ఏపీలో బీఆర్ఎస్ ఎందుకు కేటీఆర్!
Publish Date:Jun 4, 2026
Advertisement
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి విభజన సెంటిమెంట్, ఆత్మగౌరవం అంశాలు తెరపైకి వచ్చాయి. తెలంగాణలో జనసేన రాజకీయ ప్రణాళికలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో వేల మంది ప్రాణాలర్పించారని చెబుతున్న బీఆర్ఎస్ నాయకత్వం, అధికారంలోకి వచ్చాక కేవలం 500 మంది అమరవీరుల కుటుంబాలను మాత్రమే ఎందుకు ఆదుకుంది, మిగిలిన వారిని ఎందుకు విస్మరించిందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అమరవీరుల బలిదానాల ఫలాలు ఎవరు అనుభవించారో, ఎవరు వేల లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారో ప్రజలకు తెలుసంటూ జనసేన మద్దతు దారులు ఎదురు దాడికి దిగుతున్నారు. తమకు పదవులు, అధికార భాగ్యం కల్పించిన అమరజీవుల కుటుంబాలనే సరిగ్గా పట్టించుకోని కల్వకుంట్ల కుటుంబం.. ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటు సమయంలోనే ఆంధ్రాలో కూడా విభజనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కానీ నాడు ఆ ఉద్యమాలను దొంగ ఉద్యమాలని కేసీఆర్, కేటీఆర్ ఎగతాళి చేశారనీ, ఇప్పుడు మాత్రం తెలంగాణ ఉద్యమాల గురించి ఎవరైనా మాట్లాడితే తమ ఆత్మగౌరవం దెబ్బ తింటోందంటూ ఎదురుదాడి చేయడం ఏమిటనీ నిలదీస్తున్నారు. కేసీఆర్ సెలైన్లు పెట్టుకుని చేసిన 10 రోజుల దీక్ష గురించే అంతలా గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు.. పొట్టి శ్రీరాములు ప్రాణాలు కోల్పోయే వరకు చేసిన ఆమరణ నిరాహార దీక్షను చులకనగా మాట్లాడటం అహంభావానికి నిలువెత్తు నిదర్శనంగా తూర్పారపడుతున్నారు. ఈ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ అనేది చాలా బలంగా ఉందనీ.. కానీ రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రాలో మాత్రం అలాంటి సెంటిమెంటు ఏదీ లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అక్కడ జై ఆంధ్రా అనే వాళ్ళు కూడా కరువయ్యారని.. మూడు రాజధానులు అంటున్నా, ఇంకేం అంటున్నా అభ్యంతరం చెప్పేవారు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆంధ్రా వాళ్లంటే తెలంగాణ నాయకులకు ఇంత చులకన భావం ఏర్పడిందని పవన్ విశ్లేషించారు. గతంలో కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నించినప్పుడు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరుతో రాజకీయాలు చేసినప్పుడు ఆంధ్రా ప్రజలు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడమే ఇందుకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడుని దెబ్బతీసేందుకు తెరచాటు రాజకీయాలు జరిగినప్పుడు కూడా ఊరుకున్నారనీ పవన్ అన్నారు. ఈ డైలాగ్ వార్ తో ఏపీ, తెలంగాణలో మళ్లీ విభజన సెంటిమెంట్, ఆత్మగౌరవం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి.
http://www.teluguone.com/news/content/why-brs-in-ap-25-221801.html




