కేటీఆర్, హరీశ్‌ల మధ్య చిచ్చుపెట్టిన స్టీఫెన్ రవీంద్ర
Publish Date:Jul 1, 2016
Advertisement
స్టీఫెన్ రవీంద్ర..మొండితనానికి, ముక్కుసూటి తనానికి, నిజాయితీకి మారుపేరైన అధికారిగా ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలో పేరుంది. ఎక్కడ..ఏ ప్లేస్‌లో పోస్టింగ్ ఇచ్చినా సమర్థవంతంగా పనిచేయడం ఆయన స్టైల్. తెలంగాణ ఉద్యమ సమయంలో మనోడి పేరు ఓ రేంజ్‌లో వినపడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై దౌర్జన్యాలకు దిగి తెలంగాణవాదుల నుంచి "కర్కోటకుడు" అన్న పేరు పొందారు . అలాంటి స్టీఫెన్ రవీంద్ర మళ్లీ వార్తల్లోకెక్కారు . పరిపాలనా సౌలభ్యం, భద్రతల పరిరక్షణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను ఈస్ట్ , వెస్ట్‌గా విభజించింది తెలంగాణ ప్రభుత్వం. దానికి పలువురు ఐపీఎస్ అధికారులను కేటాయించింది. అలా స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ వెస్ట్ జాయింట్ కమిషనర్‌గా నియమించింది. ప్రభుత్వోద్యోగులు అన్నాకా ట్రాన్స్‌ఫర్‌లు ఉంటాయి..సస్పెన్షన్‌లు ఉంటాయి దీనిలో పెద్ద వింతేముంది అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది పెద్ద కథ. సైబరాబాద్ వెస్ట్ జాయింట్ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్రను మంత్రి కేటీఆర్ ఏరి కోరి తెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేయాలనుకుంటున్న కేటీఆర్..విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. విదేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే తమ ఉద్యోగుల భద్రత విషయానికి పెద్ద పీట వేస్తున్నాయి. అలాంటి కీలకమైన ఐటీ కారిడార్‌లో భద్రతా విధులు పర్యవేక్షించాలంటే సమర్థుడైన అధికారి ఉండాలని భావించిన కేటీఆర్ అందుకు తగిన వ్యక్తిగా స్టీఫెన్ రవీంద్రను భావించారు. అయితే ఈ నిర్ణయం కేటీఆర్ బావ..మరో మంత్రి హరీశ్‌రావుకు రుచించలేదు. ఎందుకంటే హరీశ్‌రావుకు..స్టీఫెన్ రవీంద్రకు మధ్య జరిగిన కోల్డ్‌వార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం..మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో విద్యుత్ సౌధలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన హరీశ్‌రావును అప్పుడు డీసీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర తన సిబ్బందితో అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన హరీశ్ స్టీఫెన్ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు "ఇడియట్", "యూజ్‌లెస్ ఫెలో" అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో హల్‌చల్ చేసింది. అలాంటి స్టీఫెన్ రవీంద్రను కేటీఆర్ ఏరికోరి ఎంచుకోవడంపై హరీశ్‌రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్టీఫెన్ విషయంలో మనసు మార్చుకోవాలని హరీశ్, కేటీఆర్‌కు సూచించగా..దానికి కేటీఆర్ ససేమిరా అన్నట్లు సమాచారం. చివరికి ఈ పంచాయతీ అటు తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరింది. ఉద్యమంలో ఇవన్నీ మామూలే..రాష్ట్రాభివృద్ధి కోసం కేటీఆర్ నిర్ణయాన్ని సమర్థించకతప్పదు అంటూ కేసీఆర్, హరీశ్‌రావుకు ఫుల్లుగా క్లాస్ పీకి పంపినట్టు గులాబీ కండువాలు గుసగుసలాడుకుంటున్నాయి. తండ్రి, కొడుకులిద్దరూ కలిసి తనకు ఇష్టం లేని అధికారిని వెనకేసుకురావడం పట్ల హరీశ్ లోలోపల కుమిలిపోతున్నారు. మరో పక్క సీఎం కేటీఆర్ మాటకు ఇస్తున్న విలువ తన మాటకు ఇవ్వకపోవడంతో హరీశ్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అసలే ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న హరీశ్, కేటీఆర్‌ల మధ్య స్టీఫెన్ రవీంద్ర మరో చిచ్చు పెట్టినట్లైంది.
http://www.teluguone.com/news/content/dcp-stephen-ravindra-45-63238.html





