ఏపీలో ఏకమైన వైసీపీ, టీడీపీ ! పంచాయతీ పోరులో వైచిత్రి
Publish Date:Jan 30, 2021
Advertisement
పంచాయతీ సమరంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. తొలి దశ ఎన్నికలకు నామినేషన్లు కొనసాగుతుండటంతో పల్లెల్లో కోలాహలం కనిపిస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో పాటు బీజేపీ-జనసేన కూటమి పంచాయతీ ఎన్నికల కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య సై అంటై సై అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏకగ్రీవాల విషయంలోనూ ఆ రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అనూహ్యాంగా వైసీపీ, టీడీపీ నేతలు ఏకమవుతున్నారు. పదవులను పంచుకుంటూ రాజీ చేసుకుంటున్నారు. పరస్పర అంగీకారాలతో వైసీపీ, టీడీపీ నేతలు పదవులను ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని మిర్తిపాడు పంచాయతీలో రెండు పార్టీల మధ్య రాజీ కుదిరింది. సర్పంచ్ పదవిని టీడీపీకి ఏకగ్రీవంగా ఇవ్వడానికి వైసీపీ అంగీకరించింది. దీనికి బదులుగా వచ్చే మండల పరిషత్ ఎన్నికల్లో మిర్తిపాడు ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీకి ఇచ్చేందుకు టీడీపీ ఓకే చెప్పింది. దీంతో సర్పంచ్ పదవిని టీడీపీ తరపున బరిలో నిలిచిన బండారు సత్యవతికి ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీటీసీగా నాకిరెడ్డి దేవుడమ్మను ఏకగ్రీవం చేసినట్లు సమాచారం. రెండు పార్టీల ముఖ్య నేతలు కత్తులు దూస్తుండగా.. గ్రామాల్లో మాత్రం స్థానిక నేతలు కలిసిపోతుండటం ఆసక్తిగా మారింది. అయితే టీడీపీ, వైసీపీ రాజీ కుదుర్చుకోగా.. జనసేన పార్టీ మాత్రం అక్కడ పోటీకి సై అంటోంది. దీంతో మిర్తిపాడులో టీడీపీ, వైసీపీ రాజీ కొనసాగుతుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. పంచాయతీ ఎన్నికలకు తొలి రోజు 3 వేల 515 నామినేషన్లు దాఖలయ్యాయి. 1,315 సర్పంచ్, 2,200 వార్డు స్థానాలకు నామినేషన్లు వేశారు. సర్పంచ్ స్థానాలకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 248 నామినేషన్లు దాఖలు కాగా, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 27 నామినేషన్లు దాఖలయ్యాయి. కడప జిల్లాలో రెండు, నెల్లూరులో రెండు మండలాల్లో సర్పంచ్ స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయలేదు.
నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు దాడిచేసి అడ్డుకుంటున్నారని గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని రాంబొట్ల పాలేనికి చెందిన కొందరు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన అక్కల నాగమణి అనే మహిళ గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీకి స్థానిక పోలీసులపై ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి తనకు నామినేషన్ పత్రాలు ఇవ్వలేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు తిరిగి తనపైనే తప్పుడు కేసు పెట్టారని ఎస్పీ ఎదుట ఆమె వాపోయారు.
http://www.teluguone.com/news/content/ycp-tdp-local-leaders-deals-in-panchayth-election-39-109394.html





