RELATED EVENTS
EVENTS
రాటంకంగా సాగుతున్న టాంటెక్స్ సాహిత్య వేదిక కార్యక్రమాలు

నిరాటంకంగా సాగుతున్న టాంటెక్స్ సాహిత్య వేదిక కార్యక్రమాలు: 50వ సదస్సులో అంతరిక్ష శాస్త్రవేత్త పద్మశ్రీ డా. కాటూరి కి ఘన సన్మానం

డల్లాస్ (టెక్సాస్) సెప్టెంబరు 18, 2011

టాంటెక్స్ సాహిత్య వేదిక నిర్వహించే “నెలనెలా తెలుగు వెన్నెల” 50 వ కార్యక్రమం సెప్టెంబరు15 నాడు, డాలస్ లోని ఓరీస్ రెస్టారెంటులో సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి మల్లవరపు అనంత్ ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగింది. మొదట శ్రీ ఎం.వి.ఎల్. ప్రసాద్ ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త పద్మశ్రీ డా. కాటూరి నారాయణగారిని సభకు పరిచయం చేశారు. తరువాత కాటూరి నారాయణగారు ఇస్రో చేసే కార్యక్రమాలను వివరించారు.

కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, చంద్ర మండలానికి పంపబోయే చంద్రయాన్ ఉపగ్రహం, కుజ గ్రహం పైకి పంపడానికి ఇస్రో చేసే ప్రయత్నం లాంటి అనేక కార్యక్రమాల గురించి నారాయణగారు చెప్పిన విశేషాలను సభికులు ఆసక్తిగా విన్నారు. కాటూరి నారాయణగారిని టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు శ్రీ. సుబ్రమణ్యం జొన్నలగడ్డ, శ్రీ. రాజేష్ చిలుకూరి సంయుక్తంగా దుశ్శాలువతో, ఆధ్యక్షుడు శ్రీ. ఎన్ ఎమ్ ఎస్ రెడ్డి మరియు శ్రీ. ఎమ్ వి ఎల్ ప్రసాద్ ఙ్ఞాపికతో సత్కరించారు.

తరువాత శ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారి పుట్టిన రోజు సందర్భంగా డా. సి.ఆర్.రావు గారు ఆయన జీవిత విశేషాలను సభికులతో పంచుకున్నారు. తేనీటి విరామం తరువాత ప్రధాన వక్త డా. వడ్డేపల్లి కృష్ణగారిని డా. జువ్వాడి రమణ సభకు పరిచయం చేశారు. డా. వడ్డేపల్లి కృష్ణగారు ప్రారంభంలో గీతానికీ గేయానికీ మధ్య గల తేడాను వివరించి లలిత గీతాల పుట్టుక, లక్షణం, వికాసాల గురించి సభికులకు విశదీకరించారు.

గురజాడ ముత్యాల సరాల నుండి ఆధునిక కవుల వరకు పరిశీలించి ఎవరి కవితలని లలిత గీతాలుగా నిర్వచించవచ్చో, ఎవరి కవిత్వం లలితగీతాలు అనలేమో తెలియ జేశారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, బసవరాజు అప్పారావు లలిత గీతాలకి ఆద్యులని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. లలిత గీతాల తరువాత తను చేసిన ఛందో ప్రయోగం పాటవెలదిని వివరించి కొన్ని పాటవెలదులతో సభికులని అలరించారు. తరువాత టాం టెక్స్ సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు శ్రీ మల్లవరపు అనంత్, డా. జువ్వాడి రమణ, డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, శ్రీ మద్దుకూరి చంద్రహాస్ లు డా. వడ్డేపల్లి కృష్ణ గారికి జ్ఞాపిక సమర్పించడంతో కార్యక్రమం ముగిసింది.

TeluguOne For Your Business
About TeluguOne
;