‘గడపగడపకూ’కు ద్వితీయ విఘ్నం.. జనాగ్రహానికి జడిసి మొహం చాటేసిన వైసీపీ నేతలు
Publish Date:May 12, 2022
Advertisement
ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చాలంటూ ఆర్భాటంగా ప్రారంభమైన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి ద్వితీయ విఘ్నం తప్పలేదు. అసలు గడప గడపకూ వైసీపీ అంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నది జగన్ యోచన. కానీ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతను అంచనా వేసిన ఆయన ఈ కార్యక్రమం పేరును గడప గడపకూ ప్రభుత్వంగా మార్చారు. ఇలా అయితే అధికారిక కార్యక్రమం అవుతుంది. జనం నిరసనలు వ్యక్తం చేసినా, కార్యక్రమాన్ని అడ్డుకున్నా.. పోలీసు కేసులతో వారిని దారిలోకి తీసుకురావచ్చన్న ఉద్దేశంతోనే గడప గడపకూ వైసీపీ కార్యక్రమం పేరును గడప గడపకూ ప్రభుత్వంగా మార్చారన్నది పరిశీలకుల విశ్లేషణ. అయితే ఈ ఎత్తు కూడా పారలేదు. ప్రభుత్వ పథకాల లబ్ధి దారుల జాబితా తీసుకుని మరీ వెళ్లిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు ప్రజల నుంచి నిరసనల స్వాగతం లభించింది. నిలదీతల హారతులు దక్కాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఎక్కడికక్కడ వైసీపీ నేతలకు ప్రజా నిరసన జ్వాలల స్వాగతమే లభించింది. రోడ్లు, పథకాలు, పింఛన్లపై గడప గడపలోనూ నిలదీతలే, నిరసనలే. మూడేళ్ల పాటు జనం ఊపే పట్టని ప్రభుత్వానికి ఇప్పుడు అభిమానం తన్నుకొచ్చిందంటే నమ్మేందుకు సిద్ధంగా లేమంటూ గడప గడపలోనూ తిరస్కారాలే, ఛీత్కారాలే ఎదురయ్యాయి. మా గడప తొక్కద్దంటూ అడ్డగింతతో జనం వారిని వెనక్కు పంపారు. పథకాల లబ్ధిదారుల జాబితా ప్రకారమే వెళ్లినా, లబ్ధిదారుల నుంచీ ఆదరణ లభించకపోవడంతో నేతలకు గడప గడపకూ కొనసాగించడమెలాగో అర్ధం కాలేదు. దీంతో బుధవారం మొదలైన ఈ కార్యక్రమం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నిలిచిపోయింది. వైసీపీ నేతలెవరూ బయటకే రాలేదు. ముఖం చాటేశారు. అధికారుల నుంచి సమగ్ర సమాచారం అందలేదంటూ సాకులు చెప్పుకున్నారు. కొందరైతే ప్రజాగ్రహం ముందు నిలవడం కష్టమని ఒప్పేసుకున్నారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్ పై ప్రజలలో ఉన్న వ్యతిరేకత తీవ్రత బహిర్గతమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ముందు ముందు కూడా ఈ వ్యతిరేకతను తట్టుకుని నేతలు ప్రజలలోకి వెళ్లే పరిస్థితి ఉండే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. ఒక వైపు తెలుగుదేశం బాదుడే బాదుడు కార్యక్రమానికి అశేష జనవాహిని మద్దతు పలుకుతూ కదులుతుంటే.. ప్రభుత్వ కార్యక్రమానికి నిరసనల సెగ తగులుతుండటంతో అధికార పార్టీ నేతలలో తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన ప్రారంభమైందంటున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-leaders-skipped-gadapa-gadapaku-on-second-day-39-135806.html





