జగనన్నకు కోట్లలో బర్త్ డే గిఫ్ట్స్.. రిటర్న్ గిఫ్ట్ కోసమేనా..?
Publish Date:Dec 20, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 50లోకి అడుగు పెడుతున్నారు. డిసెంబర్ 21న జగన్ రెడ్డి పుట్టిన రోజు. ముఖ్యమంత్రిగా అయన జరుపుకుంటున్న మూడవ పుట్టినరోజు వేడుక ఇది. అయితే, మొదటి రెండు పుట్టిన రోజులకంటే ఇది కొంత ప్రత్యేకం. ఎందుకంటే, మొదటి రెండు పుట్టినరోజు వేడుకల్లో వైఎస్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. కానీ, ఈ సారి పాదయాత్రలో ఉన్న సోదరి షర్మిల హాజరు కావడం లేదని తెలుస్తోంది. పాదయాత్రలో లేకున్నా ఆమె హజరు అయ్యేవారు కాదన్నది అందరికీ తెలిసిన రహస్యమే. అన్నా చెల్లి మధ్య చాలా కాలంగా సఖ్యత లేదు. ఇద్దరి మధ్య మాటలు కూడా లేవని అంటున్నారు. ఇక తల్లి విజయమ్మఅయినా కుమారుని ఆశ్వీదరిస్తారో లేదో తెలియదు. ఆ ఇద్దరి మధ్యన కూడా ముందున్న సంబంధాలు ఉన్నట్లు కనిపించడం లేదని అంటున్నారు. కుటుంబం వ్యవహరం అలా ఈ పుట్టిన రోజు వేడుకల వేదిక, పార్టీ వివాదలకు కూడా వేదిక అవుతోంది. ముఖ్యంగా నగిరి ఎమ్మెల్యే, రోజా ఆమె ప్రత్యర్ధి వర్గం పోటాపోటీగా జగన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపేందుకు చేస్తున్న సన్నాహక కొట్లాటలు గత కొంత కాలంగా చర్చనీయాంశమవుతూనే వున్నాయి. ఎమ్మెల్యే రోజా ప్రత్యర్థి వర్గం నాయకులు ఇటీవల నగరిలో సమావేశమై ఆమె పేరు చెప్పకనే విమర్శల దాడికి దిగిన సంగతి తెలిసిందే.తర్వాత రోజా మీడియా సమావేశంలో వారిపై ప్రతివిమర్శలకు దిగారు.ఈ నేపధ్యంలో ఆదివారం పుత్తూరులోని ఏలుమలై ఇంట్లో సమావేశమైన ఎమ్మెల్యే రోజా ప్రత్యర్ధి వర్గాలు మంగళవారం నిర్వహించ తలపెట్టిన జగన్ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లపై చర్చించారు. పుత్తూరులో దాదాపు పది వేలమంది కార్యకర్తలతో ర్యాలీ, కార్వేటినగరం కూడలిలో బహిరంగ సభ నిర్వహించాలని,నాలుగు ప్రదేశాలలో అన్నదానం చేయాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో ఏలుమలై, కేజే కుమార్, లక్ష్మీపతిరాజు, భాస్కరరెడ్డి, మురళిరెడ్డి, రవిశేఖరరాజు, నారాయణబాబు పాల్గొన్నారు. మరో పక్క ఎమ్మెల్యే వర్గం కూడా జగన్ పుట్టిన రోజు వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయిదు మండలాల్లో తన వర్గం తరపున గెలిచిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లను జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగస్వాములను చేసి సత్తా చాటాలని వ్యూహరచన చేస్తున్నారు. నగరిలో పెద్దఎత్తున ర్యాలీ, బహిరంగ సభ, అన్నదానాలు చేయాలని భావిస్తున్నారు.అధికార పార్టీ కార్యకర్తలు ఒకేసారి జరిగే రెండు కార్యక్రమాల్లో ఎటువైపు మొగ్గాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంతలోనే, బ్యానర్లు, ఫ్లేక్సీల యుద్ధం నడుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ ఉహాగానాల నడుమ వచ్చిన ఈ పుట్టిన రోజు వేడుకలను, కొందరు మంత్రి పదవులను ఆశిస్తున్న,ఎమ్మెల్ల్యేలు ఒక అవకాశంగా తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. భారీ బహుమతులతో ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జగన్ రెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటుగా, కోటి రూపాయలకుకు తగ్గని బహుమతులను ఇచ్చి, రిటర్న్ గిఫ్ట్‌గా మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు.ఈ జాబితాలో గుంటూరుకు చెందిన ఓ మహిళా నాయకురాలు.. అదేవిధంగా అనంతపురం జిల్లాకు చెందిన మరో మహిళా ఎమ్మెల్యే, విశాఖకు చెందిన యువ నాయకుడు, తూర్పుకు చెందిన.. మరో నాయకుడు.. ముందు వరుసలో ఉన్నారని అంటున్నారు. వీరంతా కూడా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నవారే. అయితే బహుమతులకు ముఖ్యమత్రి ఫిదా అవుతారా? రిటుర్న్ గిఫ్ట్ ఇస్తారా ? చూడవలసి ఉందని అంటున్నారు. ఈ పుట్టిన రోజు తర్వాత అయినా ముఖ్యమంత్రి మంచిగా మారాలని, మంచి పాలన అందివ్వాలని సామాన్యులు కొరుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/why-ycp-leaders-doing-grand-birth-day-celebrations-to-jagan-25-128772.html





