Facebook Twitter
అందమైన రాజ్యం

అందమైన రాజ్యం

 


అది ఒక అందమైన సామ్రాజ్యం. ఆ దేశపు రాజయిన 'శ్రీ శ్రీ శ్రీ వెంకటా చలపతి' గారు దేవుడికి మరో రూపం. ప్రజలంటే ఆయనకు ప్రాణం. ప్రజల మేలుకోసం తన ప్రాణాలు కూడా లెక్కచేయని మంచి మనిషి ఆయన. ప్రజలకు కూడా ఆయనంటే ఎంతో ఇష్టం, ప్రేమ, గౌరవం. ఎంతో అందమైన ఆ దేశంలో ఆ రాజావారి కోట చాలా‌ గొప్పగా ఉండేది. రంగు రంగులు పూల చెట్లు, వాటిపైన అందంగా ఎగిరే పలు రకాల సీతాకోక చిలుకలు- వాటి మధ్యన నెలకొని ఉండేది ఆ కోట. ఎందరో కవులు ఆ దేశాన్ని గురించి, ముఖ్యంగా ఆ కోట గురించి వర్ణించారు. ఆ దేశం అంతటా పచ్చదనం నిండి ఉండేది మరి.

అయితే రాజా వెంకట చలపతి గారికి సంతానం లేదు. ఎవరైనా‌ ఈ మాటను అడిగితే‌ "నాకు పిల్లలు లేరా? ఎవరు చెప్పారు? నా ప్రజలే నా పిల్లలు" అనేవారాయన. మనస్సులో ఎంతో బాధ ఉన్నా, పైకి మటుకు నవ్వుతూ, ఆనందంగా ఉండేవారు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు- "నీ కోసం కాదు- నలుగురి కోసం జీవించు" అని. ప్రతీ కథలోనూ రాక్షసులు ఉన్నట్లు, ఈ కథలో కూడా ఇద్దరు ఉన్నారు- ఒకడు ఫ్యాసీ, ఇంకోడు జ్యాసీ. ఫ్యాసీ ఒక దొంగ సన్యాసి. జ్యాసీ ఒక ప్రజానాయకుడు. వీళ్లు ఇద్దరూ అన్నదమ్ములు- కానీ ఈ విషయం ఎవరికీ తెలీదు.

ఫ్యాసీ గొప్ప రుషిలాగా నటిస్తూ ప్రజలని మోసం చేసేవాడు. జ్యాసీ ప్రజలకు ద్వేషం నూరిపోస్తూండేవాడు. చక్కని ఆ దేశాన్ని నాశనం చేయాలని ఆశించేవాళ్ళు వాళ్ళిద్దరూ. ఫ్యాసీ ప్రజలలోకి వెళ్ళి "మన రాజు వెంకటా-చలపతి గారు ప్రతీ నిమిషం ఎంతో బాధ పడుతున్నారే, మీరు దాన్నిగురించి ఏమీ చేయట్లేదు " అనటం‌మొదలు పెట్టాడు. "అయితే ఏం చేయాలి చెప్పండి స్వామీ? ఆయనకి సంతానం కలగాలంటే ఏం చేయాలి?" అన్నారు ప్రజలు.

"నాకు నిన్న దేవీ మాత నుండి ఒక సూచన వచ్చింది. అదేమిటంటే వెంకటాచలపతి గారు రాజ్యం వదిలివెళ్ళాలి. జ్యాసీ రాజ్యాన్ని పాలించాలి. అప్పుడే అందరికీ మేలు జరుగుతుంది" అన్నాడు ఫ్యాసీ. పాపం ప్రజలు ఆ మాటలు నిజమని నమ్మారు. రాజుగారిని రాజ్యం వదిలి వేయమని బలవంతం చేశారు. వెంకటాచలపతిగారికి అంతులేని కోపం వచ్చింది. "ప్రజలారా మీరంతా మోసపోయారు. అధికారం కోసం మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నాడు జ్యాసీ" అన్నాడాయన. “కాదు ప్రభూ! ఈ సంగతి మాకు ఫ్యాసీ సన్యాసి వివరించారు. దీనికీ‌ జ్యాసీకీ ఏ సంబంధమూ లేదు" అన్నారు ప్రజలు.

 

"ఇప్పుడే వెళ్ళి ఆ దుర్మార్గుల అంతు చూస్తాను' అని ఆవేశంగా ఫ్యాసీ ఆశ్రమానికి వెళ్ళారు వెంకటా చలపతిగారు. అక్కడ జరిగిన పోట్లాటలో ఫ్యాసీ-జ్యాసీ లతో‌పాటు ఆయనా మరణించారు. ఒంటరివారైన ఆ దేశ ప్రజలకు రాజావారి గుర్తుగా మిగిలింది ఇక ఆ కోట మాత్రమే. దాన్ని చూసినవాళ్ళంతా ఈరోజుకీ రాజావారి కథని గుర్తుచేసుకుంటూ ఉంటారు.