కోటి మందితో యోగాంధ్ర-2026!
Publish Date:Jun 17, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆరోగ్యం, ఫిట్‌నెస్ రంగంలో కొత్త విప్లవానికి నాంది పడుతోంది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర-2026 కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమంగా మారుతోంది. ఇంటింటా యోగా అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ బృహత్తర కార్యక్రమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో బుధవారం (జూన్ 17) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. యోగా కేవలం ఒక రోజు వేడుకలా కాకుండా.. ప్రతి ఒక్కరి దినచర్యలో అంతర్భాగంగా మారాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఆరోగ్య సంకల్పానికి ప్రజల నుండి ఊహించని స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఒక కోటి మందికి పైగా ప్రజలు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఏపీ చరిత్రలోనే అతిపెద్ద యోగా రిజిస్ట్రేషన్ రికార్డుగా నిలిచింది. ఈ భారీ యోగా ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించింది. జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1.33 లక్షల కేంద్రాలలో ఈ యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంజీవని ఆరోగ్య పథకంతో అనుసంధానం చేయాలని చంద్రబాబు సూచించారు. అలాగే.. వచ్చే ఏడాది రాబోయే ఏడాది కాలానికి సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించా. ముఖ్యంగా సమాజంలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా థెరప్యూటిక్ యోగా సెషన్లను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ప్రధాన వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మెగా ఈవెంట్‌లో 5 నుంచి 6 వేల మంది నేరుగా పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ వాతావరణం అనుకూలించక వర్షం పడితే, ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ కళావేదికలో వెయ్యి మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యోగా గురు బాబా రామ్‌దేవ్ పాల్గొంటారు. రాష్ట్రంలో యోగాను మరింత ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. వచ్చే ఏడాది యోగా దినోత్సవం నాటికి అద్భుతమైన ప్రతిభ కనబరిచే యోగా మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక అవార్డులు అందజేయనున్నట్లు చెప్పారు. దీంతో పాటు యోగా యాజ్ డెస్టినేషన్ అనే సరికొత్త క్యాలెండర్‌ను కూడా జూన్ 21న విడుదల చేయనున్నారు.
http://www.teluguone.com/news/content/yoga-andhra-2026-with-10-million-people-36-223331.html





