వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలు.. షర్మిల ఎక్కడ?
Publish Date:Dec 24, 2025
Advertisement
వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం క్రిస్మస్ వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంది. ఆ కుటుంబం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడమన్నది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. పులివెందులలోని తమ పూర్వీకుల ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఈ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ సారి కూడా ఆ సంప్రదాయం కొనసాగింది. పులివెందులలోని వైఎస్ నివాసంలో వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు. షర్మిల వినా ఈ వేడకకు వైఎస్ కుటుంబంలోని దాదాపు అందరూ హాజరయ్యారు. జగన్, ఆమె తల్లి విజయమ్మా చాలా కాలం తరువాత ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తి కలిగించింది. అయితే వారిరు వురూ దూరందూరంగా కూర్చోవడంపై కూడా చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన గ్రూప్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ వేడుక ఎప్పుడు జరిగింది? అన్న విషయంపై స్పష్టత లేదు. ఆ ఫొటో ఈ ఏడాది జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంబంధించినదా, పాతదా అన్న అనుమానాన్ని నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సామాజిక మాధ్యమంలో ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ షర్మిల ఎక్కడ అంటూ నెటిజనులు పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ పులివెందుల పర్యటనలో ఉండటం ఈ ఫొటో తాజాదే అయి ఉంటుందని భావించవ చ్చునని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వైఎస్ జగన్, షర్మిల మధ్య దూరం తరగలే దనడానికి ఈ ఫొటో నిదర్శనంగా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల షర్మిల ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం, అందుకు ధాంక్యూ షర్మిలమ్మా అంటూ జగన్ రిప్లై ఇవ్వడంతో ఇరువురి మధ్యా సయోధ్య ఏర్పడిందన్న చర్చ ఇటీవల జోరుగా సాగింది. ఇప్పుడు తాజాగా పులవెందులలో వైఎస్ కుటుంబ సభ్యులు జరుపుకున్న మినీ క్రిస్మస్ వేడుకల్లో షర్మిల కనిపించకపోవడం వీరి మధ్య విభేదాలపై మరో సారి చర్చకు తెరలేపింది.
http://www.teluguone.com/news/content/ys-family-celebrates-mini-christmas-25-211489.html





