గెలుపు గమనం

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌విత‌ల పోటీలో క‌న్సొలేష‌న్ బ‌హుమ‌తి రూ. 516 గెలుపొందిన క‌విత‌

 

లక్ష్యం!! నీ నిదురను తరుముతున్నది!
పగటి కలల దారిలో గమనం వలదన్నది!

ఆశ!!అదేపనిగా ధైర్యం చెపుతుంది..
ఆకాశమే నీ హద్దంటూ ఊసులాడుతున్నది!

కాలం!!మారుతున్న ఋతువులతో  ముందుకు తోస్తున్నది!
వెనుతిరగని నైజాన్ని నేర్పుతున్నది!!

వయసు!! వసంతాలను లెక్కపెడుతూ 
వాకిట మోదుగపూవుల రంగుతో మేలమాడుతున్నది!

సమయం మీరుతున్న కొద్దీ రెక్కల లోని సత్తువను 
కూడగట్టుకుని ఆగకుండా పయనించమంటుంది..

పోరాటం!! పదే పదే ప్రయత్నించమంటుందీ..
పడినా ఫరవాలేదంటూ కెరటాలను చూపుతుంది.  !!

ఓటమి!!ప్రతి మలుపులో తన పేజీని చదవమంటుందీ..
ఒక్కో మెట్టుపై తనను గెలవమంటూ సవాలు చేస్తుంది... అనుభవమై పాఠం నేర్పుతుంది

సహనం!! మళ్లీ వచ్చే అవకాశం కోసం ఎదురు చూడమంటుందీ..
నిరాశ ఎందుకు నేస్తమా.. నేనే నీ తోడు నన్నది!

విజయం! ప్రతీ స్ఫూర్తి దాతకు ప్రణామం చేస్తుంది..
శిఖరం చేరుకున్న గర్వంతో వినయం వదలవద్దన్నది!
వ్యక్తిత్వమే నీ శాశ్వత అస్తిత్వమని గుర్తించమంటుంది!

ర‌చ‌న‌:  విజ‌య రామ‌గిరి