పులివెందులలోనూ కదులుతున్న వైసీపీ పునాదులు!?
Publish Date:Dec 17, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ పునాదులు కదులుతున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వైసీపీ నుంచి వేగంగా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నాయకులు, జగన్ సన్నిహితులు కమలం గూటికి చేరారు. ఇలా ఉండగా ఎవరెలా వెళ్లిన కడప, మరీ ముఖ్యంగా పులివెందులలో వైసీపీ బలంగా ఉందన్న అభిప్రాయం ఇంత వరకూ కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడైతే పులివెందుల జడ్డీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ కనీసం డిపాజిట్ కూడా నోచుకోకుండా ఘోర పరాజయాన్ని చవిచూసిందో.. అప్పుడే పులివెందులలో వైసీపీది వాపేనా, బలం కాదా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ తరువాత పులివెందుల నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీయులు, నియెజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరడం కూడా పులివెందులలో వైసీపీ బలం సన్నగిల్లిందనడానికి తార్కానంగా నిలిచింది. ఇక తాజాగా జగన్ సన్నిహితుడు, వేంపల్లిలో వైసీపీ కీలక నేత అయిన చంద్రశేఖరెడ్డి అలియాస్ దిల్ మాంగే వైసీపీకి గుడ్ బై చెప్పి బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు. ఆయనతో పాటు వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వేంపల్లిలో వీరు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి చేరిక కార్యక్రమంలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, స్థానిక తెలుగుదేశం నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ పరిణామంతో పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ పతనం ప్రారంభమైనట్లేనని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-loosing-grip-in-pulivendula-25-211156.html




