TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
భయపడేవాడిని లోకం మరింత భయపెడుతుంది. భయంతో కుంచించుకుపోయిన మనిషి జీవితంలో ఏదీ సాధించలేడు. భయానికి విరుగుడు సాహసం. ధైర్య సాహసాలున్న చోట అపజయానికి చోటుండదు. భయానికి ఎదురొడ్డి నిలబడటమే విజయానికి తొలి సోపానం.
నచికేతుడు పసిబాలుడు. విశ్వజిత్ యాగం చేసి తండ్రి బక్కచిక్కిన ఆవులను దానం చేయడం చూసి ఊరుకోలేకపోయాడు. 'నాన్నా! నన్నెవరికి దానం చేస్తావు? ' అని అడ్డు తగిలాడు. కోపావేశంలో నిన్ను యముడికి ఇస్తాను అని నోరుజారాడు వాజశ్రవుడు. తక్షణం నచికేతుడు యమసదనానికి బయలుదేరాడు. యముడు ఇంట లేడు. మూడురోజులు అలాగే ఎదురుచూస్తూ అక్కడే ఉండిపోయాడు నచికేతుడు. తిరిగి వచ్చిన యముడు బాలుడి ధైర్యసాహసాలకు మెచ్చి వరం కోరుకొమ్మన్నాడు. తన తండ్రిని క్షమించమని, యజ్ఞ ఫలం ఇప్పించమని కోరాడు. అగ్నివిద్య నేర్చుకున్నాడు. మూడో కోరిక క్లిష్టమైన మృత్యురహస్యం. యమధర్మరాజు నచికేతుడికి అగ్నివిద్య బోధించాక ఆత్మజ్ఞానివై జీవించమని తిరిగి భూలోకానికి పంపించాడు. పశ్చాత్తాపం చెందిన వాజశ్రవుడు కొడుకుకు పట్టంకట్టి
విశ్రాంతుడయ్యాడు. తన ప్రేయసి, కాబోయే భార్య ప్రమద్వర, పాముకాటుకు గురి అయి ప్రాణాలు విడిచిందని విని, ఆమెను వెతుక్కుంటూ రురు నాగలోకం వెళ్ళాడు. నాగరాజును ఒప్పించి ప్రమద్వరతో తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు. సావిత్రి సత్యవంతుడి ప్రాణాల కోసం యముడిని మెప్పించి మూడు వరాలు పొందింది. అత్తమామలకు నేత్రాలు, పోయిన రాజ్యం, తండ్రికి పుత్రసంతానం ఇప్పించింది. దీర్ఘసుమంగళిగా దీవెన అందుకుని, తెలివిగా భర్తను దక్కించుకున్నది. పురాతనమైనా, పురాణాలు నూతన ఆవిష్కారాలకు దారిదీపాలు- అన్న సత్యాన్ని ఈ మూడు ఉపాఖ్యానాలు చాటిచెబుతున్నాయి. భయం తీరాక, సంకల్పబలం సంతరించుకోవాలి. పూర్వాపరాలు బాగా ఆలోచించి, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాలి. ఆటంకాలు, అవరోధాలు ముళ్లకంపల్లా దారికి అడ్డుతగులుతాయి. మనసును చిక్కబట్టి ఏకాగ్రబుద్ధితో ముందుకు సాగాలి. ఎదురైన సమస్యల నుంచి నేర్చుకున్న పాఠాలు ప్రగతిని మరింత వేగవంతం చేస్తాయి. కార్యసాధన ధ్యేయంగా ఉన్నంతకాలం, పట్టుదలతో ఎంతటి గడ్డు పరిస్థితులనైనా అధిగమిస్తే అవకాశం స్వాగతం పలుకుతుంది. ఇది ముఖ్యంగా నేటి యువతరం తెలుసుకోవలసిన వాస్తవం.
ధైర్యం, సాహసం, సంకల్పం, ఏకాగ్రత, పట్టుదల, కార్యసాధనకు పంచప్రాణాలు. పంచపాండవులు అంతిమ విజయం సాధించిన విధంగా, పంచసూత్రాలను తు.చ. తప్పకుండా మనమూ ఆచరణలోనికి అనువదిస్తే, భయాలు తొలగుతాయి. జయాలు కలుగుతాయి. సాధించిన విజయం సజావుగా సాగాలంటే మరో రెండు శత్రు శిబిరాలను వశం చేసుకోవాలి. అహంకారం, మమకారం- అరిషడ్వర్గానికి వెన్నుదన్ను లాంటివి. చాపకింద నీరులా చేరి, మనల్ని పాతాళానికి అణచివేస్తాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు విష కీటకాలు, అహంకారం వల్ల దుర్యోధనుడు, మమకారం వల్ల దృతరాష్ట్రుడు చెడ్డారు. రాగద్వేషాలే అన్ని అనర్థాలకు మూలకారణాలు. వాటిని జయిస్తే, జీవితమంతా విజయవంతంగా కొనసాగుతుంది. ఒక వస్తువు పట్ల మితిలేని అనురాగమే, మరో వస్తువుపట్ల ద్వేషాన్ని రగిలిస్తుంది. దాచుకున్న ధనం పట్ల అతి వ్యామోహం, దొంగల పట్ల భయాన్ని పెంచుతుంది. అభయమే విజయానికి స్వాగత తోరణం.