- ఘనంగా ముగిసిన టాంటెక్స్ 82వ నెల నెలా తెలుగు వెన్నెల
- టాంటెక్స్ సాహిత్య వేదికపై తెలుగు వెన్నెల కురిపించిన ఉగాది కవి సమ్మేళనం: ఘనంగా ముగిసిన 81 వ సదస్సు
- ఘనంగా ముగిసిన టాంటెక్స్ 79వ “నెలనెలా తెలుగువెన్నెల”
- వైభవంగా ముగిసిన టాంటెక్స్ దీపావళి వేడుకలు
- ఘనంగా టాంటెక్స్ రియూనియన్ బాంక్వెట్ - అలరించిన సునీత సంగీత విభావరి
- టాంటెక్స్ సాహిత్య వేదికపై డా. రావూరి భరద్వాజకు ఘన నివాళి
- ఘనంగా ముగిసిన టాంటెక్స్ 71వ నెలనెలా తెలుగువెన్నెల
- డల్లాస్ లో వైభవంగా టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు
- డాల్లస్ లో ఘనంగా ముగిసిన "నెల నెలా తెలుగు వెన్నెల" 68వ సదస్సు
- టాంటెక్స్ సాహిత్య వేదికపై “కరుణశ్రీ” కవితలు
- డల్లాస్ లో సందడిగా సాగిన టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు
- Tantex Fifth Anniversary Celebrations
- Grand Welcome To Balakrishna In Dallas & Generous Donation To Basvatarakam Cancer Institute
- Tantex Telugu Parugu Marathon A Big Hit
- Tantex Conducted Sahitya Sadassu March 17
- 58th Nela Nela Telugu Vennela
- 57th Nela Nela Telugu Vennela Sadassu Held On 15th Apl
- "వనితా వేదిక" టాంటెక్స్
- Sukheebhava In Texas - A New Initiative
- Tantex Sankranthi Sambaraalu 2012
- Tantex Dollas Nelanela Telugu Vennela
- 53 వ నెల నెల తెలుగు వెన్నెలకు ముఖ్య అదితి గా కోనా వెంకట్
- 52nd Nela Nela Telugu Vennela
- Tantex Deepavali Celebrations
- రాటంకంగా సాగుతున్న టాంటెక్స్ సాహిత్య వేదిక కార్యక్రమాలు
- Htsa Fund‐raising Event
- డల్లాస్ లో తెలుగు వెన్నెల కురిపించిన మేడసాని: కేవలం ఎనిమిది గంటలలో శతావధానం
- Tantex Tax Seminar To The Dallas Community
- టాంటెక్స్ వారి పునస్సమాగమ వేడుక – పెల్లుబికిన గతస్మృతులు
- 83వ సదస్సులో "మనుచరిత్ర" కు పెద్దపీట
- డల్లాస్ లో టాంటెక్స్ & తానా ఆధ్వర్యంలో ఘనంగా కబడ్డీ, టెన్నికాయట్, త్రోబాల్ పొటీలు
- టాంటెక్స్, టిప్స్ ఆధ్వర్యంలో ద్వితీయ వార్షిక ఉచిత వైద్య శిబిరం
- టాంటెక్స్ కార్య వర్గంలో నూతనోత్సాహం-2014 అధ్యక్షులుగా విజయ్ మోహన్ కాకర్ల ప్రమాణ స్వీకారం
టాంటెక్స్ సాహిత్య వేదికపై ముగ్గురు అగ్రగణ్యులు: పద్య పఠనానికి పెద్ద పీట
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 61 వ సదస్సు, ఆగష్టు 19, ఆదివారము అర్వింగ్ లోని ఓరీస్ ఇండియన్ రెష్టారెంటులో టాంటెక్స్ సంయుక్త కార్యదర్శి మరియు తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన వైభవముగా జరిగినది. ద్విభాషా కోవిదులైన శ్రీ భారతం శ్రీమన్నారాయణ గారు, అవధాన కేసరి డా. నరాల రామారెడ్డి గారు మరియు ‘అభినవ ఘంటసాల’ డా. అక్కిరాజు సుందరరామకృష్ట వంటి సాహితీవేత్తలు ముఖ్యఅతిథులగా సభ ఎంతో శోభాయమానముగా జరిగినది. డాల్లస్ ప్రాంతీయ తెలుగు భాషాభిమానులు అత్యంత ఆసక్తి తో ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. నన్నయ మహాభారతం నుండి శ్రీ అన్నవరపు రంగనాయకులు గారు ఆలాపించిన పద్యాలతో ఈరోజు కార్యక్రమము మొదలైనది.
సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యుడు శ్రీ బిల్లా ప్రవీణ్ శ్రీ భారతం శ్రీమన్నారాయణ గారిని సభకు పరిచయము చేస్తూ, “వీరు ఆధునిక భావాలు కల్గి , సమాజంలో అందరిని సమ దృష్టి తో చూడగల్గిన సహృదయులు అని, ‘అపర శ్రీనాధ’, ‘మహాకవి శేఖర’, ‘ఉభయ భాషా పితామహ’, ‘సంస్కృతాంధ్ర కవితా వాచస్పతి’ - వీరికి సాహితీ అభిమానులిచ్చిన బిరుదులు” అని సభకు తెలిపారు. వీరి రచనలలో కొన్ని “శ్రీ వెంకటేశ స్తవము”, “శ్రీ మాతృ గీతామృతము”, “రమణాయనము” ,”కళ్యాణం-కమనీయం”అని తెలుపుతూ, శ్రీ భారతం శ్రీమన్నారాయణ గారిని వేదికమీదకు ఆహ్వానించగా, శ్రీ ఎం.వి.యల్. ప్రసాద్ గారు పుష్పగుచ్చంతో ప్రసంగకర్తకు స్వాగతం పలికారు. శ్రీ శ్రీమన్నారాయణ గారు తమ స్వీయకావ్యమైన "వివేక భారతము" ను సభకు పరిచయము చేసారు. కారణజన్ముడు, అవతారమూర్తి, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పునః పరిచయము చేసిన దివ్యమూర్తియైన వివేకానందుని జీవిత చరిత్రను పద్యకావ్యముగా రాయగలగటము తనకెంతో ఆనందముగా ఉన్నది అని తెలిపారు. తెలుగు సామెతలు నుడికారాలతో నిండి, సుమారు 850 పద్యాలతో కూడిన ఈ రమణీయ కావ్యము నుంచి కొన్నింటిని ఎంచుకుని వాటి విశేషాలను సభాసదులకు వివరించారు. వివేకానందుని శివుని అవతారముగా అభివర్ణిస్తూ వారు రాసిన సీసపద్యాలు, సభికులను విశేషముగా అలరించాయి. "దొడ్డి గుమ్మము వైపును ద్రోవ గాగ జొచ్చు నొకడు; మఱోక్కడు చొచ్చు వీధి వంక నున్న సింహద్వారపథము పట్టి, యిరువురును జేరుకొనువారె ఇంటిలోకి" అనే చక్కటి తేటగీతితో తమ ప్రసంగాన్ని ముగించారు. టాంటెక్స్ పూర్వద్యక్షులు శ్రీ కూచిభొట్ల ఆనంద మూర్తి గారు మరియు శ్రీమతి కూచిభొట్ల లలిత మూర్తి గారు శ్రీ భారతం శ్రీమన్నారాయణ గారిని దుశ్శాలువతో సత్కరించారు.
పిమ్మట సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యుడు డా. జువ్వాడి రమణ ముఖ్యఅతిథి డా. నరాల రామారెడ్డిగారిని సభకు పరిచయము చేస్తూ “ వీరు అతిపిన్నవయసులోనే కుమారసంభవము లాంటి సంస్కృత కావ్యాలను చదివారని, 15 సంవత్సరాల లేత ప్రాయములో అవధానప్రక్రియను మొదలుపెట్టి సుమారు వెయ్యికి పైగా అవధానాలను ప్రపంచవ్యాప్తముగా చేసారని, ‘అవధాన కేసరి’, ‘అవధాన కంఠీరవ’ లాంటి బిరుదుల తో పాటు దేశవిదేశాలలో ఎన్నో పురస్కారాలను అందుకున్నారని, ‘గాథాసప్తశతి’ నుంచి హృదయోల్లాసం కలిగించే కవితాత్మకమైన మూడు వందల గాథలను ఎన్నుకొని ‘గాతాత్రిశతి’ పేరిట సరస మధుర పద్య ప్రభందానుబంధం గావించారని” సభకు వివరించి డా. నరాల రామిరెడ్డిగారిని వేదికమీదకు ఆహ్వానించగా, డా. పులిగండ్ల విశ్వనాథం గారు ముఖ్య అతిథిని పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. డా. నరాల రామిరెడ్డిగారు "అవధానములో ఆధునికత్వం" అనే అంశముపై ప్రసంగించారు. అవధానికి ముఖ్యముగా ధార(flow), ధారణ (memory), ధిషణ(intellect), ధోరణి(style), ధైర్యము అను ఐదు 'ధ'కారాలు ఎంతో అవసరము అని పేర్కొన్నారు. అవధాని ప్రతిభకీ సమయస్ఫూర్తికీ, "దత్తపది" , "సమస్యాపూరణ" అనే అంశాలు ముఖ్యమైన గీటురాళ్లు అని తెలుపుతూ గతంలో వారు చేసిన అవధానాలలోని కొన్నిపూరణలను ఉదాహరణలుగా ఉటంకించారు. అవధానము అనేది అర్వాచీన సాహిత్యప్రక్రియ కాకపోయిన అవధాని అనే వాడికి అధునిక దృక్పధము, సమకాలీన సమాజములోని సాధకబాధకములగూర్చి విశేష అవగాహణ ఉండటము ఎంతో అవసరము అన్నారు. కార్గిల్ యుద్ధమును గురించి, ఓ మహిళా శ్రమజీవిని గురించి ఇంకా మరెన్నో వైవిధ్యభరితమైన సమస్యలకు సంబంధించిన వారి పూరణలు, సభాసదులను ఆద్యంతము అలరించి మంత్రముగ్ధులను చేసాయి. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఉత్తరాధ్యక్షుడు శ్రీ మండువ సురేష్ మరియు ఉపాధ్యక్షుడు శ్రీ కాకర్ల విజయ మోహన్ ముఖ్య అతిథి డా. నరాల రామారెడ్డి గారిని దుశ్శాలువతో సత్కరించారు.
పిమ్మట సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథి డా. అక్కిరాజు సుందర రామకృష్ణ గారిని సభకు పరిచయము చేస్తూ వీరు" బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సంగీత, సాహిత్య, నాటక, చిత్ర, విద్యా రంగాలలో ఆరితేరిన వారు అని, కృష్ణ తులాభారం , తెనాలి రామలింగడు లాంటి పౌరాణిక నాటకాలలో వీరి పాత్ర బహుళ జానాదరణ పొందాయి” అని తెలిపారు. “అమ్మతోడు”, “విశ్వంతో ముఖాముఖీ” , “భీమలింగ శతకం”, “శనీశ్వర శతకం” మరియు ఇంకా వైవిధ్య రచనలెన్నో చేసారని వివరించి డా. అక్కిరాజు గారిని వేదికమీదకు ఆహ్వానించగా, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కోశాధికారి శ్రీ. ఉప్పలపాటి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిని పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
తరువాత డా. అక్కిరాజు సుందరరామకృష్ణగారు "తెలుగు పద్యం – రంగ స్థలం మరియు చలన చిత్రం” అనే అంశముపై ప్రసంగించారు.. పద్యము అనేది జనబాహుళ్యానికి అర్థమయ్యేట్టు ఉండి పాడుకోటానికి వీలుగా ఉండాలని, జాషువా, ధాశరథి, కరుణశ్రీ లాంటి ఆధునిక పద్యకవుల ఆణిముత్యాలు దీనికి మంచి ఉదాహరణలు అని అభిప్రాయపడ్డారు. ముందుగా అక్కిరాజు గారి స్వీయరచనలైన శనీశ్వర శతకము, రాజరాజరాజేశ్వరి శతకము కావ్యాలనుంచి కొన్ని పద్యాలను శ్ర్యావ్యముగా ఆలపించారు. పద్యాలకు వాడాల్సిన రాగాలు సందర్భమును బట్టి మారుతుంటాయని, నాటకాలకూ సినిమాలకూ మధ్య రాగాలకు సంబంధించి ఎంతో వ్యత్యాసము ఉంటుంది అని వివరిస్తూ ఉదాహరణగా ఎన్నో ప్రఖ్యాతి గాంచిన పద్యాలను ఆలాపించి సభికులను విశేషముగా అలరించారు. టాంటెక్స్ పూర్వాధ్యక్షులు శ్రీ జగన్నాథ రావు గారు మరియు అమెరికా దేశపు మొట్టమొదటి అవధాని, డాల్లస్ నివాసి డా. పుదూర్ జగదీశ్వరన్ గారు ముఖ్య అతిథి డా. అక్కిరాజు సుందర రామకృష్ణ గారిని దుశ్శాలువతో సత్కరించారు.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీమతి గీత దమ్మన్న, పాలకమండలి ఉపాధిపతి డా. సి.ఆర్.రావు, మరియు సాహిత్య వేదిక కార్య వర్గ సభ్యులు శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, డా.ఊరిమిండి నరసింహారెడ్డి, శ్రీ మల్లవరపు అనంత్, శ్రీ కాజ సురేష్, డా. జువ్వాడి రమణ, శ్రీ మద్దుకూరి చంద్రహాస్, శ్రీ బిల్లా ప్రవీణ్, ఈ సదస్సులో ప్రధాన ప్రసంగం గావించిన ముగ్గురు అతిథులకు జ్ఞాపికలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ కార్య వర్గ సభ్యులు శ్రీ చామకూర బాల్కి మరియు శ్రీ చిట్టిమల్ల రఘు పాల్గొన్నారు.
స్థానిక తెలుగు భాషా సాహితీ ప్రియుడు శ్రీ కెసి చేకూరి ఇటీవలే పరమపదించిన భాషా నిపుణుడు, తెలుగు సాహిత్యం లో అగ్రగణ్యుడు ఆచార్య భద్రిరాజు కృష్ణముర్తి మరియు బహుభాషా సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత శ్రీ సామల సదాశివ గారి సేవలను కొనియాడుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక నిమిషం పాటు మౌనం వహించారు.
వందన సమర్పణలో భాగంగా శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం విచ్చేసిన అతిథులకు, పాల్గొన్న భాషా సాహితీ ప్రియులకు, సదస్సు విజయానికి చక్కని వాతావరణం కల్పించిన ఒరీస్ ఇండియన్ రెష్టారెంటు యాజమాన్యానికి కృతజ్ఞతా పూర్వక అభినందనలు తెలియజేయడంతో తెలుగు సాహిత్య వైభవాన్ని అందరికీ పంచిన “నెల నెలా తెలుగు వెన్నెల” 61వ సదస్సుకు తెరపడింది.