ప్రజా సేవ చేయాలనుకునే వారికి వైసీపీ వేదిక కాదు.. కుండబద్దలు కొట్టిన అంబటి రాయుడు
Publish Date:Apr 29, 2024
Advertisement
వైసీపీకి భవిష్యత్ లేదా? ఈ విషయం పార్టీలో దగాకు గురైన వారే కాదు.. నిన్న మొన్న వచ్చి చేరిన వారికి కూడా అర్ధమైపోతోందా? అంటే ఎలాంటి సందేహం లేకుండా ఔనని చెప్పడానికి బోలెడు ఉదాహరణలు ఉంటాయి. వాటిలో ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో ఇలా చేరి అలా రాజీనామా చేసి బయటకు వచ్చేసిన ఉదంతం ఒకటి. వైసీపీ కండువా కప్పుకుని జగన్ పై ప్రశంలస వర్షం కురిపించిన అంబటి రాయుడు రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. అలా వస్తూ రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో క్లుప్తంగా ఓ పోస్టు పెట్టి ఊరుకున్నారు. వైసీపీలో చేరిన పది రోజుల్లోనే అంబటి రాయుడు రాజకీయవిరామం అంటూ రాజీనామే చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అలా రాజకీయ విరామం అన్న అంబటి రాయుడు ఆ వెంటనే జనసేన గూటికి చేరిపోయారు. దీనిని బట్టి ఆయన రాజకీయ విరామం అన్నది ఒట్టి సాకు మాత్రమేననీ, వైసీపీకి గుడ్ బై చెప్పేశారనీ అప్పట్లోనే అందరికీ అర్ధమైంది. అయితే వైసీపీ తీర్ధం పుచ్చుకున్న పది రోజులకే అంబటిరాయుడికి ఆ పార్టీపై ఎందుకంత విరక్తి కలిగింది అన్నది మాత్రం ఇప్పటి వరకూ ఎవరికీ తెలియలేదు. అప్పట్లో వారు గుంటూరు లోక్ సభ టికెట్ విషయంలో జగన్ మాట తప్పడవం వల్లే వైసీపీకి గుడ్ బై చెప్పేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆయన జనసేనలో చేరినా ఆ పార్టీ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో గుంటూరు టికెట్ విషయంలో వైసీపీ మోసం చేయడం ఒక్కటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేయడానికి కారణం కాదని పరిశీలకులు విశ్లేషించారు. అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పేయడానికి కారణమేమిటన్నది ఇప్పటి వరకూ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఆ మిస్టరీ ఏం లేదు. ఎందుకంటే తాను బయటకు రావడానికి కారణమేమిటన్నది స్వయంగా అంబటి రాయుడే వెల్లడిం చారు. ప్రజా సేవ చేయాలనుకుని రాజకీయాలలోకి వచ్చే వారికి వైసీపీ సరైన వేదిక కాదని గ్రహించడం వల్లనే తాను ఆ పార్టీకి గుడ్ బై చెప్పానని కుండబద్దలు కొట్టేశారు. ఆ పార్టీ పూర్తిగా వ్యక్తి నియంతృత్వంలో ఉందని అంబటి చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు కూడా జగన్ మోహన్ రెడ్డిని కలవలేని వాతావరణాన్ని చూసి తాను షాక్ కు గురయ్యానని అన్నారు. అందుకే వైసీపీ గూటికి చేరిన క్షణం నుంచి ఎప్పుడు బయటకు వద్దామా అని తహతహలాడానని అంబటి వివరించారు. పవన్ ల్యాణ్ నాయకత్వ లక్షణాలు, ఆయన ఆశయాలకు ఆకర్షితుడనై జనసేనలో చేరానన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
http://www.teluguone.com/news/content/ycp-not-dias-for-service-39-174725.html