బహుశా వాళ్ళు
posted on Jul 7, 2021
తెలుగువన్-అక్షరయాన్ ఉగాది కవితల పోటీలో ప్రథమ బహుమతి రూ. 5,116 పొందినకవిత
బహుశా వాళ్ళు
మనుషులమైనందుకు
మనిషి మరణానికి
మధనపడం సహజమయినా
ఎందుకో ఏమో కొన్ని మరణాలు
అస్తిత్వ మూలాలను మరీ మరీ తడుముతాయి
అసహజ మరణాల వార్తలై పోయిన వారు
బహుశా మనలాగానో ఇంకా ఎక్కువగానో
జీవితాన్ని నిండార హత్తుకునే వుంటారు
మాసిన దుస్తులంత తేలిగ్గా
తనువును వదిలేసి పోయారంటే
ఆత్మలు వెలిసిన మనుషుల
మానసిక విన్యాసాలకు
ఎంత కలకబారి పోయారో ఏమో
చావు రేవులో దుఃఖపు కొసకి
బతుకును ఉరేసుకునే ముందు
ఎన్నెన్ని చీకటి సముద్రాలను ఈదారో
జీవితమే పోరాటమైతే
అసలు యుధ్ధమంటేనే గాయం కదా
ఒడ్డుకు చేరిన అల మరణిస్తుందా?
రెప్పవేయని దేహాన్ని తాకిన
అనుభవాలు చేదు బాధ్కై సలపరిస్తుంటే
కొత్త మొఖాన్ని తొడుక్కోలేని నిసహాయత
గాజుకుప్పె గుండెను బద్ధలు చేసిందేమో
స్వేఛ్ఛకీ........త్యాగానికీ
అవ్యాజమైన ప్రేమకీ
జీవితం మాధ్యమం కాలేదని తెలిసిపోయాక
కలగన్న నిర్మల లోకాలను
అన్వేషిస్తూ నక్షత్రాల దారులలో
పయనమై పోతారేమో
కలవరపరచే కలతను
శూన్యానికి తగిలించి
నాలుగు రంగులు కొన్ని రాగాలతో
ఖాళీలు నిపుకో వలసింది
అరెరే మీ కలల కొమ్మకి
విచ్చుకోవాల్సిన మొగ్గల్ని మరచి
ఉదయపు జ్ఞాపకాలైపోయారే
పురుడుపోసుకోని క్షణాలింకా
మీ కోసం మిగిలే ఉన్నాయి కదా!....
రచన: శారద ఆవాలు