ఏపీ ప్రాథమిక విద్యకు ప్రపంచ బ్యాంకు ప్రశంసలు
Publish Date:Jun 26, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలు, అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పొగడ్తల వర్షం కురుస్తోంది. ఏపీలో ప్రాథమిక విద్యా విధానం అద్భుతంగా ఉందంటూ ప్రపంచ బ్యాంకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో చేపడుతున్న విభిన్న కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రపంచ బ్యాంకు బృందం.. ఇక్కడి విద్యా ప్రమాణాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. చిన్నారుల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచడం, సంఖ్యాజ్ఞాన నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. చిన్న వయసులోనే పిల్లల్లో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ఆటల ఆధారిత బోధనా పద్ధతులను ప్రవేశపెట్టడం వల్ల చిన్నారులు చదువుపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారని తమ పర్యటనలో గమనించినట్లు వారు పేర్కొన్నారు. ఆధునిక విద్యా సాధనాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్లాస్‌రూమ్‌లలో సమర్థవంతంగా వినియోగిస్తున్న తీరును ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా విభాగం ఉపాధ్యక్షుడు జోహెన్సే జుట్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిథి బృందం ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ పాఠశాలలను సందర్శించారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానాన్ని, విద్యార్థుల స్పందనను ప్రత్యక్షంగా గమనించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలువుతున్న సపోర్టింగ్ ఆంధ్రా లెర్నింగ్ ట్రాన్ ఫర్మేషన్ (సాల్ట్) పై ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడమే కాకుండా, ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వడం, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేయడం వంటి అంశాల్లో 'సాల్ట్' ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తోందంటూ ఆ బృందం పొగడ్తల వర్షం కురిపించింది.
http://www.teluguone.com/news/content/world-bank-praises-aps-primary-education-sector-36-224172.html





