రాహుల్ కుటుంబంపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ అనుచిత వ్యాఖ్యలు.!
Publish Date:Jul 29, 2026
Advertisement
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే. అయితే అవి హద్దులు దాటితేనే సమస్య. ఇటీవలి కాలంలో రాజకీయ విమర్శలు అన్ని హద్దులూ దాటేసి, దూషణలు, బెదరింపులు, అనుచిత, అసభ్య వ్యాఖ్యలూ ఎక్కువైపోయాయి. తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. విషయమేంటంటే.. యశ్‌పాల్ సువర్ణ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను ప్రస్తావించారు. ఆ చారిత్రాత్మక ఘటనను గుర్తుచేస్తూ.. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకత్వం తమ వైఖరిని మార్చుకోకుండా ఇలాగే వ్యవహరిస్తూ పోతే, రాహుల్ గాంధీ కుటుంబానికి కూడా 1992లో బాబ్రీ మసీదుకు పట్టిన గతే పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ తరహా తీవ్రమైన పదజాలం రాజకీయాల్లో ఎప్పుడూ చూడని రీతిలో ఉండటంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నెటిజన్లు, రాజకీయ పరిశీలకులూ, సామాన్య జనం కూడా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, బేషరతు క్షమాపణ డిమాండ్ చేస్తున్నారు. విద్వేషపూరితంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే నోటి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యతరకరమంటూ కాంగ్రెస్ ఇటువంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉడుపి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అశోక్ కుమార్ కొడవూర్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణపై ఫిర్యాదు చేశారు. ప్రజల్లో వైషమ్యాలను, విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారని, ఒక ప్రముఖ నాయకుడి కుటుంబంపై భయాందోళనలు రేకెత్తించే రీతిలో మాట్లాడారనీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు యశ్‌పాల్ సువర్ణపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. Yashpal Suvarna, Rahul Gandhi, Babri Masjid comments, Karnataka BJP MLA, Udupi Congress FIR, BNS sections case
http://www.teluguone.com/news/content/yashpal-suvarna-39-227457.html




