుతుంది. అందరికీ అర్థం అయిందనుకొంటాను. 'అత్యాశే అన్ని అనర్థాలకూ మూలం'" అని. ఏనుగులన్నీ తలలు ఊపి, ఘీంకారాలతో తమ సమ్మతిని తెలియజేసాయి.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో