TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
ఆడపిల్లలే ఆధారం
నాగసముద్రంలో రామయ్య, రాధమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు రాణి, రమేష్- ఇద్దరూ పదవ తరగతి చదువుతున్నారు. రామయ్య, రాధమ్మ పేదవారైనా, పిల్లల్ని మటుకు లోటు తెలీకుండా చూసుకునేవారు. రమేష్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. బాగా ఆడేవాడు కూడాను. ఒక రోజు వాళ్ల బడి తరపున ధర్మపురిలో క్రికెట్ ఆడేందుకు పదకొండు మందిని ఎంపిక చేసారు. రమేష్ కూడా అందులో ఎంపికయ్యాడు. వాడు క్రికెట్‌కోసం ఎంపికైనందుకు తల్లిదండ్రులు చాలా సంతోష పడ్డారు. వాడికి ప్రత్యేకమైన ఆహారం తెచ్చి పెట్టారు. తీరా ధర్మపురి వెళ్ళే రోజున- "అమ్మా నాకు రాను పోను, ధర్మపురి ఖర్చులకు గాను డబ్బు కావాలి. ఇవ్వు" అన్నాడు రమేష్.
"నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? మీ చెల్లెలు రాణి దగ్గర ఉన్నాయిగా, తీసుకో" అంది అమ్మ. "రాణీ! డబ్బులివ్వు!" అన్నాడు రమేష్. "నా దగ్గర ఎక్కడున్నాయి, లేవు!" అంది రాణి. "ఎందుకు లేవు- నేను చూపించనా? నీ పెట్టెలోవి డబ్బులు కాదా?" అన్నది అమ్మ. "అవి నేను కూలి పని చేసి సంపాదించుకున్న డబ్బులు. నీకు ఇవ్వను. నా స్కూల్ ఫీజుకోసం ఉంచుకున్నాను" అరిచింది రాణి. "నేను అడిగితే కూడా ఇవ్వవా? నీకెంత క్రొవ్వు?!" అంటూ రాణి దగ్గర ఉన్న డబ్బును లాక్కుని రమేష్ కు ఇచ్చింది రాధమ్మ. రాణి గొల్లున ఏడవటం మొదలు పెట్టింది. అది చూసి రాధమ్మకు ఇంకా కోపం వచ్చింది. "నువ్వు ఏమైనా మమ్మల్ని ఉద్దరిస్తావా? వాడు అంతే- మగవాడు కాబట్టి ఇస్తాము" అని అరిచింది. రాణి కళ్ళ నీళ్ళు పెట్టుకొని తండ్రివైపు చూసింది. తండ్రి కూడా 'అదంతే' అన్నట్లు తల త్రిప్పుకున్నాడు.
అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగాయి. భోజనం దగ్గర, పనుల దగ్గర, చదువుల దగ్గర- అన్ని చోట్లా రమేష్‌ను, రాణిని వేరు వేరుగా చూసేవాళ్ళు అందరూ. దాన్ని గురించి ఆలోచించిన కొద్దీ రాణికి తిక్కపట్టినట్లు అయ్యేది. చాలా బాధగా అనిపించేది. దాంతో చదువుల్లో అంతకు ముందు ఉన్నంత ఉత్సాహం కనబరచలేక పోయింది. రాణి వాళ్ల క్లాస్ టీచర్ గారు చాలా మంచిది. రాణి నిరుత్సాహంగా ఉండడం చూసి ఆవిడ 'ఏంటమ్మా అలా ఉంటున్నావు?" అని అడగ్గానే ఇంటిలో జరిగేదంతా చెప్పి కళ్ల నీళ్ళు పెట్టుకున్నది రాణి. "చూడు రాణీ! సమాజం ఇట్లానే ఉంది. ఆడపిల్ల అంటే చులకన. నువ్వు బాగా చదువుకొని మీ ఇంటివాళ్లకు, ఊరివాళ్లకు అందరికీ బుద్ధిచెప్పాలి. నీ పరీక్షకు కావలసిన డబ్బులు నువ్వే సంపాదించుకో. నీవల్ల కాకపోతే నేను నీకు డబ్బు సాయం చేస్తాను. స్వతంత్రంగా ఉండు; బాగా చదువుకో; జ్ఞానం పెంచుకో- అంతే. ఇంకేమీ ఆలోచించకూడదిప్పుడు!" అని ప్రోత్సహించిందావిడ.
అప్పటి నుండి రాణి తీవ్రంగా శ్రమించింది. రాత్రింబవళ్ళు చదివింది. రాను రాను ఇంట్లోవాళ్ళు కనీసం ఆ పాప పుస్తకాలకు కూడా డబ్బు ఇచ్చేవాళ్ళు కాదు. అయినా పాపం, ఏదో ఒక పని చేసుకుంటూ అవసరమైనన్ని డబ్బులు సంపాదించేది రాణి. చివరికి పబ్లిక్ పరీక్షలు వచ్చాయి. ఆ సమయంలో రాణి దగ్గర పరీక్షా కేంద్రానికి వెళ్ళేందుకు కూడా డబ్బులు లేవు. రమేష్ ప్రొద్దున ఏడు గంటలకు లేచి, ఆటోలో పరీక్షా కేంద్రానికి వెళ్ళేవాడు. తల్లి దండ్రులు వాడికి ఆటో డబ్బులు ఇచ్చి పంపేవాళ్ళు! కానీ, 'ఎట్లా వెళ్తున్నావు?' అని కూడా అడిగేవాళ్ళు కాదు, రాణిని!
రాణి ఆ సమయంలో రోజూ పొద్దున్నే నాలుగు గంటలకే నిద్ర లేచి, అడ్డదారిలో పరీక్షా కేంద్రానికి నడిచి పోయేది. అయినా పరీక్షలన్నీ బాగా రాసింది. చివరకు ఎలాగో పరీక్షలు గడచాయి.
సెలవుల తర్వాత ఫలితాలు వచ్చాయి: రాణికి జిల్లాలోనే అందరికంటే ముందుస్థానం! "నేను కాలేజికి వెళ్తానే, వాళ్ళు నన్ను ఉచితంగా చదివిస్తారు" అని రాణి అంటే తల్లిదండ్రులు చప్పుడు చేసేవాళ్ళు కాదు- "ముందు రమేష్ సంగతి చూడనివ్వు. ఎంత ఫీజు కట్టాల్నో ఏమో" అనేవాళ్ళు. చివరికి వాడికి ఇరవైవేలు కట్టి కాలేజీలో చేర్పించి, "ఆడపిల్లవి, నీకు చదువు అవసరమా! నోరు మూసుకొని ఇంట్లో కూర్చో" అనేశారు రాణిని! కొద్ది రోజులకు ఓ స్వచ్ఛంద సంస్థ వారు వచ్చి "మీ పాప చాలా చక్కగా చదువుతుంది. మేం మీ అమ్మాయికి ఉచితంగా విద్య అందిస్తాం. కలెక్టరుగారు ప్రత్యేకించి మీతో మాట్లాడమన్నారు. ఆ పాపను మాతో పంపించండి" అన్నారు.
అనగానే, "ఏం అవసరంలేదు. ఆడపిల్ల ఇంతవరకు చదువుకున్నది చాలు. మా అమ్మాయి- మా ఇష్టం" అన్నది రాధమ్మ! ఇక భరించలేని రాణి తిరగబడింది: "కుదరదు! నేను చదువుకుంటా. అంతే!" అంటూ వాళ్లతో గొడవ పెట్టుకుని స్వచ్ఛంద సంస్థ వారి సహాయంతో కాలేజీకి, హాస్టలుకు వెళ్లటం మొదలు పెట్టింది. తల్లిదండ్రులకు ఆమె మీద ఎంత కోపం వచ్చిందంటే, వాళ్ళు ఇక ఆమెను ఇంటి గడప త్రొక్కనివ్వలేదు! అయినా రాణి బాగా చదువుకున్నది. ప్రతి సంవత్సరం జిల్లాలో ప్రథమ స్థానంలో నిల్చింది. మంచి ఉద్యోగస్థురాలు కూడా అయ్యాక, అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చింది!
ఆ సమయానికి రమేష్ పెళ్ళి జరుగుతున్నది. ఇంటిలో అడుగు పెట్టగానే రాణి తల్లిదండ్రులు "ఏమే, ఎందుకు వచ్చావు? మళ్ళీ ఎందుకు వచ్చావు, వెళ్ళిపో!" అంటూ రాణిని బయటికి గెంటేశారు. రాణికి బాధ వేసింది గానీ, "ఆడపిల్ల అంటే అలుసు" అని తమ టీచర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చింది- తల్లిదండ్రుల మీద ఇంతైనా కోపం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోయింది. ఇక పెళ్ళి చేసుకున్న రెండు నెలలకే తల్లిదండ్రులను బయటికి గెంటేశాడు రమేష్. అప్పటినుండి రామయ్య, రాధమ్మ ఊళ్ళో సత్రంలో ఉండటం మొదలు పెట్టారు. అది తెలుసుకున్న రాణి వెంటనే వచ్చి, "అన్న బయటికి గెంటేస్తేనేమి? నేను ఉన్నాను కదా, రండి! మన ఇంటికి వెళ్దాం!" అని తన ఇంటికి తీసుకు వెళ్ళింది. వాళ్లకు ఏ లోటూ లేకుండా బాగా చూసుకున్నది. రామయ్యకు, రాధమ్మకు ఇప్పుడు అర్థమైంది- "ఆడపిల్లలే ఆధారం" అని.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో