ఓటేయకుండానే బెంగళూరుకు జగన్ పయనం.!
Publish Date:Nov 1, 2026
Advertisement
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పులివెందులకు చేరుకున్న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఓటు వేయకుండానే వెనుదిరిగారు. పులివెందులలో ఎన్నికలు సజావుగా సాగడం లేదని ఆరోపిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. అనంతరం హుటాహుటిన హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లు, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి ప్రమీలమ్మ, కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి జగన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పోలింగ్ ప్రక్రియలో తమ పార్టీ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్, ఆర్డీవో చిన్నయ్యతో జగన్ మాట్లాడి పోలింగ్ జరుగుతున్న తీరుపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాను ఓటు వేయడం లేదని జగన్ ప్రకటించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. పులివెందులలో ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్సీపీ చేసిన ఆరోపణలు, జగన్ ఓటు వేయకుండానే వెనుదిరగడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. [ YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling ]
http://www.teluguone.com/news/content/ys-jagan-mohan-reddy-25-236009.html





