స్నేహమేరా జీవితం... ఆ స్నేహంతోనే ఆరోగ్యం!
Publish Date:Jun 14, 2017
Advertisement
కుటుంబాన్ని దేవుడు ఇస్తాడు, కానీ స్నేహితులని ఎంచుకునే అవకాశం మనకే ఉంటుంది. అందుకనే స్నేహం చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అంటారు పెద్దలు. అలా మంచి స్నేహితులను ఎంచుకోవడానికి మరో బలమైన కారణం కూడా చూపిస్తున్నారు పరిశోధకులు. మంచి స్నేహితులు పక్కన ఉంటే... ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన విలియం చోపిక్ అనే పరిశోధకుడు, ఆరోగ్యం మీద స్నేహం ప్రభావాన్ని తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకోసం వందమంది కాదు వేయిమంది కాదు వంద దేశాల నుంచి 2,70,000 మంది నుంచి సమాచారాన్ని సేకరించారు. వీళ్లంతా కూడా కుటుంబం వల్లా, స్నేహితుల వల్లా తాము సంతోషంగానూ ఆరోగ్యంగానూ ఉంటున్నామని చెప్పుకొచ్చారు. వృద్ధాప్యంలో అయితే కుటుంబాన్ని మించి కూడా స్నేహితుల అండ తమను ఆరోగ్యంగా ఉంచుతోందని తేల్చారు. అభ్యర్థులు స్వయంగా చెప్పిన ఈ విషయాలు వాస్తవంగా ఎంతవరకూ నిజమో తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకోసం మరో ఏడువేల మందికి చెందిన మెడికల్ రికార్డులను పరిశీలించారు. నిజంగానే స్నేహితులు ఉన్నవారు ఇతరులకంటే ఆరోగ్యంగా ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది. అందుకని వృద్ధాప్యంలో హాయిగా ఉండేందుకు డబ్బులు, ఆస్తులు ఎలా సమకూర్చుకుంటామో... అంతకంటే ముఖ్యంగా, మంచి స్నేహితులను కూడా తయారుచేసుకోవాలని చెబుతున్నారు.ఇంతకీ వయసు పెరిగేకొద్దీ స్నేహం ఎందుకంత ప్రభావం చూపుతుంది? అన్న ప్రశ్నకు పరిశోధకుల దగ్గర చాలా జవాబులే ఉన్నాయి. - వృద్ధాప్యంలో భార్యో భర్తో మరణించిన తర్వాత ఎక్కడలేని ఒంటరితనమూ అవహిస్తుంది. సహజంగానే స్నేహితులు ఆ ఒంటరితనం నుంచీ, దగ్గర మనిషిని కోల్పోయిన బాధ నుంచీ బయటపడేస్తారు. - కుటుంబసభ్యులతో అన్ని విషయాలనూ పంచుకోలేకపోవచ్చు. అవతలివారు అపార్థం చేసుకుంటారనో, కంగారు పడతారనో, బంధంలో చులకన అయిపోతామనో... వారి దగ్గర కొన్ని విషయాలు దాచిపెడతాము. కానీ స్నేహంలో అలాంటి భేషజాలు ఏవీ ఉండవు కదా! - కుటుంబంలో ఏదన్నా సమస్య ఉంటే అది మనసుని వేధించక తప్పదు. దాని నుంచి పారిపోయే అవకాశమూ లేకపోవచ్చు. కుటుంబంలో అనుభవించే యాతనకి స్నేహితుల దగ్గర ఓదార్పు లభించి తీరుతుంది. అలాగని స్నేహం కేవలం వృద్ధాప్యంలోనే కాదు.... జీవితంలోని ఏ మలుపులో అయినా అండగా నిలిచి తీరుతుంది. కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా మంచి మనుషులను స్నేహితులుగా మార్చుకునేందుకు, ఆ స్నేహితులను కలకాలం నిలుపుకొనేందుకు ఇప్పటినుంచే ప్రయత్నించమని సూచిస్తున్నారు పరిశోధకులు. - నిర్జర.
- కాలం గడుస్తున్న కొద్దీ పనికిరాని స్నేహాలను పక్కనపెట్టి, నిజమైన స్నేహితులతోనే కాలం గడిపేందుకు ప్రయత్నిస్తాం. సహజంగానే వీరు మన కష్టసుఖాలను పంచుకునేవారై ఉంటారు.
- ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో పాలుపోదు. జీవితమంతా శూన్యంలా తోస్తుంది. అలాంటి సమయంలో స్నేహితుల అండ ఓ కొత్త జీవితాన్ని అందిస్తుంది.
http://www.teluguone.com/news/content/william-chopik-35-75603.html





