గెలుపు గమనం

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌విత‌ల పోటీలో క‌న్సొలేష‌న్ బ‌హుమ‌తి రూ. 516 గెలుపొందిన క‌విత‌   లక్ష్యం!! నీ నిదురను తరుముతున్నది! పగటి కలల దారిలో గమనం వలదన్నది! ఆశ!!అదేపనిగా ధైర్యం చెపుతుంది.. ఆకాశమే నీ హద్దంటూ ఊసులాడుతున్నది! కాలం!!మారుతున్న ఋతువులతో  ముందుకు తోస్తున్నది! వెనుతిరగని నైజాన్ని నేర్పుతున్నది!! వయసు!! వసంతాలను లెక్కపెడుతూ  వాకిట మోదుగపూవుల రంగుతో మేలమాడుతున్నది! సమయం మీరుతున్న కొద్దీ రెక్కల లోని సత్తువను  కూడగట్టుకుని ఆగకుండా పయనించమంటుంది.. పోరాటం!! పదే పదే ప్రయత్నించమంటుందీ.. పడినా ఫరవాలేదంటూ కెరటాలను చూపుతుంది.  !! ఓటమి!!ప్రతి మలుపులో తన పేజీని చదవమంటుందీ.. ఒక్కో మెట్టుపై తనను గెలవమంటూ సవాలు చేస్తుంది... అనుభవమై పాఠం నేర్పుతుంది సహనం!! మళ్లీ వచ్చే అవకాశం కోసం ఎదురు చూడమంటుందీ.. నిరాశ ఎందుకు నేస్తమా.. నేనే నీ తోడు నన్నది! విజయం! ప్రతీ స్ఫూర్తి దాతకు ప్రణామం చేస్తుంది.. శిఖరం చేరుకున్న గర్వంతో వినయం వదలవద్దన్నది! వ్యక్తిత్వమే నీ శాశ్వత అస్తిత్వమని గుర్తించమంటుంది! ర‌చ‌న‌:  విజ‌య రామ‌గిరి  

కరోనా చాలా నేర్పింది

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌విత‌ల పోటీలో తృతీయ బ‌హుమ‌తి రూ. 1,116 పొందిన క‌విత‌   కలివిడిగా ఉంటూనే విడిగా ఉండడం నేర్పింది. విడిగా ఉంటూనే మనసులు కలుపుకోవడం నేర్పింది ఇల్లంటే ఏమిటో నేర్పింది. అమ్మా నాన్న అక్కా అన్నా తమ్ముడూ చెల్లాయి – ఇల్లూ అంటే ఈ బాంధవ్యాలే - ఇటుకా సిమెంటూ కాదని నేర్పింది అన్నీ ఉన్నా ఏదో లేదని ఏడ్చే స్థాయి నుంచీ ఏది లేకపోయినా హాయి ఎటూ పోదన్న విషయం నేర్పింది ఎంజాయ్ చేయడమంటే, క్లబ్బులు, పబ్బులు – చాటింగులు, టిక్ టాక్ లూ మాల్స్ లో షాపింగులూ స్విగ్గీ వంటకాల దిగుమతులూ ఇవేమీ కానక్కర్లేదని ఘంట బజాయించి మరీ నేర్పింది. అవ్వా తాతలతో క్యారం బోర్డూ, అచ్చంగాయలూ ఆడించి మురిపించింది అమ్మా నాన్నలకి విశ్వనాథ వారూ, శ్రీపాదవారూ గుర్తుకు వచ్చేలా చేసింది. పరుగుల జీవితం వైపు పరీక్షగా చూసుకునే సమయాన్నిచ్చింది అమ్మకిప్పుడు వచ్చింది వేడిగా రుచిగా అన్నం పెట్టే చాన్స్ నాన్నమ్మ తో తీరిగ్గా కూర్చుని పాత విషయాలు తెలుసుకునే ఛాన్స్ నాన్న కూడా ఒకప్పుడు చాలా హ్యాండ్ సం అనిపించే ఆల్బం చూసే ఛాన్స్ అమ్మమ్మా వాళ్ళింటి గ్రూప్ ఫోటోలో వాళ్ళని పలకరించే ఛాన్స్ పదోతరగతి ఫోటో లోని మిత్రుల్ని గుర్తించే ఛాన్స్ అవసరం ఉన్నవాళ్ళని ఆదుకోవడంలో ఆనందం పంచే ఛాన్స్ అందరం కలిసి పాత బంగారు సీరియళ్ళ లో మునిగిపోయే ఛాన్స్ ‘ఎంజాయ్ కరోనా ‘ అంటూ కరోనా సెలవలిచ్చి కూర్చోబెట్టింది కరోనా చాలా విషయాలు తెలిసేలా చేసింది. నేతల్లోనూ మంచి వాళ్లున్నారని తేల్చి చెప్పింది డబ్బున్నోళ్ళకి కూడా మంచి మనసుందని తెలిపింది. బళ్ళోకి వెళ్లకపోయినా చదువువొస్తుందనీ గుళ్ళోకి వెళ్లకపోయినా పుణ్యమొస్తుందనీ నిర్ధారణ చేసింది ఎవరి పని వాళ్ళు చేసుకోగలం అన్న ధీమా కల్గించింది ఎవరు లేకపోయినా కాలమేమీ ఆగదని రూడీగా చెప్పేసింది కరోనా ఇంకా చాలానే చెప్పింది శుచి శుభ్రత ఆరోగ్యం కోసమే, ఆచారం మాత్రమే కాదు పొమ్మంది చేతులారా నమస్కరించడమనే సంస్కారం మనదని గుర్తు చేసింది అనవసరంగా రాసుకు పూసుకు తిరగడం, మోడరన్ ఫ్యాషన్ అంటూ ఎంగిలి తిండి తినడం లేని ప్రేమ వ్యక్తీకరించే కపట కౌగిళ్ళు, మోసపు ముద్దులూ పనీ పాటా లేకుండా బలాదూరు తిరగడాలూ లాంటివి ప్రమోదాలు కాదురా బడుద్దాయిలూ, పరమ ప్రమాదాలని హెచ్చరించింది. ఏతా వాతా భారతీయం ఇదే… మహమ్మారిని అడ్డుకునే ఆయుధం ఇదే…. కలివిడిగా ఉంటూనే విడిగా ఉండడం విడిగా ఉంటూనే మనసులు కలుపుకోవడం ర‌చ‌న‌:  నందిరాజు ప‌ద్మ‌ల‌తా జ‌య‌రామ్‌

సుప్రభాత శోభ

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌విత‌ల పోటీలో తృతీయ బ‌హుమ‌తి రూ. 1,116 పొందిన క‌విత‌   రేయి కప్పుకున్న చీకటి దుప్పటిని చించి పసిడి పూతను పూస్తున్నాడు సూర్యుడు రాత్రంతా వెన్నెల ధారల్లో తడిసి చిరు చలికి ముకుళించిన పూమొగ్గలు ఉలిక్కిపడి మేల్కొని అర్థనిమీలిత నేత్రాలతో జగతిని చూస్తున్నాయి....! గుక్కెడు నిశ్శబ్దం త్రాగి నిశి గుండెల్లోనిదురించిన కమలం ప్రొద్దున్నే గోరువెచ్చని కిరణాలతో తానమాడి కోనేటిని కమనీయ స్మృతులతో పరిమళలభరితం చేసింది...!!! భూమి బుగ్గల మీద ఉషస్సు తమకంతో చుంబనాల సంతకాలు చేస్తుంది..! తూరుపు తెరల్లోంచి తళుక్కుమన్న అరుణకాంతులు నా హృదయ కాగితం మీద కవితా చరణాలను రచిస్తున్నాయి...! పన్నీటితో కడిగిన ఆ మధుర క్షణాలు నేనెప్పుడో పారేసుకున్న ఆనందాన్ని కనుల ముందు నిలుపుతున్నాయి... మధుర భావాల సుమమాలలతో నా కంఠసీమను అలంకరిస్తున్నాయి...! ఒక్కో ప్రభాతకిరణం తన సుతిమెత్తని వేళ్ళతో నా మానస వీణను శృతి చేస్తూ... కమ్మని రాగాల జల్లులతో ఎదక్షేత్రాన్ని.... సస్యశ్యామలం చేస్తుంది....! అంతా అనురాగ మయం సమతా మమతల శుభోదయం...!! ర‌చ‌న‌: కాసర లక్ష్మీ సరోజా రెడ్డి  

చైత‌న్య‌పు ఖ‌డ్గాన్ని

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ ఉగాది క‌విత‌ల పోటీలో ద్వితీయ బ‌హుమ‌తి రూ. 2,116 పొందిన క‌విత‌  "చైత‌న్య‌పు ఖ‌డ్గాన్ని" నిన్నరాత్రి  నిషిద్ధాక్షరాలు రాలిపడ్డాయి నిశ్శబ్దపు పుటలనుండి నాలో నిగూఢమైన చైతన్యపు నేత్రాలు అస్కరుని కిరణాల్లా విస్తరించాయి విశ్వక్షేత్రంపై నిజానికి నేనిప్పుడు  నిరంతరాన్వేషిని దూసుకుపోతున్నాను  నిశిదుప్పటి దులిపేసి నిజ ఉషస్సు కేసి నేనిప్పుడు వేయాల్సింది లక్ష్యపు క్షేత్రంలో లక్షలనాట్లు నన్నో విజయగీతంగా  మలచుకోవాలి... ఎన్నో ఓటమి పర్వాలకు పర్యవసానంగా.. గెలుపు గుమ్మం చేరుకోవాలి నేనిప్పుడు నైరాశ్యపు నిబిడాంధకారాన్ని చీల్చిన చైతన్యపు ఖడ్గాన్ని వేకువతట్టుకు వెలుగును పూసిన తూరుపు సింధూరాన్ని నిట్టూర్పులు, నీరుగారడాలు నిన్నటి గతించిన క్షణానివి వెనుకంజ వేయడాలు వెక్కి, వెక్కి ఏడ్వడాలు కాలంచెల్లిన వాక్యాలు నే నడిచే గమనంలో నిరాశకు తావివ్వను,నీరసాన్ని రానివ్వను కన్నీటి కారకాలు సవాలక్ష   కర్తవ్యప్రేరకాలను  అన్వేషించడమేగా మనిషిగా మన సార్ధకత ఉప్పెనలోనే ఊపిరోసుకొంటాయి ఉజ్వలమైన ఉపాయాలు దిగులుమంత్రం ఉచ్ఛరిస్తూ  నీరసిస్తే ఉద్ధరించే నాధుడెవ్వడు వెతలే తాకని వేదన సోకని బతుకుంటుందా ఇలాతలంలో కంటకాలు అధిగమించక  కామితాలు నెరవేరేనా కణకణమండే నిప్పున కాలక కనకము నిగ్గు తేలేనా రహదారిని త్రవ్వుతున్నాను రాలుతున్న ఆశల వెంబడి నా ఆలోచనాస్త్రాలు రవికాంతి కిరణాలై  ఆశయానికి దారిచూపిస్తాయి. నేనిప్పుడు నిలువెత్తు ఆత్మవిశ్వాసాన్ని నేనిప్పుడు విజయపతాకాన్ని విశ్వ వినువీధులవెంట  విజయోత్సాహానికి ప్రతీకగా విరాజిల్లుతున్నాను. చైతన్యపుఖడ్గాన్ని అనే నా ఈ కవిత నా సొంత రచనయని ఈపోటీకోసం మాత్రమే రాసినదని హామీ ఇస్తున్నాను.   ర‌చ‌న‌: సాలిపల్లి మంగామణి (శ్రీమణి)

హైబ్రీడ్

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ ఉగాది క‌విత‌ల పోటీలో ద్వితీయ‌ బ‌హుమ‌తి రూ. 2,116 పొందిన క‌విత 'హైబ్రిడ్‌'   ఇంటిముందల మట్టిని సిమెంటు మట్టుపెట్టి గట్టిపడ్డది వాకిట్ల కళ్ళాపికి జాగలేక కన్నీళ్లు పెట్టుకుంటా కనుమరుగైంది రంగు రంగుల ముగ్గులేస్తే మురిసిపోయే న్యాలతల్లి హంగులద్దిన వార్నిష్ పెయింటింగ్లకు బాకిపడ్డది గడపకు పసుపు పెట్టె పడతులు లేక కలప కలత సెందుతానే ఉంది పచ్చని పరిమళాల ఆకుల తోరణాలు మాడ్రానైజ్ లోమంటకలిసినయి ప్లాస్టికు పువ్వుల దండలై యార్లాడుతూ పకపక నవ్వుతున్నాయ్ యాపాకు నుండి మామిడికాయ దాకా అంతా మాయే ఆరు రుసుల జీవితాన్ని ఆస్వాదించే ఆరడుగుల దేహం ఎందుకో మళ్ళి మళ్ళి స్వార్థాన్ని రుచి చూస్తుంది నీడనిచ్చే చెట్టు కాడల మీద కత్తి పెడితే వాయువే కాదు నీ ఆయువు గూడా కలుషితమే మట్టంటకుండా పనిసేద్దాం అనుకున్నావ్ గదా చూసిన్వా మళ్ళి మట్టికుండ కాడికే వచ్చినవ్ మోకాళ్ల మీద నడిసినప్పుడు కాసింత మట్టి తిన్న మనిషివే గదా మర్చిపోయినవా కడకు మన కాయం గింత మట్టి అయితదని పండగలంటే ప్రకృతి పరిమళాలా గుభాళింపు పస్తులుండేటోళ్ళ కడుపునింపితే వచ్చే కన్నీళ్లు నీకు ఎర్కనా మనని పలకరియ్యనింకే పదిమందుండరు అని గుర్తుచేయ్యనింకనే పండగలోస్తాయ్ ఇంకోపారి చెప్తున్నా స్వార్థాలు వీడిన సమాజం వచ్చినప్పుడే వసంతం.. గప్పుడే మనిషి మళ్ళి కోయిలయ్యి ఒక కొత్త పాట పాడగలడు (న్యాలతల్లి=నేలతల్లి, యార్లడుతూ=వేలాడుతూ,యాపాకు=వేపాకు,ఎర్కన=తెలుసా) ర‌చ‌న‌:  పోలీస్ ప‌టేల్ సుష్మ‌

బహుశా వాళ్ళు

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ ఉగాది క‌విత‌ల‌ పోటీలో ప్ర‌థ‌మ బ‌హుమ‌తి రూ. 5,116 పొందినకవిత‌ బహుశా వాళ్ళు   మనుషులమైనందుకు మనిషి మరణానికి మధనపడం సహజమయినా ఎందుకో ఏమో కొన్ని మరణాలు అస్తిత్వ మూలాలను మరీ మరీ తడుముతాయి అసహజ మరణాల వార్తలై పోయిన వారు బహుశా మనలాగానో ఇంకా ఎక్కువగానో జీవితాన్ని నిండార హత్తుకునే వుంటారు మాసిన దుస్తులంత తేలిగ్గా తనువును వదిలేసి పోయారంటే ఆత్మలు వెలిసిన మనుషుల  మానసిక విన్యాసాలకు ఎంత కలకబారి పోయారో ఏమో చావు రేవులో దుఃఖపు కొసకి బతుకును ఉరేసుకునే ముందు ఎన్నెన్ని చీకటి సముద్రాలను ఈదారో జీవితమే పోరాటమైతే అసలు యుధ్ధమంటేనే గాయం కదా ఒడ్డుకు చేరిన అల మరణిస్తుందా? రెప్పవేయని దేహాన్ని తాకిన అనుభవాలు చేదు బాధ్కై సలపరిస్తుంటే కొత్త మొఖాన్ని తొడుక్కోలేని నిసహాయత గాజుకుప్పె గుండెను బద్ధలు చేసిందేమో స్వేఛ్ఛకీ........త్యాగానికీ  అవ్యాజమైన ప్రేమకీ జీవితం మాధ్యమం కాలేదని తెలిసిపోయాక కలగన్న నిర్మల లోకాలను అన్వేషిస్తూ నక్షత్రాల దారులలో పయనమై పోతారేమో కలవరపరచే కలతను శూన్యానికి తగిలించి నాలుగు రంగులు కొన్ని రాగాలతో ఖాళీలు నిపుకో వలసింది  అరెరే మీ కలల కొమ్మకి విచ్చుకోవాల్సిన మొగ్గల్ని మరచి ఉదయపు జ్ఞాపకాలైపోయారే  పురుడుపోసుకోని క్షణాలింకా మీ కోసం మిగిలే ఉన్నాయి కదా!....                                    ర‌చ‌న‌:  శార‌ద ఆవాలు

వసివాడిన పసి ప్రాయం!

వసివాడిన పసి ప్రాయం!   బడికి నోచుకోని బాల్యం దౌర్భల్యపు బతుకు వెతుకులాటలో గతికే కాసిన్ని మెతుకుల కోసం చితికిపోతుంది పస్తులుండలేక పనికి కుదిరితే సుస్తీ చేసినా తప్పని భారాన్ని మోస్తూ చేయందుకునే దోస్తీ కోసం ఎదురు చూస్తుంది ఐశ్వర్యం స్వైర విహారంతో ఆకలి రోకలి పోటుకు బలౌతూ ధైర్యం కోల్పోయి దైన్యం చవి చూస్తుంది డక్కాముక్కీల తొక్కిసలాటలో బక్కచిక్కిన బొందిపై అంతుచిక్కని గాయాలకు మందు రాసే దిక్కుకై మొక్కుతుంది గడిచిన రోజుకు దండం పెడుతూ పొద్దు పొడిచే దండన తలచుకుంటూ    కన్నీటి కలల అలలపై తలవాల్చుతుంది  వసివాడిన పసి ప్రాయం! రచన : వెంకు సనాతని

అపరిచితులవుదామా..!?

అపరిచితులవుదామా..!? ఒక్కసారి..మరొక్కసారి అపరిచితులం అవుదామా? నేనెవ్వరో నీకస్సలు తెలీదు నాకేమో నీ పరిచయమే లేదన్నట్టు... జతగా ఎన్ని ఊహల పల్లకీల్లో ఊరేగాం ఆశల నిచ్చెనలెన్ని ఆకాశాలకేసుకున్నాం కూల్చలేని గాలి మేడలెన్ని కట్టుకున్నాం ఉప్పెనల ఆటుపోట్లనెన్ని తట్టుకున్నాం... నిన్నలా మొన్నలా ఇప్పుడున్నూ నేనెప్పుడూ మొర పెడుతున్నట్టు కోరుకున్న గమ్యమోవైపు కవ్విస్తుంటే వెడుతున్న బ్రతుకు దారింకోవైపు సోలుతూ.. కాలం గాలానికి చిక్కిన చేపల్లె అల్లాడుతుంటే ఇప్పుడైతే నను వలిచి వరించేవో లేదో అయినా నేనంత ఆత్రంగా అప్పటిలా మళ్ళీ నిను సాదరంగా ఆహ్వానించేనో లేనో.. నా కలల వనానికి వసంతమెళ్ళిపోయిందేమో పిందెలుమెక్కే కోర్కెల కొయిల్లకు తావులేదేమో ఉవ్వెత్తున పొంగే నా ఏరు ఎండిపోతోందేమో నువ్వు నావై నాతో ఏ దరికి చేరలేవేమో.. నిరాశ నిలువెల్లా అలముకుంటుదేమో యదలో నీకిక మునుపట్లా చోటు దొరకదేమో కష్టమైనా వీడ్కోలు పలుకవా నా ప్రియకామనా ఒక్కసారి మరొక్కసారి అపరిచితులమవుదాం.. పుల్లటి పండ్లనీ ఓడుమద్దెల్లనీ ముతక మాటలు మొదలెట్టకముందే కోర్కెల కోతులూ ఇకచాలు మీరూ దయచేయరూ మళ్ళీ ఇంకోసారి అపరిచితులమవుదాం! -- రవి కిషొర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్!  

కెమెరామెన్

కెమెరామెన్     మన ప్రతిరూపాన్ని  మనల్ని కూడా మరిపించేలా తన సృజననుపయోగించి చూడగానే ఆనందమొక్కసారి ఎదనిండేలా ఎగిరి గంతేసేలా చాలా కమనీయకాంతులతో రమణీయ రంగులతో ఎలా చూడాలో ఇంకెలా నిలబడాలో తను చూయిస్తూ సిద్ధం చేసి 'రెడీ' అంటూ ఓ క్లిక్ తో  మనల్ని బందించి మనకందించేది 'కెమెరామెన్' మనిషిని చూడగానే  తన మనసులో ఓ ఊహాచిత్రం గీసుకునే చిత్రకారుడు కెమెరామెన్ మన ఆనందానికెపుడు శాశ్వతరూపమిచ్చేవాడు జీవితంలో జరిగే సంఘటనల్ని మనం చూసుకునేలా  ఎపుడైనా నెమరేసుకున్న మనముందు కనిపించే చరిత్ర కెమెరామెన్ ఓ చరిత్రకారుడే తరతరాలకు గడిచిన గతాన్ని విశ్వమంతా పదిలమై  వాడిపోనిదై వికసిస్తూనే పదిలంగా పదికాలాలకు అందించే జ్ఞాపకాలు ఫోటోలు ప్రకృతిలో ప్రతి రమణీయతను బందించి చిన్న చీమ నుంచి అతిపెద్ద డైనోసార్ దాకా ప్రతిజీవిని పిల్లిని పంజా విసిరే పులిని చిన్న పిచ్చుకలతో మొదలు ఎన్నో పక్షులు ఖడ్గమృగాలు విష సర్పాల కోరలను కొండ కోనలను కొలను చెరువు లోయలు సప్తసముద్రాలను క్లిక్ మనిపించి అబ్బురపరిచే సాహసికుడు ఫోటోగ్రాఫర్ మంచు పర్వతాలను  అగ్నిశిఖలను సైతం  తన ఆసక్తితో మనకందించేది ఏదేమైనా వేవేల భావాలను మౌనంగా మాట్లాడించే మహానాయకుడు ఫోటోగ్రాఫర్ కరోనా కాలంలో వీరి జీవితం బేజార్ ఆదుకోవాలి మరి సర్కార్ (జాతీయ కెమెరామెన్ దినోత్సవ సంధర్భంగా)   సి. శేఖర్(సియస్సార్)  

జనతా ట్రైన్!

జనతా ట్రైన్! జబర్దస్తుగా జనతా రైలుబండెక్కి రంగురంగుల తాయిత్తుల రిజర్వేషన్లతో కొందరు రాజ్యాధికార రుబాబుతో బెర్తులెక్కి కొందరు అమ్యామ్యాల ఆశజూపి సీట్లుబట్టి మరికొందరు! పంచభూతాల్నీ ప్రైవేటుకివ్వాలనీ పబ్లిక్ పౌరులు వాటిని కాపాడుకోలేరనీ ఆస్తుల దస్త్రాలు బస్తాలు బండెడు వెంటేసుకొనీ బోగీలనిండా నింపేసి మూటలతో సంస్కర్తలు! ఉగ్రంగారేగే ఉద్యమాల లావా ప్రవాహంపై చలువపందిళ్ళ వంతెన్లేసుకు సాగే నిరంకుశులు అభినవ అప్రజాస్వామ్య రాజసూయానికై ఆంగ్లజిత్తుల కుయుక్తులేయు సామ్రాజ్యవాదులు! తక్కెడల్లో దూకే రాజకీయ మండూకాలు కసిపోట్ల కరకు పొట్టేళ్ళ తత్వాలొదిలేసి మందతోసాగు గొర్రెదాటు ఓటరు మహారాజులు చట్టాలుజేయలేని డొల్ల బిల్లుల ప్రభుత్వాలు! పాలక ప్రభువుల ప్రాపకాన బ్రతకనేర్చి కర్తవ్యాలు మరచిన సేవకులు ఏలికల పథకాలతో భద్రంగా బ్రతుకీదుతూ కాలక్షేపంజేస్తూ బద్దక ప్రజలు! గమ్యానికి నడిపించే కాపుల్లాగాక జీవనచక్రాలకు తూట్లుపొడుస్తున్న సారధులు ముస్తాబుల అబ్బురాన మురుస్తూ బలికి సిద్ధపరుస్తున్నారన్న సోయిలేని జనాలు! దుర్మార్గుల దులిపెయ్యాలనోచ్చి కంగారులోయావన్మందినీ పీడిస్తున్న కరోనా సాంతం జాతిరత్నాలతో కిక్కిరిసిన జనతా ట్రైన్ సామాన్యుడికి స్థానంలేక జీవనయానం దుర్భరమై! -- రవి కిషోర్ పెంట్రాల లాంగ్లీ, లండన్!

పివి మొగ్గలు

పివి మొగ్గలు   సుస్థిరమైన అభివృద్ధికి బలమైన పునాదులను నిర్మించి స్వతంత్ర భారతాన్ని ఉజ్జ్వలంగా ప్రకాశింపజేసినవాడు నవీన భారతదేశం పివి ఆవిష్కరించిన అజేయచిత్రపటం తీవ్రవాదుల ఆగడాల ఆటంకాలను దుశ్చర్యలను చూసి టాడా చట్టాన్ని పక్కాగా రూపొందించిన సాహసవంతుడు ఆటంకవాదులను అడ్డుకున్న అసలైన సింహస్వప్నం పివి భారతావనిలో మచ్చలేని మహానాయకుడిగా ఎదిగి రాజకీయ విలువలకు పట్టం కట్టిన సేవాదురంధరుడు ఆధునిక రాజకీయ మహాభారతంలో చాణక్యుడు పివి కేంద్ర మానవవనరుల శాఖకు మానవతా రంగులు అద్ది విశిష్టమైన శోభను చేకూర్చిన అపార జ్ఞానసంపన్నుడు మానవ వనరులకు పునాది వేసిన మానవ వనరు పివి విదేశాలదృష్టిలో మనదేశంపై ఉన్న అపోహలను తొలగించి సరికొత్త దృక్పథాన్ని కలిగించిన నవ్య భారతదేశ నిర్మాత  సంస్కరణలను పూలరథాలుగా మార్చిన పథగామి పివి - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

నాన్నతోడుంటే

నాన్నతోడుంటే   నాన్న పక్కనుంటే చాలు కొండంత ధైర్యం గుండెనిండి ఏదైనా అలవోకగా సాధించే అడుగేసి అందుకోవచ్చు నాన్నంటే ప్రేరణకు చిరునామా నాన్నకు నవ్వులు పంచడమే తెలుసు పరిస్థితేదైనా మనసులో దాచుకుని  చిరునవ్వుతో ఎదిరించే నైపుణ్యం నాన్న సొంతం కష్టాలెన్నున్నా గడపవతలే వదిలేసి ఆలుపిల్లలకు ఆనందం పంచేవాడు బిడ్డల భవిష్యత్తుకు అందమైన రూపమిచ్చేవాడు బిడ్డలు గమ్యం చేరేందుకు తానో నిచ్చెనౌతాడు శిఖరం చేర్చే దారవుతాడు మనసులోనే  విజయానందం పొందేవాడు త్యాగానికి తరువువంటివాడు  జీవితం నేర్పే గురవు నాన్న తన తనువులోని అణువణువు బిడ్డలకోసమే త్యాగంచేసే మనసు అందుకే ఆయన స్థానమెపుడు గుండెల్లోనే ఈ తనువున్నంతవరకు ఆదర్శం నాన్న   సి. శేఖర్(సియస్సార్)  

నాన్నకి లెక్కల్రావు!

నాన్నకి లెక్కల్రావు!   అబ్బే లేదండీ నాన్నంత గొప్పోడేంగాదు  సరిగ్గా లెక్కలే రావు అప్పులెప్పుడూ తక్కువజేసి చెప్పేవాడు! బడిదారిలో ఎందరో నాన్న గురించి అడుగుతుంటే అబ్బ ఊరంతా స్నేహితులే అనిపించేది అబ్బే లేదండీ ఇంటికొచ్చి లెక్కలేవో నేర్పించి వెళ్ళేవాళ్ళు! చీకట్లో చుక్కలు లెక్కబెడుతుంటే అక్కున జేర్చుకొని జోకొడుతూ ఎక్కాలు పద్యాలడిగేది నేర్చుకొందామనో  మనస్సుకేం కూడికలు జరిగేవో! పీడకల్లొచ్చి అర్దరాత్రుల్లు ఎప్పుడు మేల్కొన్నా  అప్పుడూ అప్పులు ఆస్తులు లెక్కలే అమ్మ రెండూ సరితూగాయని నాన్నకి తీవ్రంగా లెక్కలు నేర్పుతుండేది! కన్నవారిని కనిపెట్టుకొనుంటూ కలల మూటలెన్ని అటకమీదెట్టాడో కోర్కెల మొగ్గలెన్ని తుంచేసుకున్నాడో ఆ లెక్కలేవీ సరిగ్గా తెలీవు నాన్నకి! అత్యవసరాలెన్ని నెత్తినబడ్డా తాతలనాటి ఆస్తులమ్మేదిగాదు కన్నపిల్లల చదువో పెళ్ళయితే లెక్కబెట్టకుండా తెగనమ్ముతుండేవాడు! తలరాతల లెక్కలు తప్పినా  గుండె సడుల లెక్కలు తప్పకుండా అధిక రక్తపోటు చలానా బారినపడకుండా  యోగా అకౌంటెంటునుబట్టి తప్పించుకుంటుండేది! లెక్కలు నేర్పించేవారి లిస్ట్ చాంతాడంత ఏడాదికోసారి తిరిగి అప్పజెప్పేవాడు నాన్న తప్పులు చెప్పేవాడేమో నెలల్లోనే అంతా మళ్ళీ నేర్పిస్తుండేవారు! - రవి కిషొర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్!