ప్రమాణ స్వీకారానికి డుమ్మా.. జగన్‌కు అసమ్మతుల ఝలక్! తగ్గేదేలే..
Publish Date:Apr 11, 2022
Advertisement
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఈ సారి అసమ్మతుల మంట గట్టిగానే తగిలేట్టు ఉంది. కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఈ మేరకు జగన్ కు కొందరు మాజీలు సంకేతాలు ఇచ్చారు. మొన్నటి దాకా హోంమంత్రి హోదాలో ఉన్న మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో సమర్పించారు. ఈ విషయం ఆమె స్వయంగా కార్యకర్తలతో జరిగిన సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికి మాత్రమే తాను రాజీనామా చేశానని, వైసీపీలో కొనసాగుతానంటూ సుచరిత చెప్పినప్పటికీ సమయం కోసం ఆమెలో వేచి చూసే ధోరణి కనిపిస్తోందంటున్నారు. వైసీపీ అధిష్టానంపై అలిగిన మేకతోటి సుచరిత సోమవారం జరిగిన కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకపోవడం గమనించదగ్గ విషయం. మరో తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా జగన్ పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి, తన ఆవేదన, ఆగ్రహాన్ని సీఎం జగన్ కు తెలియజెప్పాలని బాలినేని యోచన చేస్తున్నాంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలినేని కూడా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి డుమ్మా కొట్టారంటున్నారు. నిజానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి స్వయంగా బాలినేని నివాసానికి వెళ్లి బుజ్జగించినా ఆయన ఏమాత్రం తగ్గేదేలే అన్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాకుండా ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన ముఖ్య వైసీపీ నేతలతో బాలినేని మంతనాలు జరపడంలో నిమగ్నమయ్యారని చెబుతున్నారు. అలా వచ్చిన వారిలో ఎమ్మెల్యేలు కొండారెడ్డి, నాగార్జునరెడ్డి కూడా రావడం చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేస్తే.. కొండారెడ్డి, నాగార్జునరెడ్డి, ప్రకాశం జిల్లాలోని పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా పదవులను వదిలేస్తారనే గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం. తాను రాజీకీయాల నుంచి తప్పుకుంటానని, వైఎస్ జగన్ తనకు బంధువైనప్పటికీ నమ్మించి మోసం చేశారంటూ బాలినేని ఫైరవుతున్నారు. కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీలైన మంత్రులందరూ హాజరు కావాలని మొన్న నిర్వహించిన కేబినెట్ చివరి సమావేశంలో జగన్ స్పష్టంగా ఆహ్వానించారు. చివరికి 25 మందితో కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేశారు. వెలగపూడిలో నిర్వహించిన కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. అయితే.. మంత్రి పదవులు కోల్పోయిన మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి గైర్హాజర్ కావడం చర్చనీయాంశం అయింది. మరో పక్కన ఏపీ మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ వైసీపీలో అసమ్మతి జ్వాలలు బాగానే సృష్టించినట్లుంది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కొందరు రాష్ట్ర సచివాలయం దరిదాపులకు కూడా రాలేదని చెబుతున్నారు. అలాంటి వారిలో మంత్రి పదవులు ఆశించి భంగపడిన వైసీపీలోని కీలక ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కరణం ధర్మశ్రీ,, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సామినేని ఉదయభాను సెక్రటేరియట్ పరిసరాల్లోకి రాలేదని చెబుతున్నారు. ఇక అసంతృప్తుల అనుయాయులు, ఆయా నియోజకవర్గాల వైసీపీ ప్రజాప్రతినిధులు వందలాది మంది తమ పదవులకు రాజీనామాలు సమర్పిస్తామంటూ ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి గైర్హాజరైన బాలినేని, మేకతోటి బహిరంగంగానే తమ అసంతృప్తిని, ఆక్రోశాన్ని వెళ్లగక్కినట్లయింది. వారితో పాటు స్థానిక నేతలు కూడా వారి బాటలోనే వైసీపీ అధిష్టాంనపై నిరసన తెలిపేందుకు సిద్ధం అవుతుండడం ఆ పార్టీ వర్గాల్లోనే సర్వత్రా చర్చనీయాంశంగా మారిందంటున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-mlas-absent-to-cabinet-oath-39-134223.html





