తెలంగాణలో రాజన్న రాజ్యం! ప్రతి ఇంటికి వెళ్తానంటున్న షర్మిల!
Publish Date:Feb 9, 2021
Advertisement
తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభించబోతున్న వైయస్ షర్మిల తమ అభిమానుల ముందుకు వచ్చారు. లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు చిరునవ్వుతో అందరికీ ఆమె అభివాదం చేశారు. తన తండ్రి స్టయిల్లో చేతులు ఊపుతూ హుషారెత్తించారు. ఈ సందర్భంగా ఆమె పొడిపొడిగానే మాట్లాడారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారు.అందరూ కాస్త ఓపిక పట్టాలని... అన్ని విషయాలు తర్వాత చెపుతానని చెప్పారు షర్మిల. అందరితో తాను మాట్లాడుతున్నానని చెప్పారు. రానున్న 30 రోజులు పార్టీ నిర్మాణంపై దృష్టిని సారించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రకటన కోసం భారీ బహిరంగసభను నిర్వహించే అవకాశం ఉంది. వైయస్సార్, తెలంగాణ పేర్లు కలిసి వచ్చేలా పార్టీ పేరు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. 100 నియోజకవర్గాల్లో 16 నెలల పాటు పాదయాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక లోటస్ పాండ్ లోని షర్మిల నివాసం దగ్గర సందడి నెలకొంది. అక్కడ పోస్టర్లు భారీగా వెలిశాయి. మన కష్టం తెలుసని, మన కన్నీళ్లు తెలుసని, మన బతుకులు మార్చే బాట అని అందులో పేర్కొన్నారు. ఆ బాట ఏంటో వైఎస్సార్ కుటుంబానికి తెలుసని, షర్మిలమ్మ నాయకత్వం వర్థిల్లాలని ఫ్లెక్సీల్లో ఉంది. జనంలోకి షర్మిలక్క వస్తున్నారని, జనరంజకపాలన ముందుందిక అంటూ పలు ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఫ్లెక్సీలలో వైఎస్సార్, షర్మిల ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఎక్కడా లేదు.
కొత్త పార్టీపై మాట్లాడేందుకు నిరాకరించారు వైఎస్ షర్మిల. గ్రౌండ్ రియాల్టీ ఏమిటనే విషయం తెలుసుకోవడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణలో రాజన్న లేని లోటు క్లియర్ గా కనిపిస్తోందని... ఆయన రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో ప్రతి ఇంటికి వెళ్తానని చెప్పారు. ఈ రోజు నల్గొండ జిల్లా నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశాన్ని నిర్వహించనున్నారు. వారి సూచనలు, సలహాలను తీసుకోనున్నారు.
http://www.teluguone.com/news/content/ys-sharmila-key-meeting-in-lotuspond-to-new-party-39-109815.html





