విత్తమంత్రికి షాక్.. జగన్ పథకాల డొల్ల తనాన్ని విప్పి చెప్పిన మహిళ
Publish Date:Aug 1, 2022
Advertisement
గడపగడపకూ మన ప్రభుత్వం అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలూ ఎంత తిరుగుతున్నా వారికి జనం నుంచి నిరసనలే తప్ప ఆదరణ కానరావడం లేదు. తాజాగా జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక నిరసన సెగ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు గట్టిగా తగిలింది. ఎంతైనా ఆర్థిక మంత్రి కదా.. అడ్డగోలుగా నిబంధనల కళ్లు గప్పి మరీ రాష్ట్రానికి అప్పులు తీసుకువచ్చిన మంత్రి కదా.. అలాగే జనాన్ని కూడా తన గణిత ప్రావీణ్యతతో ప్రజలను నమ్మించేయగలనని భావించారు. కానీ ఆయనకు ఆ గణాంకాలతోనే గట్టి క్లాస్ తీసుకుంది ఓ మహిళ. వివరాలిలా ఉన్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కర్నూలు జల్లా డోన్ నియోజకవర్గంలో పర్యటించారు. 30వ వార్డులోని ఓ మహిళ ఇంటికి వెళ్లిన ఆయన ఆమెకు ప్రభుత్వ పరంగా అందిన లబ్ధిని అంకెలతో సహా వివరించారు. అయితే ఆమె ప్రభుత్వం చేసిందేముందని, ఇందులో ఘనత ఏముందని ఎదురు ప్రశ్నించింది. దీంతో ఆమెకు మరింత వివరంగా చెప్పేందుకు ప్రయత్నించిన జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల కారణంగా ఆమె కుటుంబానికి 98 లక్షల 140 రూపాయలు ముట్టిందని లెక్కలు వేసి మరీ వివరించారు. దీంతో ఆ మహిళ జగనన్న చేదోడు పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంత వరకూ తమకు అది రాలేదని నిలదీశారు. అంతే కాకుండా తన కుటుంబానికి 98140 రూపాయలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా రావడంలో ప్రభుత్వం గొప్పేముందని ఎదురు ప్రశ్నించారు. ఇచ్చింది లక్ష లోపు.. పన్నుల రూపంలో వసూలు చేసింది రెండు లక్షల పైమాటేనని ఆమె గణాంకాలతో సహా వివరించారు. కంగు తిన్న మంత్రి బుగ్గన ధరల పెరుగుదల, పన్నుల వాత తమ ప్రభుత్వం ఒక్కటే కాదనీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఈ పరిస్థితి ఉందనీ వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆమె చెత్త పన్ను, ఈ పన్ను, ఆ పన్నూ ఏమిటంటూ నిలదీశారు. దీంతో బుగ్గన అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి కదిలారు.
http://www.teluguone.com/news/content/women-clarifies-that-jagans-welfare-schemes-were-no-use-39-141023.html





