జూలై 8, 9 తేదీలలో వైసీపీ ప్లీనరీ.. ముందస్తు సన్నాహాలకు సంకేతమా?
Publish Date:Jun 1, 2022
Advertisement
వైసీపీ ముందస్తు సన్నాహాలు ప్రారంభించేసిందా. ఒక వైపు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం విఫలం కావడం, మంత్రుల బస్సు యాత్ర తుస్సు మనడం.. మరో వైపు తెలుగుదేశం బాదుడే బాదుడు కార్యక్రమానికి జన స్పందన బ్రహ్మాండంగా ఉండటం, తెలుగుదేశం మహానాడు అంచనాలకు మించి విజయవంతం కావడంతో ఏపీలో అధికార వైసీపీకి ఉక్కపోత ప్రారంభమైంది. దీంతో ప్రజలలో తమ పట్టు సడలలేదని నిరూపించుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. క్రమశిక్షణా సంఘం సిఫారసు అంటూ మాజీ మంత్రి కొత్తపల్లిపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదన్న సందేశాన్ని పార్టీ శ్రేణులకు ఇచ్చింది. అయితే ప్రజాభిమానం చెక్కు చెదరలేదని నిరూపించుకోకుంటే.. పార్టీ నుంచి వలసనలు పెరుగుతాయన్న భయం మాత్రం పార్టీని వెంటాడుతోంది. దీంతో పార్టీ ప్లీనరీ నిర్వహించి సత్తా చాటాలని, తద్వారా ముందస్తు సన్నాహాలు ప్రారంభించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసేశారు. వైస్ జయంతి రోజైన జూలై 8 నుంచి రెండు రోజుల పాటు వైసీసీ ప్లీనరీ నిర్వహించాలని జగన్ నిర్వహించారు. 2017లో వైసీపీ ప్లీనరీ నిర్వహించిన గుంటూరు జిల్లాలో నాగార్జున వర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలోనే ఈ సారి కూడా ప్లీనరీ నిర్వహణకు జగన్ నిర్ణయించారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం మహానాడును మించి వైసీపీ ప్లీనరీ విజయివంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని జగన్ పార్టీ ముఖ్య నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. జన సమీకరణ విషయంలో ఎటువంటి రాజీ వద్దనీ, పెద్ద సంఖ్యలో జనం ప్లీనరీకి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు వైసీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్లీనరీ నిర్వహణకు కమిటీల ఏర్పాటు బాధ్యతను ప్రభుత్వ సలహాదారు సజ్జలకు అప్పగించారు. వచ్చే మూడు నాలుగు రోజులలో ప్లీనరీ కమిటీల ఏర్పాటు జరుగుతుందని సజ్జల జగన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీ సభలకు జనం రావడం లేదన్న ప్రచారానికి ప్లీనరీతో ఫుల్ స్టాప్ పడేలా జనసమీకరణ ఉండాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్లీనరీతో వైసీపీకి జనంలో అభిమానం చెక్కు చెదరలేదని చాటాలని జగన్ ముఖ్యనేతలకు చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి.
http://www.teluguone.com/news/content/ycp-plenary--a-dign-to-early-elections-25-136853.html





