జైలుకెళితే...జగన్ భవిష్యత్ ఏంటి..?
Publish Date:Jul 1, 2016
Advertisement
వరుస రాజకీయ ఎదురుదెబ్బలు..టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్..ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఇలా పీకల్లోతు ఒత్తిడిలో కూరుకుపోయి కాస్త సేద తీరదామని ఫ్యామిలీతో సహా ఫారెన్ టూర్‌కు వెళ్లారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి. కుటుంబంతో నాలుగు రోజులు ఎంజాయ్ చేసి హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారో లేదో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో జగన్ ఆయన సతీమణి భారతీ పేర్ల మీదున్న ఆస్తులను అటాచ్ చేసింది. ఊహించని ఈ షాక్‌తో డీలా పడ్డ జగన్‌కు మరో పెను ప్రమాదం పొంచి ఉంది. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో..ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. ఆ కేసుపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. దీనిపై న్యాయస్థానం ఇచ్చే తీర్పు అనుకూలంగా వస్తే ఓకే..అలా కాకుండా వ్యతిరేకంగా వస్తే జగన్ జైలుకెళ్లక తప్పదు. ఆ జైలుకెలితే ఏముందిలే మళ్లీ బయటకొచ్చేస్తారు కదా..? అని అనుకుంటే పోరపాటు. ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ జైలుకెళితే ఆయన రాజకీయ భవిష్యత్ సమాధి అయినట్లే. ఏదైనా కేసులో నేరం రుజువై రెండేళ్ల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష పడ్డ రాజకీయనాయకులపై అనర్హత వేటు పడుతుంది. అలాంటి వారు జైలు నుంచి విడుదల అయ్యాక ఆరేళ్ల వరకు పోటీ చేయటానికి అనర్హులవుతారని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు క్రిమినల్ కేసులో నేరం రుజువై దోషులుగా తేలితే..ఆ క్షణం నుంచి పదవుల్లో కొనసాగటానికి అనర్హులవుతారు. అక్రమాస్తుల కేసులో జగన్ దోషిగా తేలి..శిక్ష పడితే..ఆయనపై అనర్హత వేటు పడుతుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరికొంత కాలం ఎదురుచూడాలి. దీనిని ముందుగానే ఊహించిన జగన్ బీజేపీ ముందు సాగిలపడినట్లు తెలుస్తోంది. ఏపీలో టీడీపీతో అంటకాగుతున్న బీజేపీ, మిత్రుడు..మిత్రుడే..రాజకీయం..రాజకీయమే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అందుకే పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. అలా సొంతంగా బలపడాలనే బీజేపీ ప్రయత్నాలకు జగన్ అందివచ్చిన అవకాశంగా కనిపించారు. ఓ మొక్కను నాటి అది పెరిగి పెద్దదవ్వాలంటే కొంత సమయం పడుతుంది. ఫలాలు అందాలంటే చాలా రోజులు ఓపిక పట్టాలి. అదే రెడీ టూ ఈట్ స్టేజ్‌లో ఉన్న చెట్టు అందివస్తే ఇప్పడు కమలానికి వైసీపీ ఇలాగే కనిపిస్తోంది. జగన్ ఇబ్బందులే తమకు మేలు చేస్తాయనే భావనలో ఉన్నారు కమలనాధులు. అటు జగన్ కూడా కేసుల నుంచి బయటపడేందుకు తన ఆప్తమిత్రుడు గాలి జనార్థన్ రెడ్డి ద్వారా రాయబారం నడుపుతున్నాడు. దానితో పాటుగా రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన విజయసాయిరెడ్డికి ఇదే పని అప్పగించినట్లు లోటస్‌పాండ్ టాక్. ఇదంతా ఒక ఎత్తైతే జగన్ జైలు కెళ్లాల్సివస్తే వైసీపీని నడిపించడం అంత సులభం కాదు. సూపర్‌ఫాంలో ఉన్న చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. గతంలో జగన్ జైలుకెళ్లినప్పుడు దాడి వీరభద్రరావు, మైసూరారెడ్డి లాంటి వాళ్లు పార్టీని నడిపించారు. ఇప్పుడు వారు కూడా లేకపోవడంతో నాయకత్వలేమి స్పష్టం కనిపించి పార్టీ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం. సో.. ఒక్క తీర్పు ఒక వ్యక్తిని..ఒక వ్యవస్థను చిన్నాభిన్నం చేయబోతోందన్న మాట. అందుకే అలా జరగక్కుండా..తన రాజకీయ భవిష్యత్ సమాధి కాకుండా ఉండేందుకు జగన్ బీజేపీతో జతకట్టాలని అనుకుంటున్నారట..పనిలో పనిగా జ్యోతిష్యులను సంప్రదించి పరిష్కారం చెప్పమని వేడుకున్నారట.
http://www.teluguone.com/news/content/ys-jagan-mohan-reddy-45-63259.html





