మహిళల టి20 వరల్డ్ కప్.. పాకిస్థాన్ ను చిత్తు చేసిన బంగ్లాదేశ్
Publish Date:Jun 20, 2026
Advertisement
మహిళల టీ20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదైంది. బంగ్లాదేశ్ మహిళల జట్టు పాకిస్థాన్ విమెన్స్ టీమ్ న చిత్తు చేసింది. . గ్రూప్-1లో భాగంగా శనివారం (జూన్ 20) జరిగిన కీలక పోరులో పాకిస్థాన్ జట్టుపై బంగ్లాదేశ్ మహిళల జట్టు 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. పటిష్ఠమైన బౌలింగ్ ప్రదర్శనతో పాక్ బ్యాటింగ్ విభాగాన్ని కట్టడి చేసిన బంగ్లాదేశ్.. ఈ విజయంతో తమ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగర్ సుల్తానా 36 పరుగులు, శోభన మోస్తరీ22 పరుగులతో రాణించారు. ఇక చివరి ఓవర్లలో షోర్నా అక్తర్ కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో అజేయంగా 39 పరుగులు సాధించడంతో బంగ్లా జట్టు ఆ మాత్రం స్కోరైనా చేరగలిగింది. పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం 124 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టుకు మంచి ఆరంభమే లభించింది. మునీబా అలీ పాతిక పరుగులు, గుల్ ఫిరోజా 23 సరుగులు చేశారు. దీంతో ఒక దశలో పాకిస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే ఆ తర్వాత బంగ్లాదేశ్ స్పిన్ బౌలర్లు మ్యాచ్‌ను తిప్పేశారు. బంగ్లాదేశ్ స్పిన్ ద్వయం నహిదా అక్తర్, సంజిదా అక్తర్ మేఘల పాకిస్థాన్ మిడిలార్డర్‌ను కుప్పకూల్చారు. వీరిద్దరూ చెరో మూడు వికెట్లు పడగొట్టి పాక్ ను కోలుకోలేని దెబ్బ తిశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ జట్టు 8 వికెట్ల నష్టానికి కేవలం 100 పరుగులు మాత్రమే చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన పాక్ జట్టు పాయింట్ల పట్టికలో దిగువ స్థానానికి పడిపోయింది. ఈ వరుస పరాజయాలతో ఆ జట్టు సెమీఫైనల్ చేరే అవకాశాలు దాదాపుగా మృగ్యమయ్యాయి. మరోవైపు ఈ విజయంతో బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి.
http://www.teluguone.com/news/content/womens-t20-world-cup-36-223658.html





