సింహాలకు కరోనా.. వామ్మో వైరస్.. బీ అలర్ట్..
Publish Date:May 4, 2021
Advertisement
అవును. సింహాలకు కరోనా సోకింది. ఇన్నాళ్లూ మనుషులపై మాత్రమే దాడి చేస్తూ వచ్చిన వైరస్.. ఇప్పుడు జంతువులపై కూడా అటాక్ మొదలుపెట్టింది. తొలి పంజా.. సింహం పైనే విసిరింది కరోనా సూక్ష్మజీవి. అడవికి రారాజైన మృగరాజులే వైరస్ బారిన పడటం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో కరోనా కలవరం మొదలైంది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సింహాలకు కరోనా సోకింది. సింహాలకు అనారోగ్య లక్షణాలు కన్పించడంతో అనుమానంతో వాటి నమూనాలు సేకరించారు అధికారులు. వాటిని సీసీఎంబీకి పంపించి పరీక్ష చేయించారు. ఫలితాలు చూసి షాక్ అయ్యారు. ఎనిమిది సింహాలు కరోనా బారిన పడినట్టు నివేదికలో తేలింది. మృగరాజులకు సార్స్ కొవ్-2 వైరస్ సోకినట్టు వెల్లడైంది. ప్రస్తుతం సింహాల ఆరోగ్యం బాగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. దేశంలో జంతువులకు కరోనా పాజిటివ్‌గా తేలడం ఇదే తొలిసారి. జూ పార్కులను ఇప్పటికే అధికారులు మూసివేసిన కూడా సింహాలకు ఎలా కరోనా వచ్చిందో అర్థం కావడం లేదంటున్నారు అధికారులు. జూ పార్కు సిబ్బంది నుంచి వైరస్ వారికి అంటి ఉంటుందని అంటున్నారు. జూపార్కులో సింహాలకు కరోనా సోకడంతో ఇప్పడు జనాలూ బెదిరిపోతున్నారు. మిగతా జంతువులూ కరోనా బారిన పడితే పరిస్థితి ఏంటని హడలిపోతున్నారు. ఆవులు, కుక్కలు, మేకలు, కోళ్లకూ కరోనా వస్తుందా అని అనుమానిస్తున్నారు. భయంతో వణికిపోతున్నారు. దీనిపై అధికారులే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరోవైపు, ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలలు మూసివేశారు. సందర్శకులు, జంతువుల రక్షణ దృష్ట్యా జూలు, పార్కులు, నగర వనాలు, ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్ ఎకో పార్కులు మూసివేశారు. కేంద్ర అటవీశాఖ ఆదేశాల మేరకు మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కరోనా దృష్ట్యా విశాఖ, తిరుపతిలలో జూ పార్కులను మూసివేశారు. 29 ఎకో టూరిజం సెంటర్లతో పాటు 23 నగర వనాలు మూసేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచి 7 టెంపుల్ ఎకో పార్కులు మూసివేయాలని ఆదేశించారు. జంతువుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కన్జర్వేటర్లు, డీఎఫ్‌వోలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. కేంద్ర, రాష్ట్రాల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉండనున్నాయి.
http://www.teluguone.com/news/content/zoo-park-lions-tested-positive-25-114855.html





