వైసీపీ నేతల కొత్తరాగం.. జగన్ కొత్త వ్యూహమేనా!?
Publish Date:Feb 14, 2025
.webp)
Advertisement
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేతలు అధికార మదంతో వ్యవహరించారు. వైఎస్ జగన్ దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమతో హద్దులు మీరి ప్రవర్తించారు. ప్రతిపక్ష పార్టీల నేతలను ఇబ్బందులకు గురిచేయడంతోపాటు.. సామాన్య ప్రజలనుసైతం నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. సీన్ కట్ చేస్తే గత ఎన్నికల్లో ఓటు ద్వారా వైసీపీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొందరు వైసీపీ నేతలు నోరుపారేసుకుంటున్నారు. ఇంకా మేమే అధికారంలో ఉన్నామన్న భ్రమల్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఐదేళ్లు అధికారం మత్తులో హద్దులు మీరి ప్రవర్తించిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలను వెలికితీస్తూ ఒకవైపు.. అధికారం మత్తులో నోరుపారేసుకున్న నేతలపై మరో వైపు కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నది. దీంతో వైసీపీ నేతల్లో భయం పట్టుకుంది. చాలా మంది వైసీపీ నేతలు తమ వంతు ఎప్పుడొస్తుందోనన్న భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు కొత్తరాగం అందుకుంటున్నారు. వల్లభనేని వంశీ అరెస్టుతో ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమకు జ్ఞానోదయం అయిందనట్లుగా మాట్లాడుతున్నారు. అయితే, వైసీపీ నేతలు అందుకున్న కొత్తరాగం వెనుక ఏమైనా వ్యూహం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశీలకులు కూడా పక్కా వ్యూహంతోనే వైసీపీ నేతలు కొత్త రాగం అందుకున్నారని విశ్లేషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడిన పార్టీ నేతలపై కేసులు నమోదు చేస్తోంది. మరోవైపు ఐదేళ్ల కాలంలో అధికార మదంతో హద్దులుమీరి మాట్లాడిన వారిపైనా కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు పిటీషన్ దాఖలు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్దన్ ఫిర్యాదుదారుడిగా ఉన్నాడు. అయితే, సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురిచేయడంతో తనకు టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు ఎలాంటి సంబంధం లేదని ఇటీవల కోర్టులో చెప్పించారు. ఆ తరువాత సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అసలు విషయంపై కూపీలాగగా.. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, బెదిరించి అలా చెప్పించారని పోలీసులు గుర్తించారు. దీంతో సత్యవర్ధన్ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కావడంతో కిడ్నాప్ కేసు కింద వంశీతో పాటు మరికొందరిపై అట్రాసిటీ కేసును నమోదు చేసిన పోలీసులు.. వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు 14రోజులు రిమాండ్ విధించింది. దీంతో వంశీతో పాటు మరో ఇద్దరిని పోలీసులు విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. వంశీని తమ కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. ఈ ఘటన తరువాత వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు వంశీకి మద్దతుగా మాట్లాడుతుండగా.. మరికొందరు వంశీని పార్టీనుంచి బహిష్కరించాలన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా వంటి నేతల తీరుతోనే వైసీపీ ఓటమి పాలైందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. గతంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి టార్గెట్‌గా తమ పార్టీ నేతలు చేసిన కామెంట్స్‌ను..టీడీపీ అస్త్రంగా మల్చుకుందని కేతిరెడ్డి గతంలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చంద్రబాబు కంటతడి పెట్టుకోవడంతో ఆ ఇష్యూను సానుభూతిగా మల్చుకోవడంలో కూటమి సక్సెస్ అయిందని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ అరెస్టు తరువాత కొందరు వైసీపీ నేతలు వంశీ, కొండాలి నాని, రోజా మాట తీరు వల్లనే ఓడిపోయామని బహిరంగంగా చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వాసుపల్లి గణేష్ అయితే.. తమ పార్టీ నేతలు ప్రత్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పారు. విజయసాయిరెడ్డి మాదిరిగా వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా పార్టీని వీడి వెళ్లిపోతే మంచిదన్నట్లుగా ఆయన మాట్లాడారు. మాజీమంత్రి రోజా ఆచితూచి మాట్లాడితే మంచిదని సూచించారు. విజయసాయిరెడ్డి పార్టీని వీడటం శుభసూచకమన్న వాసుపల్లి.. ఆయన ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లే ఉత్తరాంధ్రలో పార్టీ ఓడిపోయిందన్నారు. పార్టీ కార్యకర్తల సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల్సిన సాయిరెడ్డి.. పార్టీకి సమస్యగా మారారని అన్నారు. సాయిరెడ్డి జగన్‌ను మిస్ గైడ్ చేశారని చెప్పారు. సాయిరెడ్డి వల్లే రుషికొండ ప్యాలెస్ కట్టాల్సి వచ్చిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వాసుపల్లితో పాటు పలువురు వైసీపీ నేతలు వంశీ అరెస్టును సమర్ధిస్తున్నారు. వల్లభనేని వంశీ అరెస్టు తరువాత వైసీపీ నేతలు కొత్తరాగం అందుకోవటం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం.. జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే. ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నించిన సామాన్య ప్రజలను జగన్ తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారు. పోలవరం పడకేసింది. రాష్ట్రంలో కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చకుండా జగన్ ఐదేళ్ల పాలన అంతా కక్ష సాధింపునకే కేటాయించారు. జగన్ తీరు కారణంగా పనులులేక లక్షలాది మంది పేద ప్రజలు పక్కరాష్ట్రాలకు వలస వెళ్లిన పరిస్థితి. వైసీపీ ఐదేళ్ల కాలంలో ఏపీ అన్నిరంగాల్లో వెనుకబడి పోయింది. దీంతో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టేస్తారన్న భయంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటువేసి వైసీపీకి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదు. అయితే, దారుణ ఓటమి తరువాత కూడా ప్రజలకు నేను మంచే చేశానంటూ జగన్ స్టేట్‌మెట్లు ఇస్తుండటం గమనార్హం. తాజాగా వల్లభనేని వంశీ అరెస్టు తరువాత వైసీపీ నేతలు కొత్తరాగం అందుకున్నారు. జగన్ మెరుగైన పాలన అందించారని, కానీ, వల్లభనేని వంశీ, కొడాలి నాని, విజయసాయిరెడ్డి, రోజా వంటి నేతలు హద్దులు మీరి మాట్లాడి వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత భావం ఏర్పడేలా చేశారంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. తద్వారా వైసీపీ ఓడిపోయింది జగన్ వల్ల కాదు కొందరు వైసీపీ నేతలు నోరుపారేసుకోవటం వల్లనేనన్న వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ప్రయత్నిస్తున్నారు. వంశీ అరెస్టుపై జగన్ స్పందించకపోవడం చూస్తుంటే.. ఈ వ్యూహాన్ని రచించి, పార్టీ నేతల చేత అమలు చేయిస్తున్నది స్వయంగా జగనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తద్వారా ఐదేళ్ల పాలనలో తన తప్పిదాలకు కొందరు పార్టీ నేతలను బలిచ్చేసి తాను సుద్దపూసగా మళ్లీ జనం ముందుకు రావాలని జగన్ ప్రయత్నిస్తున్నారంటున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-new-strategy-39-192906.html












