TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
పందొమ్మిదివందల ఎనభయ్యవ సంవత్సరం. ‘విపుల:చతుర’కి సబ్ ఎడిటర్ గా ఉన్న రోజులు. ఆఫీసులో లంచ్ అయిన తర్వాత కొలీగ్సంతా కలసి, కెసిపి గెస్ట్ హౌస్ దగ్గరి పాన్ షాప్ కి వెళ్లేవాళ్లం. పాన్ బిగించి, అక్కడ సిగరెట్ తాగేవాళ్లం. ఆ షాప్ లో మ్యాగజైన్లు కూడా అమ్మజూపేవారు. ఆంధ్రభూమి వీక్లీలు ఇలా వచ్చి అలా అమ్ముడయ్యేవి. లేట్ చేస్తే వీక్లీ దొరికేదికాదు. సుమారుగా యాభై అరవై వీక్లీలు ఓ అరగంటలో అమ్ముడయ్యేవి. చూసి ఆశ్చర్యపోయేవాణ్ణి. హాట్ కేక్ ల్లా అమ్ముడుపోవడం అంటే...ఇదే అనుకునేవాణ్ణి. ఆంధ్రభూమిని ఎందుకింతలా కొంటున్నారు? పాఠకులు ఆ పత్రికను ఎందుకు అభిమానిస్తున్నారంటే...అందులో యండమూరి రచన ‘తులసీదళం’ సీరియల్ గా వస్తున్నదన్నారు.
ఆనాటికి మల్లాది వెంకటకృష్ణమూర్తిగారు నాకు మంచిమిత్రులు. యండమూరిగారితో నాకు పరిచయంలేదు. ఆంధ్రభూమి వ్యవహారం చూసిన తర్వాత ఆయన్ని ఓసారి చూడాలనిపించింది. ఆయన్ని కలవాలనిపించింది. అలాగే చేస్తేగీస్తే వీక్లీకి ఎడిటర్ గా పనిచెయ్యాలికాని, మంత్లీలకి పనిచెయ్యకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను.
ఆ ప్రస్థానంలోనే ‘ఉగాది’ వీక్లీకి ఎడిటర్నయ్యాను. యండమూరితో సీరియల్ రాయించాలని మేనేజ్ మెంట్ తో పట్టుబట్టాను.
రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తారో ఏమో! ఆలోచిద్దాం అన్నది మేనేజ్ మెంట్.
ఓకే అని ఉంటే...వెళ్లి యండమూరిని కలిసేవాణ్ణే! వాళ్లు ఓకే అనకపోవడంతో...యండమూరితో నా పరిచయం పోస్ట్ పోన్ అయింది.
కొన్నాళ్లకి ఆదివారం ఆంధ్రజ్యోతిలో జాయినయ్యాను. అందులో వారం వారం ఓ ప్రముఖుణ్ణి ఇంటర్వ్యూ చేసేవాళ్లం. అలా ఓ వారం ఇంటర్వ్యూచేసేందుకు యండమూరిని మొదటిసారిగా కలిశాను. బంజారాహిల్స్ లో వాళ్లింట్లోనే కలిశాను.
ఏం తీసుకుంటారు? అడిగారు యండమూరి.
కాఫీ అన్నాను.
నవ్వారు యండమూరి.
కాఫీ తెప్పించారు. తాగి, రెచ్చిపోయాను.
మీ నవలలన్నీ కాపీ నవలలే! మీ ఫలానా నవల, ఫలానా ఇంగ్లీషు నవలకు కాపీ. మీ కథలు కూడా కాపీలే అంటూ ఏంటేంటో వాగాను. అన్నీ విన్నారాయన. విని ఆయనిలా అన్నారు.
కాపీ కొట్టేవారు గుడ్ ఆర్టిస్టులు. దొంగిలించేవారు గ్రేట్ ఆర్టిస్టులన్నాడు పికాసో. మీరు అంటున్నట్టుగా ఇంగ్లీషు రచనలు చదివి, ఆ ప్రేరణతో నేను తెలుగు రచనలు చేసి ఉంటే...నేను గుడ్ రైటర్ని. అందులో వస్తువుని యథాతథంగా దొంగిలించి ఉంటే... గ్రేట్ రైటర్ని్. నేను ఏ పాటి రైటర్నో మీరే నిర్ణయించండి.
ఆ మాటకి పగలబడినవ్వాను.
ఇతరులను కాపీకొట్టడంలో...అంటే అనుసరించడంలో తప్పులేదు. తననితాను కాపీకొట్టడమే విషాదం అని నవ్వారు యండమూరి.
రచయితలంతా రాసిందే రాస్తున్నారిప్పుడు. గమనించారా? అడిగారు. తర్వాత ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం.
ఇంటర్వ్యూ ముగిసింది.
ఆ ఇంటర్వ్యూకి మంచి రెస్పాన్సేవచ్చింది. అప్పటినుంచీ ఎవరిని ఇంటర్వ్యూ చెయ్యాలన్నా నన్నే పంపేది ఆంధ్రజ్యోతి.
ఓసారి సినిమా డిస్కషన్స్ కి ప్రొడ్యూసర్ అశ్వనీదత్ గారు రమ్మన్నారు. నేను వెళ్లలేదు. పనిచేసుకుంటూ కూర్చున్నాను. అప్పుడు ఆంధ్రజ్యోతి ఎండీ జగదీశ్ ప్రసాద్ గారు పిలిచి, వెళ్లమన్నారు.
సంపాదించుకో శర్మా! వెళ్లు అన్నారు.
వెళ్లాను. ఆసరికి అక్కడ సినీరచయిత సత్యానంద్, యండమూరిసహా మేర్లపాకమురళీ, శైలకుమార్ ఇంకా ఒకరిద్దరు రచయితలు ఉన్నారు. నన్నుచూస్తూనే యండమూరి...
మీ ఎండీకి చెప్పి, మిమ్మల్నిక్కడకి రప్పించింది నేనే! మీకు డ్రామా బాగా తెలుసునని ఎవరో అన్నారు. మాకు మీరు ఏ మేరకు ఉపయోగపడతారో చూద్దాం అన్నారు.
కథ చెప్పారు.
డిస్కషన్స్ ప్రారంభమయ్యాయి.
నాకు కథ నచ్చలేదు. ఆ మాటే చెప్పాను యండమూరితో. ఆశ్చర్యపోయారాయన.
ఎందుకు నచ్చలేదు? అడిగారు. చెప్పాను.
మిమ్మల్ని ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ రాఘవేంద్రరావుగారి దగ్గరకు తీసుకుని వెళ్తారు. కలసి రండి అన్నారు.
కూలీ నెంబర్ వన్ షూటింగ్ అవుతున్నదప్పుడు. నన్ను రాఘవేంద్రరావుగారికి పరిచయం చేశారు అశ్వనీదత్ గారు.
మీకు కథ ఎందుకు నచ్చలేదు? అడిగారు రాఘవేంద్రరావు. ఎందుకు నచ్చలేదో చెప్పాను. నవ్వారాయన. సరే! వెళ్లి రండని పంపించేశారు. ఆ రోజు శివరాత్రి. నాకు బాగా జ్ఞాపకం.
ఇలా అప్పుడప్పుడూ యండమూరిని కలిసే అవకాశాలు కలిగాయి. తర్వాత ఇద్దరికీ పరిచయం పెరిగింది.
హిప్నాటిస్ట్ నాగరాజుని ఇంటర్వ్యూ చేసి ఆంధ్రజ్యోతిలో ప్రచురించాను. అందుకు ఆయన ఆనందించి, నాకు గిప్ట్ గా కొంత డబ్బును ఇవ్వబోయారు. నేను వద్దన్నాను.
ఇంటర్వ్యూ వచ్చిన మూడో రోజో, నాలుగో రోజో ఆయన చనిపోయారు. అప్పుడు తొలిసారిగా నాకు యండమూరి ఫోన్ చేశారు.
నేను నాగరాజును చూసేందుకు వెళ్తున్నాను. మీరొస్తారా? వస్తారంటే...మిమ్మల్ని మీ ఆఫీసుదగ్గర పికప్ చేసుకుంటాను అన్నారు.
వస్తానన్నాను. యండమూరివచ్చి నన్ను పికప్ చేసుకున్నారు. ఇద్దరం నాగరాజు మృతదేహాన్ని చూసి బాధపడ్డాం. తిరుగు ప్రయాణంలో నాగరాజు నాకు డబ్బు ఇవ్వజూపిన విషయం యండమూరికి చెప్పాను.
తీసుకోలేదు కదా! మంచిపని చేశారు. తీసుకుని ఉంటే...జీవితాంతం బాధపడాల్సి వచ్చేది అన్నారు.
నేను టీవీ రైటర్నయ్యాను. రెండు చేతులా సీరియల్స్ రాస్తున్నాను. ఒక లోకేషన్లో యండమూరిని కలిశాను. ఆయనక్కడ ఏదో సీరియల్ డైరెక్ట్ చేస్తున్నారు. నమస్కరించాను.
బాగున్నారా? వింటున్నాను, మీ గురించి. మీకు టీవీరంగం పెర్ ఫెక్ట్! సెంటిమెంట్ మీరు బాగా పండిస్తారు అన్నారు.
నవలపట్టుకోకుండా, టీవీకి అతుక్కుపోయేట్టుగా మహిళల్ని మార్చగలిగితే...మీరు సక్సె్స్ అని నవ్వారు.
నేను టీవీరంగంలో సక్సస్ అయ్యానో లేదో తెలియదుగానీ, ఆ రంగంలో పదిహేనేళ్లపాటు నిలదొక్కుకున్నాను.
నవ్యకు ఎడిటర్నయ్యాను. అప్పుడు యండమూరి తమ్ముడు కమలేంద్రనాథ్ పరిచయం అయ్యారు. ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. కబుర్లలో ఆయన వీరేంద్రనాథ్ గురించి చెబుతూ ‘అన్నయ్య అలాగా! అన్నయ్య ఇలాగా!’ అని పదేపదే అనడంతో నాకూ యండమూరి ‘అన్నయ్య’ అయిపోయారు. యండమూరికి ఫోన్ చేసినప్పుడల్లా నేనూ ఆయన్ని ‘అన్నయ్యా’ అని పిలవడం ప్రారంభించాను.
కష్టకాలంలో రాయమంటే...నవ్యకు రెండు మూడు సీరియల్స్ రాసిచ్చారు యండమూరి. ఆ రోజుల్లోనే నేను వీక్లీలో రామాయణం రాసేవాణ్ణి.
ఒకసారి చెన్నయ్ నుంచి ఫోన్ చేశారు యండమూరి.
ఫ్లైట్ లో నా రామాయణం చదివారట! కళ్లు చెమర్చాయి అన్నారు.
పురాణాలను సరళంగా బాగా రాస్తున్నావు అని మెచ్చుకున్నారు.
పురాణాలు చదువుతావా అన్నయ్యా? అడిగాను.
ఎందుకు చదవను? రామాయణ మహాభారతాలంటే...నాకు చాలా ఇష్టం అన్నారు.
ఒకానొక సాయంత్రం ఫోన్ చేశారు.
శర్మా! నీ రచనలనూ, నిన్నూ అభిమానించే ప్రొడ్యూసర్ ఒకరున్నారు. ఆయన నిన్ను చూడాలనుకుంటున్నారు. మా ఇంటికి వస్తావా? అడిగారు.
ఆరోజు బుధవారం. వీక్లీకి డెడ్ లైన్. ఎంతరాత్రయినా పేజీలు విజయవాడ పంపించి తీరాలి.
రాలేను! సారీ అన్నయ్యా అన్నాను.
సరే! నీకు తీరిక దొరికినప్పుడు మా ఇంటికి ఓసారి రా! సరదాగా కబుర్లాడుకుందాం అన్నారు. అని అయిదేళ్లయింది. తీరిక దొరకలేదా? అంటే రోజంతా తీరికే! కాని వెళ్లలేకపోయాను.
మొన్న 2024 ఆగస్టు 9న మిత్రులు శ్రీ సుబ్బరాయశర్మసహా వారింటికి మళ్లీ ఆహ్వానించాడు అన్నయ్య.
సుబ్బరాయశర్మగారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటనలో నిజాయితీ ఉంటుంది.
నిజాయితీ లేని నటన నూతిలో శవంలా తేలిపోతుందనేవాడు మా నాన్న. ఏ పాత్ర పోషించినా సుబ్బరాయశర్మగారు తేలిపోవడం నేను చూడలేదు.
నన్ను పికప్ చేసుకునేందుకు కారులో వచ్చారు శర్మగారు. ఇద్దరం యండమూరి ఇంటికి వెళ్లాం.
అన్నయ్య ఇన్నాళ్లకు దొరికాడు. నా ప్రజ్ఞంతా చూపించేందుకు అవకాశం దొరికిందని అనేక విషయాలగురించి అనేకంగా మాట్లాడాను ఆ సాయంత్రం. వింటూ నవ్వుతూ కూర్చున్నాడు అన్నయ్య. విజేతలు ఎక్కువగా మాట్లాడరు. ఎక్కువగా వింటారనిపించాడు. నా మాటలువింటూ నన్ను గౌరవించాడు.
మాట్లాడడం అంటే...మనకు తెలిసింది మళ్లీమళ్లీ చెప్పడమే! అదే ఎదుటివ్యక్తి మాట్లాడుతుంటే...వింటూ కూర్చుంటే కొత్తకొత్త విషయాలు తెలుస్తాయి. ఈ కిటుకు ఏనాడో తెలుసుకున్నాడన్నయ్య అనుకున్నాను.
వద్దు వద్దన్నా వినలేదు. యండమూరి అన్నయ్యనూ, సుబ్బరాయశర్మగారినీ శాలువాలు కప్పి సత్కరించాను. మిత్రుడు జెన్నీని గట్టిగా కౌగలించుకున్నాను.
వస్తానని బయల్దేరాను.
ఈసారి వచ్చేటప్పుడు శాలువలు పట్టుకురాకు. నువ్వు రా! చాలు! అన్నాడు అన్నయ్య. డాబా మెట్లు దిగుతుంటే...‘జాగ్రత్త జాగ్రత్త’ అని హెచ్చరించాడు.
కారెక్కి ఇంటికి వస్తూ...సుబ్బరాయశర్మగారిని గట్టిగా కౌగలించుకున్నాను.
ఏమైంది? అడిగారాయన.
ఆలోచించడం చాలా ఈజీసార్. నటనే కష్టం. ఎవరి ఆలోచననో మీ ఆలోచనచేసుకుని, అందుకనుగుణంగా మీలాంటి నటులు నటిస్తారుచూడండీ...అద్భుతం. అందుకే కౌగలించుకున్నాను అన్నాను.
వర్షం కురుస్తున్నది.
మా ఇంటిదగ్గర నన్ను డ్రాప్ చేశారు శర్మగారు.
మళ్లీ కలుద్దాం అన్నారు. వెళ్లిపోయారు.
-జగన్నాథశర్మ