తరువులే తరముల వరములు

తరువులే తరముల వరములు

 


ఊపిరి పోసే తరువుల 
ఊపిరి ఆగిపోతే
పుడమిని కాచే అడవుల 
జాడలు కాలిపోతే
చినుకు కనుమరుగైతే
సేద్యం సతికిలపడితే
కరువు సాధ్యం
మనుగడ అసాధ్యం

నాగరికత సాకుతో
స్వేదపు మాట అంటకుండా
సౌధపు బాటలో గెంతుకుంటూ
జీవనాన్ని సాగిస్తున్నాం

మితిమీరిన కాలుష్యంతో
కాలాలు మారిపోయాయి
ఋతువులు గతులు తప్పాయి
తరువులు బదులు చెప్పాయి
తరుగుచున్నది తరువుల ఊపిరి కాదు
తరముల ఊపిరి అని..

తరువుల మాటను తలపున నాటుకుని
వెనకటి తరాల వారు అందించిన ఊపిరిని
ముందరి తరాల వారికి వరాలుగా అందిద్దాం

 


రచన : వెంకు సనాతని