కుల రాజకీయాలపై వైసీపీ ఫోకస్!
Publish Date:Jun 23, 2026
Advertisement
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల అనంతర పరిణామాలను గమనిస్తే.. వైసీపీ కుల రాజకీయాలపై ఫోకస్ పెట్టిందని స్పష్టమౌతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ కాపు శంఖారావం వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందని ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ అన్నారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కాపు సామాజికవర్గ పాకెట్ ను వేదికగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గ ఓట్లను ఏకీకృతం చేయాలన్న వ్యూహంతో వైసీపీ ముందుకు సాగుతున్నట్లు విశ్లేషించారు. ఉమ్మడి కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి అత్యంత బలమైన పట్టు ఉంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి ఎంతటి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం ఉందో, తూర్పుగోదావరిలో కాపులకు అంతటి శక్తి ఉంది. ఈ స్ట్రాంగ్ పాకెట్‌ను వేదికగా చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు ఓటు బ్యాంకును వైసీపీ వైపు ఏకీకృతం (Consolidate) చేయడమే కాపు శంఖారావం భేటీ ప్రధాన ఉద్దేశమని భరద్వాజ వివరించారు. గతంలో కాపు సామాజిక వర్గం కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్య వంటి సీనియర్ నేతలు వయోభారం, అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగా జరుగుతున్న తరుణంలో, తోట త్రిమూర్తులు వైసీపీ తరఫున ఈ కొత్త బాధ్యతలను భుజానకెత్తుకున్నట్లు కనిపిస్తోందన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలతో పోలిస్తే తోట త్రిమూర్తులకు ఉన్న ఆర్థిక బలం, ఇమేజ్ సమన్వయ శక్తి ఈ వ్యూహానికి ప్రధాన బలంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యూహంలో భాగంగా వైసీపీ నేతలు ప్రధానంగా ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారనీ, ఇటీవల సాయికృష్ణ మిస్పింగ్ ఉదంతంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరును వైసీపీ కాపు నేతలు తీవ్రంగా తప్పుపట్టడం వెనుక కారణమిదేనని ఆయన అన్నారు. సాయికృష్ణను కేవలం ఒక రౌడీ షీటర్ గా అభివర్ణిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలను, పోలీసుల వైఫల్యాలను ప్రశ్నించకపోవడాన్ని కాపు సమాజం జీర్ణించుకోలేకపోతోందని వారు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తానే స్వయంగా నన్ను కేవలం కాపు నాయకుడిగా చూడొద్దు అని అంటున్నప్పుడు.. మనం కూడా ఆయన్ను మన నాయకుడిగా గుర్తించాల్సిన అవసరం లేదనే భావనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందనీ, చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కాపులకు శత్రువేనని, ఇప్పుడు చంద్రబాబుతో అంటకాగుతున్న పవన్ కూడా కాపు వ్యతిరేకిగా మారిపోయాడన్న నేరేషన్ ను బలంగా ముందుకు తీసుకురావడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందని భరద్వాజ చెప్పారు. పూర్వం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి నలుగుతున్న కాపులను బీసీల్లో చేర్చే పాత డిమాండ్‌ను చంద్రబాబు గతంలో హామీ ఇచ్చి నెరవేర్చలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఆ హామీలపై నిలదీయాలని వైసీపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు కాపులకు ఏ చిన్న సమస్య వచ్చినా బాధ్యత తీసుకుంటామని వైసీపీ ప్రకటించడం కూడా ఇందులో భాగంగానే చూడాలన్నారు. అయితే వైసీపీ వ్యూహం కేవలం కాపులకే పరిమితం కాలేదు. సమాంతరంగా దళిత ఓటు బ్యాంకును, మరీ ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు మరో వ్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఎంఆర్పీఎస్ నాయకుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య ఉదంతాన్ని వైసీపీ పోలీసుల వేధింపులకు ముడిపెట్టడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అప్పటివరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూ, లోకేష్‌తో సైతం మంచి సంబంధాలు ఉన్న వెంకటేశ్వరరావు ఇంటికి వైసీపీ ముఖ్య నేతలు వెళ్లి పరామర్శించడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. గాజ సాయికృష్ణ ఎపిసోడ్ ద్వారా కాపులను, క్రాంతి కుమార్ ఉదంతం ద్వారా మాదిగ ఓటు బ్యాంకును కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలనేది వైసీపీ వ్యూహంగా ఆయన వివరించారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అనే పాత ముద్రను మళ్లీ తెరపైకి తెస్తూ, గత 15 రోజుల్లో విజయవాడ కేంద్రంగా జరిగిన పోలీసు శాఖ వైఫల్యాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటున్నారు. ఈ విధంగా ఏపీలో మళ్లీ కులాల వారీగా ఓటు బ్యాంకులను ఏకీకృతం చేసేందుకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని భరద్వాజ అన్నారు.
http://www.teluguone.com/news/content/ycp-focuses-on-caste-politics-39-223910.html




