పారిపోండిరోయ్.. రెడ్‌బుక్ ఓపెనవుతోంది !
Publish Date:Aug 16, 2024
Advertisement
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రజలు, వ్యాపారులు ధైర్యంగా తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. బెదిరింపులు, అక్రమ అరెస్టులు, పోలీసుల అర్ధరాత్రి దాడులు, గోడలు దూకి, తలుపులు పగులగొట్టి తీసుకువెళ్లడాలు కనుమరుగయ్యాయి. పాలనా పరంగా అపార అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోంది. రాజధాని అమరావతి నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలో పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకోనున్నాయి. మరోవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పైనా ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తోన్న ప్రభుత్వం.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ఒక పక్క రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెడుతూనే.. మరోపక్క గత వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలు, దౌర్జన్యాలు, భూకబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలు, వారికి సహకరించిన అధికారులపై చంద్రబాబు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి, అరెస్టులు కూడా జరిగాయి. త్వరలో మంత్రి నారా లోకేశ్ కూడా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన రెడ్ బుక్ లో చట్టం పరిధి దాటి ప్రవర్తించిన వైసీపీ నేతలు, అధికారుల పేర్లను నమోదు చేశారు. ప్రస్తుతం లోకేశ్ ఆ రెడ్ బుక్ ఓపెన్ చేయబోన్నారు. దీంతో వైసీపీ హయాంలో హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ నేతలు, కొందరు అధికారులు విదేశాలకు పారిపోయేందుకు సిద్ధమవుతున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రెడ్ బుక్ పేరు వింటే వైసీపీ నేతలు, అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలపై పెద్ద ఎత్తున వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. పలు ప్రాంతాల్లో తెలుగుదేశం జెండా కట్టిన నేతలను హత్యలు సైతం చేశారు. పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. దీంతో ఐదేళ్ల వైసీపీ పాలనలో తెలుగుదేశం జెండా పట్టుకునేందుకు ఆ పార్టీ కార్యకర్తలు భయపడే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల భూములను ఆక్రమించడం, ప్రభుత్వం తీరును ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం వంటి దారుణాలు జగన్ హయాంలో నిత్యకృత్యంగా కొనసాగాయి. దీంతో ప్రజలు సైతం వైసీపీ నేతలకు ఎదురు నిలబడే సాహసం చేయలేక పోయారు. అప్పట్లో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రనూ అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొని లోకేశ్ పాదయాత్రను పూర్తి చేశారు. ఈ పాదయాత్ర ప్రారంభం నుంచే వైసీపీ ప్రభుత్వంలో చట్టానికి విరుద్దంగా నడుచుకున్న నేతలు, అధికారుల పేర్లను లోకేశ్ రెడ్‌బుక్‌లో రాయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఎన్నికల్లో చివరి ప్రచార సభ వరకు లోకేశ్ రెడ్ బుక్ మెయింటెన్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రెడ్ బుక్ లో పేర్లు ఉన్న వైసీపీ నేతలు, అధికారులను వదిలిపెట్టేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లోకేశ్ ప్రతీ సభలో చెబుతూ వచ్చారు. అప్పట్లో లోకేశ్ రెడ్ బుక్ ను లైట్ గా తీసుకున్నవారు.. ఇప్పుడు రెడ్ బుక్ అంటేనే వణికిపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నది. మరోవైపు వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలకు, భూకబ్జాలకు, చట్టం పరిధిదాటి ప్రవర్తించిన వైసీపీ నేతలపైనా, వారికి సహకరించిన అధికారులపైనా కొరఢా ఝుళిపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతిపై విచారణ సాగుతోంది. మాజీ మంత్రి ద్వారంపూడి చంద్రశేఖర్ రేషన్ బియ్యం దందాపైనా విచారణ జరుగుతోంది. అంతేకాదు.. దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, రఘురాం తదితరులపై తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడికి సంబంధించి కేసులు నమోదు కాగా.. బెయిల్ కోసం కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. అగ్రిగోల్ట్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్టు అయ్యారు. అదే కేసులో జోగి రమేశ్ విచారణకు హాజరయ్యారు. పులివర్తి నానిపై దాడి కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడిపై విచారణ జరుగుతుంది. ఇలా చాలా మందిపై కేసులు ఉన్నాయి. అయితే, ప్రతీకేసు కక్ష సాధింపు అంటూ జగన్ మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నారు. లోకేశ్ రెడ్ బుక్ ప్రకారమే ఇదంతా జరుగుతుందంటూ ఢిల్లీ ధర్నాలోనూ గగ్గోలు పెట్టారు. కానీ, రెడ్ బుక్ ఇంకా తెరుచుకోలేదని లోకేశ్, టీడీపీ నేతలు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. రెడ్ బుక్‌పై తాజాగా మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లాలో అన్న క్యాంటిన్ ప్రారంభం తరువాత లోకేశ్ మాట్లాడుతూ.. రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఊళ్లో రెడ్ బుక్ మీద ప్రజలకు తాను హామీ ఇచ్చానని అన్నారు. ప్రజలకు ఎర్ర బుక్ చూపించి ప్రతి తప్పుపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చానని, ఆ మాటల్ని ఎన్నికల్లో ప్రజలు నమ్మారని, రెడ్ బుక్ మ్యాండేట్ ఖచ్చితంగా అమలు చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు. దీంతో త్వరలో రెడ్ బుక్ తెరుచుకోబోతుందని లోకేశ్ చెప్పకనే చెప్పారు. లోకేశ్ వ్యాఖ్యలతో వైసీపీ హయాంలో చట్టానికి విరుద్దంగా వ్యవహరించిన వైసీపీ నేతలు, అధికారులు వణికిపోతున్నారు. దీంతో రెడ్ బుక్ తెరుచుకోక ముందే దేశం వదిలి పారిపోయేందుకు పలువురు వైసీపీ నేతలు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-leaders-and-tainted-officers-shivering-25-183083.html





