RELATED EVENTS
EVENTS
TANTEX Telugu Parugu Marathon a Big Hit

గత ఆదివారం డాలస్ లో తెలుగు ప్రజ, ఇంకా చెప్పాలంటే ప్రవాస భారత ప్రజ, ఆది వారమైనా,  కాస్త పెందళాలే, కోడి కుయ్యక ముందే అరుణోదయంతో పాటే నిద్దుర లేచింది. దేవుని పనో, సినిమానో, లేక రాజకీయమో లేక పాటో నృత్యమో లేకపోతే ఒక సమూహంగా కనపడని జనం, ఈ సారి ఇవేవీ కాకుండా.. ఇంకో మంచి ప్రయత్నం కోసం పొద్దున్నే బూటు కట్టారు. జోరుగా, హుషారుగా ప్లేనోలోని రస్సెల్ క్రీక్ పార్క్ చేరారు.

 

tantex telugu marathon, tantex marathon for telugu, russel creek park tantex, telugu association of north texas, tantex marathon dallas, tantex telugu marathon dallas, tantex siliconandhra marathon



ఇంతకీ అక్కడ ఎం జరిగింది అంటే, సిలికానాంధ్ర మనబడి వారు , ఉత్తర టెక్సాసు తెలుగు సంఘం (టాంటెక్స్) వారి “సుఖీభవ” జట్టు, “విద్యాదానం” అన్న ఇంకో అత్యుత్తమ లాభాపేక్ష లేని సంస్థతో చేతులు కలిపి, “తెలుగుకు పరుగు” అన్న కార్యక్రమం నిర్వహించారు. తెలుగు ప్రాచీన భాషనుంచి ప్రపంచ భాషగా మార్చడంలో ప్రధాన భూమిక పిల్లలదే అన్న సూత్రంతో గత అయిదేళ్ళకు పైగా అమెరికాలోని అన్ని ప్రధాన పట్టణాల్లో వేలాదిమంది పిల్లలకి విజయవంతంగా తెలుగు నేర్పుతున్న మనబడి  గురించి అందరికీ తెలియాలి అన్న సంకల్పంతో సిలికానాంధ్ర మనబడి ఈ పరుగు నిర్వహించింది. అలాగే పిల్లలకి మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన,ఆకళింపు ఎంతగానో అవసరం అన్న “స్ఫూర్తి” సందేశంతో, ఇంకా, ఆరోగ్యంగా ఉంటే ప్రపంచసేవకి మరింత పాటుపడవచ్చు అన్న భావన అందరికీ కలిగేలా “సుఖీభవ” కార్యక్రమ లక్ష్యంతో సంకల్పంతో టాంటెక్స్ ఈ “పరుగు” చెయ్యమని సాటి తెలుగువారికి పిలుపునిచ్చింది.

విద్యాదానాన్ని మించిన దానం లేదు, భారతదేశంలో చాలా గ్రామాలలో ఎంతోమందికి ఉచితంగా ఉత్తమ భోధనాపద్దతులతో విద్యా సాధనాలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టే విద్యాదానం” సంస్థ, వారి పనులకి ఆర్ధిక వనరులకోసం, ఈ పరుగులో అడుగు కలిపింది. మూడు విలక్షణమైన ఉత్తమైన సంస్థలు ఒకే తాటిమీద నడుస్తూ, కలిసికట్టుగా ఈ విభిన్నమైన ప్రక్రియని మొదటిసారి చేపట్టి విజయవంతంగా నిర్వహించారు. అంతే మంచిమనసుతో ఇలాంటివాటికి ప్రోత్సాహమిస్తూ ఎంతో ఉత్సాహంతో వందలాదిమంది పాల్గొన్నారు.

 

tantex telugu marathon, tantex marathon for telugu, russel creek park tantex, telugu association of north texas, tantex marathon dallas, tantex telugu marathon dallas, tantex siliconandhra marathon



అది పెద్దలకోసం అయిదు కి.మీ. పరుగు/నడక మరియు పిల్లల కోసం ఒక మారథాన్. మరి మారథాన్ అంటే 26.2 మైళ్ళు కదా,వాళ్ళు అంత దూరం ఎలా పరుగెడతారు అన్న అనుమానం రావచ్చు. అదెలా సాధ్యమయిందంటే..ఆ రోజుకు ముందే ఇందులో పాల్గొనబోయే పిల్లలు తమ తలితండ్రుల సాయంతో పాతిక “వీర మైళ్ళు” సంపాదించారు. అదెలా అంటే.. తెలుగు భాషకు సంస్కృతికి, సంప్రదాయానికి సంబంధించిన ఈ విషయం అయినా సరే నేర్చుకొన్నా, ప్రదర్శించినా, చేసినా.. పనికి రెండు రెండు “వీర మైళ్ళ” చొప్పున సంపాందించి.. మొత్తం పాతిక మైళ్ళకి లెక్క రాసుకొచ్చి చూపించి.. ఆ రోజున ఒక మైలు నడవడం లేదా పరుగెత్తడం చేసి మొత్తం మీద మారథాన్ పూర్తి చేశారు. మొత్తం 250 మందికి పైగా హాజరైన ఈ పరుగులో మూడు సంవత్సారాల బుడతల దగ్గరనుంచి, 75 ఏళ్ల పడుచు యవ్వన వయస్కుల వరకూ అన్ని వయస్సుల వారూ పాల్గొన్నారు.

ఆహ్లాదకరమైన, చల్లని పిల్ల గాలులతో కూడిన చక్కటి ఉదయం, చిరునవ్వులు చిందించే చిన్నారులు, కేరింతలు కొట్టే యువత, భేష్ భేష్ అనే పెద్దలతో కళకళలాడింది. ఎంతోమంది కరసేవకుల శ్రద్ధతో, దీక్షతో ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా అంతా సజావుగా సాగింది. వచ్చిన వారందరూ చకచకా వాళ్ళ పేర్లు నమోదుచేసుకొని, ఈ రోజుకోసమే ప్రత్యకంగా తయారు చేసిన చొక్కాలను వేసుకొని, పెప్సీ వారు ఉచితంగా ఇచ్చిన శీతలపానీయాలతో అందరూ పరుగుకి తయారయ్యారు. పరుగు మొదలు పెట్టె ముందు, కాళ్ళు, కీళ్ళు అనువుగా మారడానికి విద్యాదానం వారి రామన్ వేలు గారి ఆధ్వర్యంలో కొన్ని కసరత్తులు నడిచాయి.సరిగా ఎనిమిది గంటలకి ఈ కార్యక్రమం మొదలైంది. మూడు మైళ్ళ వలయం చుట్టూ కరసేవకులు పెట్టిన ఆరెంజ్ రంగు జండాల గుర్తులతో అవలీలగా చాలా మంది పరుగు/నడక పూర్తి చెయ్యగలిగారు. పరుగు పూర్తి అయ్యాక వారందరికోసం చక్కని ఆంద్ర అల్పాహారం ఎదురుచూస్తూ ఉండింది. రుచి పేలెస్ వాళ్ళు ఉప్మా, ప్యారడైజ్ బిరియాని పాయింట్  వారు పొంగలి ఎంతో రుచికరంగా అలసిన పరుగు వీరులకి ప్రేమగా వడ్డించడం జరిగింది. అవే కాక, తాజాగా బంగినపల్లి మామిడిపండ్లని కూడా కోసి అందరికీ ఆప్యాయంగా ఇచ్చారు.ఇంకా అరటి పండ్లు, బార్స్, చిప్స్ లాటి పిల్లలకి సరిపోయే తిండ్లు కూడా సౌకర్యంగా అమర్చారు. దాహంతో వచ్చిన వారు సేదతీరడానికి చల్లని మంచినీళ్ళని పరుగు చివర్లోనే కాకుండా, మార్గ మధ్యంలో కూడా, రేడియోఖుషి.కాం వారు చల్లని మనసుతో అందించారు.

 

tantex telugu marathon, tantex marathon for telugu, russel creek park tantex, telugu association of north texas, tantex marathon dallas, tantex telugu marathon dallas, tantex siliconandhra marathon



పిదప, టాంటెక్స్ అధ్యక్షులు గీత దమ్మన్న గారు పరుగుల పౌరులనుద్దేశించి రెండు మాటాలు మాట్లాడారు. పెద్ద సంఖ్యలో వచ్చి ఆ కార్యక్రమాన్నివిజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. టాంటెక్స్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యాలను, ముఖ్యంగా ఈ పరుగు నిర్వహించడం వెనుక లక్ష్యాన్ని వివరించారు. తర తరాల మధ్య తెలుగు సాంస్కృతిక మరియు సంప్రదాయ వారధిగా నిలవడం ధ్యేయంగా గత పాతికేళ్ళకు పైగా పనిచేస్తున్న టాంటెక్సు సంస్థతో కలిసి పని చెయ్యమని సాటి తెలుగువారికి పిలుపునిచ్చారు. తరువాత డాలస్ లో సిలికానాంధ్ర మనబడి ప్రతినిధి రాయవరం విజయ భాస్కర్ మాట్లాడుతూ ఇలా వివిధ సంస్థలు కలిసి పనిచెయ్యడం, అందులోనూ ఇలాంటి ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక , దిశానిర్దేశం చేసే అంశాలను చేపట్టడం ఒక శుభసూచకం అన్నారు. మన భాషల ద్వారా మనకు అందే సంస్క్రుతి సంప్రదాయవిలువల స్రవంతి నిరంతరం సాగుతూ ఉండాలంటే మన తరువాతి తరం వారు తెలుగును లేదా వారి మాతృభాషలను నేర్చుకోవడం ఎంతో ముఖ్యమైనది, కీలకమైనది అని అన్నారు. అదే ధ్యేయంతో పనిచేసే మనబడిలో పిల్లలని చేర్పించమని కోరారు. పిమ్మట, విద్యాదానం ప్రతినిధి పోనంగి గోపాల్ మాట్లాడుతూ ఆ పరుగు కార్యక్రమం సక్రమంగా సాగడంలో ఎంతగానో కృషి చేసిన స్వచ్ఛంద సేవకులకి, ఇంకా ముఖ్యంగా దానికి కావలసిన ఆర్ధిక వనరులు ఇచ్చి, అల్పాహారం, చల్లని మంచినీళ్ళు, గేటోరేడ్  లాంటి వ్యాయమ రసాలు ఇచ్చిన దాతలలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

విద్యాదానం అన్ని దానాలలోకి ఉత్తమైనదని, భారతదేశం చాలా ప్రాంతాలలో ప్రజలు అందరిలాగా కనీస విద్యా సౌకర్యాలకుకూడా నోచుకోలేని స్థితిలో ఉన్నారని, అటువంటి ప్రదేశాలకి నాణ్యతకలిగిన విద్య అందరికీ అందేలా చేయడం “విద్యాదానం” సంస్థ లక్ష్యం అని, ఆ లక్ష్య సాధనలో అందరి చెయ్యి కలపవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. చివరిగా టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు మందువ సురేష్ మాట్లాడుతూ,సుఖీభవ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యాలను వివరించారు. జీవితంలో, వృత్తిలో, సమాజానికి ఉపయోగపడే పనులలో అవిశ్రాంతంగా పని చేసే వారికి తమ తమ ఆరోగ్యాలను, ధృడత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం గురించి, ఆ విషయంలో తీసుకోవాల్సిన చర్యల పట్ల అవగాహన పెంచే “సుఖీభవ” అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరుగు లాటి అంశాలని భవిష్యత్తులో ఎన్నో నిర్వహించడానికి టాంటెక్స్ సరదా సన్నద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

 

tantex telugu marathon, tantex marathon for telugu, russel creek park tantex, telugu association of north texas, tantex marathon dallas, tantex telugu marathon dallas, tantex siliconandhra marathon



ఇంత చక్కటి కార్యక్రమం ఆద్యంతం సజావుగా సాగడానికి పనిచేసిన వారి కృషి మాత్రమే కాకుండా, పెప్సి ఆసియన్ నెట్-వర్క్, సౌత్ ఫోర్క్ డెంటల్, రుచి పేలేస్,  బావర్చి బిరియాని పాయింట్, మరియు పారడైజ్  బిరియాని పాయింట్ , అధికార దాతలుగా వ్యవహరించారు. ఇంకా TV9, eknazar.com మరియు  DesiPlaza.tv  అంతర్జాల మరియు దూరదర్శన్ ప్రసార మాధ్యమాల భాగస్వాములుగానూ, యువ రేడియో, రేడియో ఖుషీ. శ్రవణ మాధ్యమాల భాగస్వాములుగానూ వ్యవహరించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;