ఏఐ వల్ల ఐటీ జాబ్స్ పోతాయా? వస్తాయా?
Publish Date:Apr 27, 2026
Advertisement
ఏఐ వర్సెస్ ఐటీ. ఐటీలో ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా? ప్రస్తుతం పోతున్న ఉద్యోగాలు ఎందువల్ల పోతున్నాయ్? అసలు ఐటీ రంగంపై ఏఐ ఎఫెక్ట్ ఎంత? అన్న ప్రశ్నలు అందరినీ ఆందోళనకు, అయోమయానికీ గురి చేస్తున్నాయి. ఐటీ రంగంలో ఏఐ ప్రభావంపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఐటీ వర్సెస్ ఏఐ అనేది ఒక యుద్ధంలా కాకుండా, ఒక పరిణామంలా చూడాలంటారు నిపుణులు. నిజం చెప్పాలంటే.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, కానీ ఉద్యోగాల స్వరూప- స్వభావాలు మారిపోతాయంటున్నారు. ఉద్యోగాల ముప్పు ఎవరికి అంటే.. ముప్పు ఎవరికి? అంటే, రొటీన్ పనులు చేసేవారు, కేవలం కోడింగ్ మాత్రమే వచ్చి లాజిక్ తెలియని వారు. డేటా ఎంట్రీ స్థాయి పనులు చేసేవారికి కొలువుల ముప్పు పొంచి ఉంది. ఇక ఐటీ వల్ల ఎవరికి లాభం? అని పరిశీలిస్తే.. ఏఐని ఒక సాధనంగా వాడుకుంటూ తమ నైపుణ్యాలను పెంచుకునే వారికి ఏఐ వరంగా మారుతుంది. ఉదాహరణకు.. గతంలో ఒక సాఫ్ట్‌వేర్ రాయడానికి వారం పట్టే పని, ఇప్పుడు ఏఐ సాయంతో రెండు రోజుల్లోనే నాణ్యంగా పూర్తి చేయవచ్చు. ఇక ప్రస్తుతం ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి? అని చూస్తే.. ప్రస్తుతం ఐటీ రంగంలో జరుగుతున్న లేఆఫ్స్‌కు కేవలం ఏఐ మాత్రమే కారణం కాదు. దీని వెనుక ఇతర కీలక కారణాలు ఉన్నాయి. అతిగా నియామకాలు కూడా ఒక రీజనే అంటారు మార్కెట్ ఎనలిస్టులు. కోవిడ్ సమయంలో డిజిటల్ అవసరాలు పెరగడంతో కంపెనీలు అవసరానికి మించి ఉద్యోగులను తీసుకున్నాయి. ఇప్పుడు ఆ డిమాండ్ తగ్గడంతో వారిని తొలగిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం భయాలు కూడా మరో కారణంగాచెబుతున్నారు. అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి వల్ల ప్రాజెక్టులు తగ్గిపోయాయి. ఐటీ కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తీసేస్తున్నాయి. నైపుణ్యాల అసమతుల్యత విషయానికి వస్తే.. పాత టెక్నాలజీలపై ఆధారపడ్డ ప్రాజెక్టులు మూతపడుతున్నాయి. క్లౌడ్, ఏఐ, డేటా సైన్స్ వంటి కొత్త టెక్నాలజీల్లో నైపుణ్యం లేని వారు వెనకబడిపోతున్నారు. ఐటీ రంగంపై ఏఐ ఎఫెక్ట్ ఎంత? అని ఎనలైజ్ చేస్తే.. ఐటీ రంగంపై ఏఐ ప్రభావం మూడు ప్రధాన దశల్లో ఉంటుంది. వాటిలో ఒకటి ఉత్పాదకత పెరగడం. గిట్‌హబ్ కోపైలట్ వంటి టూల్స్ వల్ల డెవలపర్లు వేగంగా కోడ్ రాయగలుగుతున్నారు. దీనివల్ల కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది. రెండోది.. క్వాలిటీ అస్యూరెన్స్. టెస్టింగ్ విభాగంలో ఏఐ పాత్ర చాలా పెరిగింది. మ్యాన్యువల్ టెస్టింగ్ చేసేవారి అవసరం తగ్గిపోతోంది. ఇక మూడోది.. కొత్త ఉద్యోగాల సృష్టి. ఏఐ వల్ల ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ ఎథిక్స్ నిపుణులు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ వంటి సరికొత్త కెరీర్ అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఏఐ మిమ్మల్ని రీప్లేస్ చేయదు.. కానీ ఏఐని వాడటం తెలిసిన వ్యక్తి మిమ్మల్ని రీప్లేస్ చేస్తాడు. ప్రస్తుత ఐటీ ఉద్యోగులు కేవలం కోడింగ్‌కు పరిమితం కాకుండా.. సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని, ఏఐ టూల్స్‌ను ఉపయోగించుకునే నైపుణ్యాన్ని పెంచుకుంటే ఇక ఉద్యోగ భయం అక్కర్లేదు. ఐటీ రంగం ఎప్పుడూ మార్పులకు లోనవుతూనే ఉంటుంది, ఇది కూడా అందులో ఒక భాగమే అంటారు నిపుణులు.
http://www.teluguone.com/news/content/will-ai-lead-to-the-loss-of-it-jobs-36-218365.html





