వైఎస్ అనుచరులకు విజయమ్మ ఆహ్వానం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం!
Publish Date:Aug 29, 2021
Advertisement
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైస్ విజయమ్మ మరోసారి వార్తల్లో నిలిచారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సెప్టెంబరు 2న హైదరాబాద్‌లో ఆమె ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వైఎస్ క్యాబినెట్‌లో పనిచేసిన మంత్రులు, రాజకీయ సహచరులను విజయమ్మ ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. 2009 సెప్టెంబరు 2 రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ కర్నూల్ జిల్లా పావురాల గుట్టలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలి పోవడంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోయారు. అయితే ఆయన వర్ధంతి రోజున జరిగే కార్యక్రమాలకు గతంలో వైఎస్‌తో కలిసి పనిచేసివారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేశారు వైఎస్సార్. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలతో ఆయన సంబంధాలున్నాయి. దీంతో గతంలో వైఎస్సార్ తో కలిసి పని చేసిన తెలంగాణ, ఏపీకి చెందిన నాయకులకు, ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న వారికి కూడా విజయమ్మ ఆహ్వానాలు వెళుతున్నాయట. వైఎస్ మంత్రివర్గంతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితులైన వారికి కూడా ఆహ్వానాలు వెళ్తున్నాయి. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, కేఆర్ సురేష్ రెడ్డితో పాటు వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులను విజయమ్మ స్వయంగా ఫోన్‌చేసి ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా విజయమ్మ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో షర్మిల సొంత పార్టీని ప్రారంభించిన నేపథ్యంలో విజయమ్మ ఆహ్వానాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. వైఎస్ఆర్ చనిపోయిన 12 ఏళ్ల తర్వాత ఈ సమావేశాన్ని పెట్టడంలో ఉద్దేశం ఏంటనేది చర్చనీయాంశమైంది. ఇప్పుడే ఎందుకు పెట్టాలనుకుంటున్నారనే సందేహం అందరిలోనూ వస్తోంది. ఈ సమావేశం హైదరాబాద్ లో ఏర్పాటు చేయడంతో ఖచ్చితంగా ఇది కూతురు వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ కోసమే పెట్టినట్టుగా అందరూ అనుమానిస్తున్నారు. షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ)ని ప్రారంభించగా.. కూతురుకు తల్లి వైఎస్ విజయమ్మ మద్దతుగా నిలిచారు. షర్మిల పార్టీ సభల్లో పాల్గొన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీలోకి కీలక నేతలు ఎవరూ రావడం లేదు. పార్టీ పెట్టిన కొత్తలో వైఎస్ విజయమ్మ ఫోన్లు చేసి మరీ ఆహ్వానించారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ ఆత్మీయ సమావేశం వెనుక రాజకీయం లేదని అనుకోవడానికి వీల్లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చర్చలు ఎలా ఉన్నా విజయమ్మ ఆహ్వానాలపై ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత లేదు. సమావేశం ముగిశాకే విజయమ్మ ఎజెండా ఏంటనేది తెలియనుంది.మొత్తానికి వైఎస్సార్ వర్ధింతి రోజున విజయమ్మ నిర్వహించబోతున్న సమావేశం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మాత్రం ఆసక్తి రేపుతోంది.
ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నడూ లేనిది ఇప్పుడు విజయమ్మ ఆహ్వానం పంపడం ఏంటనే చర్చ జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/ys-vijayamma-conducting-key-meeting-in-hyderabad-with-ysr-fallowers-25-122188.html





