వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ఱంరాజు హాజరౌతారహో!
Publish Date:Jul 2, 2022
Advertisement
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ప్రధాని నరేంద్ర మోడీ భీమ వరం పర్యటనలో పాల్గొంటున్నారు. ఇది కన్ఫర్మ్. సొంత పార్టీయే ఆయన ఈ పర్యటనకు రాకుండా అడ్డుకునేందుకు శతధా ప్రయత్నించింది. ఎన్నో అడ్డంకులు సృష్టించింది. వాటన్నిటినీ అధిగమించి, న్యాయపోరాటం చేసి మరీ ఆయన భీమవరం పర్యటనకు లైన్ క్లియర్ చేసుకున్నారు. ఈ నెల 3,4 తేదీలలో తాను తన సొంత నియోజకవర్గం నర్సాపురంలో పర్యటించనున్నట్లు కోర్టుకు తెలిపిన ఆయన తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాను స్వరాష్ట్రంలో అడుగుపెడితే అరెస్టు చేస్తారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలోనూ అలాగే జరిగిందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనకు రక్షణ కల్పించాలని ఏపీ సర్కార్ కు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై ఇప్పటి వరకూ నమోదైన కేసులకు సంబంధించి ఆయన నర్సాపురంలో పర్యటించే సమయంలో అంటే 3,4 తేదీలలో అరెస్టు చేయవద్దని స్పష్టం చేసింది. ఇవి కాకుండా కొత్తగా ఏవైనా కేసులు నమోదు చేస్తే వాటి విషయంలో కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలే తప్ప వెంటనే అరెస్టు చేయడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో వైసీపీ రెబల్ ఎంపీ భీమవరం పర్యటన ఖరారైంది. స్థానిక ఎంపీగా ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం ప్రధానితో వేదిక పంచుకునే చాన్స్ ఉంటుంది. విగ్రహావిష్కరణ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కనుక ప్రొటో కాల్ కూడా కేంద్రమో చూసుకుంటుంది. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీని పక్కన పెట్టే వీలు ఏ మాత్రం ఉండదు. అంటే భీమవరంలో మోడీ కార్యక్రమంలో రఘురామ కృష్ణం రాజు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రఘురామకృష్ణం రాజును దూరం పెట్టడానికి ఏపీలోని జగన్ సర్కార్ చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి అల్లూరి విగ్రహావిష్కరణ శిలా ఫలకంపై ఆయన పేరు కూడా లేకుండా చేయడానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖపై ఒత్తిడి కూడా తీసుకువచ్చింది. దీనికి గమనించిన రఘురామకృష్ణం రాజు.. తానా కార్యక్రమానికి హాజరు కానున్నాననీ, ప్రొటోకాల్ ప్రకారం తన పేరు శిలాఫలకంపై ఉండాల్సిందేననీ, ఎవరి ఒత్తిడికీ లొంగవద్దనీ పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి అసలుజగన్ హాజరౌతారా అన్నది అనుమానంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకృష్ణం రాజు భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు రాకుండా నిరోధించాలని అన్ని ప్రయత్నాలూ చేసినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు తానే డుమ్మా కొట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న జగన్ షెడ్యూల్ ప్రకారం రేపు అంటే ఆదివారం తిరిగి రావాల్సి ఉంది. అయితే కోర్టు విస్పష్ట ఆదేశాలతో రఘురామకృష్ణం రాజు రాకను ఆపడం సాధ్యం కాదని తేలిపోవడంతో.. తానే తన పర్యటనను వాతావరణ ప్రతి కూలతో, ఫ్లైట్ జాప్యం సాకుతోనో డుమ్మా కొడతారని వైసీపీ వర్గీయులలోనే ఒక చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుందన్నది రేపు తేలిపోనుంది.
http://www.teluguone.com/news/content/ycp-rebel-mp-raghu-rama-krishnam-raju-will-attend-modi-programmee-in-bhimavaram-39-138912.html





