ఏపీలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్ర.!
Publish Date:Jul 10, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాయలసీమ వ్యాప్తంగా ప్రధాన పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మధుసూదన్ రెడి మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించి ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని మధుసూదన్ రెడ్డి అన్నారు. ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా బట్టకాల్చి మీదేసే రాజకీయాల వల్ల ప్రజల్లో నేతలపై నమ్మకం సడలిపోతుందన్నారు. గతంలో కాపు సామాజిక వర్గంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు, ఆ తర్వాత దళిత క్రైస్తవ అంశాలను తెరపైకి తెచ్చి అలజడులు సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ వరుస ఎపిసోడ్లను నడిపిందన్న ఆయన.. ఇప్పుడు రాప్తాడు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో పరిటాల సునీత కుటుంబం, స్థానిక ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఒకేసారి దాడులకు దిగడం వెనుక రాజకీయ వైరుధ్యాన్ని శాంతిభద్రతల సమస్యగా మార్చే కుట్ర దాగి ఉందన్నారు. అహోబిలం దేవస్థానం సొమ్ముపై గంగుల కుటుంబం చేస్తున్న ఆరోపణలు కూడా ఇందులో భాగమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటికీ కాంట్రాక్ట్ పనులు, లిక్కర్ వ్యాపారాల్లో అవినీతి ఇంకా పూర్తిగా సమసిపోలేదన్న మధఉసూదన్ రెడ్డి.. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో జరుగుతున్న సీసీ రోడ్ల పనుల్లో కూడా కొందరు ప్రభుత్వ అధికారులు ఏడు శాతం వరకూ లంచాలు డిమాండ్ చేస్తున్నారని, ఈ విషయమై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరిట సొంత వారికి కట్టబెట్టిన గాలేరు, నగరి, హంద్రీనీవా పనుల్లో జాప్యం వల్లే ఈ వివాదాలు తలెత్తుతున్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం మీడియా ముందుకు వచ్చి సవాళ్లు విసురుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, నాలుగు మసాలా వార్తలు వినా నిజాలు బయటకు రావన్నారు. ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే.. బాధితులు తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. చట్టపరమైన విచారణ జరిపించి, ఆధారాలు చూపని వారిని కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి పోకడలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ప్రశాంతమైన వాతావరణం కొనసాగాలన్నా కూటమి ప్రభుత్వం అలజడులు సృష్టించే శక్తులపై ఉక్కుపాదం మోపాలని మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను గౌరవిస్తూ తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఏపీలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని విశ్లేషించారు. AP Politics Analysis, MS Raju vs Thopudurthi Prakash Reddy, Rayalaseema Political Riots, Kutami Government Law and Order
http://www.teluguone.com/news/content/ycps-conspiracy-to-create-unrest-in-ap-39-225631.html





