విజయసాయి చంద్రబాబు మనిషట!.. కొత్తరాగం ఆలపిస్తున్న వైసీపీ
Publish Date:Mar 13, 2025

Advertisement
విజయసాయికీ చంద్రబాబు మనిషి అన్న ముద్ర వేసేసింది వైసీపీ. విజయసాయిరెడ్డి అనగానే మొదటిగా గుర్తుకు వచ్చేది జగన్ అక్రమాస్తుల కేసులు. జగన్ ఆస్తుల కేసులలో విజయసాయి ఏ2. అంటే జగన్ సహ నిందితుడన్న మాట. అటువంటి విజయసాయి వైసీపీ ఆవిర్భావం నుంచీ, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నేళ్ల వరకూ జగన్ తో కలిసి నడిచారు. జగన్ అధికార పతనంలో ఆయన ప్రమేయం ఉందో లేదో అన్న విషయం పక్కన పెడితే.. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం వెనుక కచ్చితంగా విజయసాయి ఉన్నారు. అంతే కాదు.. జగన్ కోసం ఆయన సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రత్యర్థులపై చేసిన దాడి కూడా ఎవరూ మరచిపోలేరు. ముఖ్యంగా ఆయన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్వి లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు.. అందుకు ఉపయోగించిన భాష వైసీపీ బూతు నాయకులు ఉపయోగించిన భాషను మించిన రేంజ్ లో ఉండేది. అటువంటి విజయసాయి ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేసేశారు. ఇక రాజకీయాలకు దూరమని, వ్యవసాయమే తన వ్యాపకమనీ ప్రకటించి సంచలనం సృష్టించారు.
ఆయన వైసీపీకి దూరం కావడం ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఆయన కుటుంబ ఆడిటర్ కూడా. జగన్ అక్రమాస్తుల కేసుల నుంచి, ఆయన కుటుంబంలో నెలకొన్న ఆస్తుల పంచాయతీ వరకూ అన్నీ కూలంకుషంగా తెలుసు. అటువంటి విజయసాయి తనకు దూరమైనా, వ్యతిరేకంగా మారినా ఏమౌతుందో జగన్ కు తెలియనిది కాదు. అయినా విజయసాయి వైసీపీకి రాజీనామా చేస్తానని చెబితే జగన్ ఆపలేదు. పోనీ వెడితే వెళ్లాడులే అని మౌనంగానూ ఉండలేదు. విజయసాయి క్యారెక్టర్ లేని మనిషనీ, అటువంటి వాళ్లు వెళ్లిపోవడమే మంచిదన్నట్లుగా మీడియా ముందు చెప్పారు. జగన్ వ్యాఖ్యలను విజయసాయి ఖండించారు కూడా. విజయసాయి వైసీపీకి దూరమైన తరువాత జగన్ సోదరి షర్మిలతో భేటీ అయ్యారు. గతంలో అంటే తను వైసీపీలో ఉన్న సమయంలో షర్మిలపై చేసిన విమర్శలకు సారీ చెప్పారు. అవన్నీ జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ ను అయిష్టంగా చదవినవేనని వివరణ ఇచ్చుకున్నారు. ఆ విషయాన్ని స్వయంగా షర్మిలే వెల్లడించి.. తన సోదరుడి నిజస్వరూపం ఇదీ అని చాటారు కూడా.
ఆ తరువాత విజయసాయి విషయంలో జగన్ ఎటువంటి వ్యాఖ్యలూ చేయకపోవడంతో ఇంటి గుట్టు తెలిసిన విజయసాయి విషయంలో మౌనమే మేలని జగన్ భావించి ఉంటారని అంతా భావించారు. అయితే కాకినాడ సీపోర్టు కేసులో ఏ2గా ఉన్న విజయసాయి.. జగన్ కు ఓ వైపు క్లీన్ చిట్ ఇస్తున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆయన సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డిని పూర్తిగా ఇరికించేశారు. అదే సమయంలో వైసీపీ భవిష్యత్, జనన్ వైఖరీ, ఆయన కోటరీ తీరు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఐడీ విచారణలో కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అంతా వైవీ సుబ్బారెడ్డి కుమారుడేననీ, అన్నిటికీ మించి కాకినాడ సీపోర్టు యమజాని వైవీరావు, వైవీసుబ్బారెడ్డిల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. దీంతో వైసీపీ అలర్ట్ అయిపోయింది. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శల పర్వానికి తెరతీసింది. వైసీపీకి వ్యతిరేకులపై ఆ పార్టీ నేతలు సంధించే తొలి ఆస్త్రం వారు చంద్రబాబు సానుభూతిపరులు, ఆయనకు అనుకూలురు అనే. గతంలో జగన్ తో విభేదించి ఆయన సోదరిపై వైసీపీ ఇవే విమర్శలు చేసింది. ఆమెను చంద్రబాబు సానుభూతిపరురాలిగా అభివర్ణించింది. ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకు జగన్ పై విమర్శలు చేస్తున్నారంటూ నిందలు వేసింది. ఇప్పుడు విజయసాయిపైనా అవే విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.
విజయసాయి చంద్రబాబు ఆడించినట్లు ఆడుతున్నారంటూ ఆయనను చంద్రబాబు అనుకూలుడన్న ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నది. గతంలో జగన్ కోసం విజయసాయి చంద్రబాబుకు వ్యతిరేకంగా చేసిన విమర్శలను, దూషణలను ఇప్పు డు ఉద్దేశపూర్వకంగా విస్మరించి.. విజయసాయిని చంద్రబాబు మనిషిగా చూపే ప్రయత్నం చేస్తున్నది.
http://www.teluguone.com/news/content/ycp-brands-vijayasai-as-cbn-sympathyser-39-194324.html












