ఇంతకీ మోడీ షాలకు మిత్రుడు చంద్రబాబా.. జగనా?
Publish Date:Mar 6, 2025
Advertisement
వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో చివర కూర్చున్నా ఫరవాలేదన్నది నానుడి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ తీరు అందుకు భిన్నంగా ఉంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబునాయకత్వంలో అధికారంలో ఉన్నది కూడా ఎన్డీయే సర్కారే. అయినా మోడీ మద్దతు, సహకారం ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్ కే అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ వివేకానండ రెడ్డి హత్య కేసులో ప్రధాన, ప్రత్యక్ష సాక్షి వాచ్ మ్యాన్ రంగన్న బుధవారం (మార్చి 5) రాత్రి కడప రిమ్స్ హాస్పిటల్లో మృతిచెందారు. రంగన్న మృతిపై తనకు అనుమానాలున్నాయంటూ ఆయన భార్య పిర్యాదు చేయడంతో పులివెందుల పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివేకా హత్య కేసులో ఇప్పటికే పలువురు సాక్షులు మృతి చెందారు. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి రంగన్న కూడా మృతి చెందారు. గత 5 ఏళ్ళుగా ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది. కానీ నేటికీ వివేకాని ఎవరు హత్య చేశారో? ఆయన హత్య వెనుక ఎవరెవరున్నారో సీబీఐ నిర్ధారించి కోర్టులో నిరూపించలేకపోయింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే బలమైన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసుని కొట్టివేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పరిశీలకులు అంటున్నారు. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్నారు కనుక కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని తెలుగుదేశం ఆరోపించింది. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే అప్పుడు పరిస్థితులు ఉన్నాయి. సీబీఐ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కనీసం తాకలేకపోయింది. అవినాష్ రెడ్డిపై అరెస్టు వారెంట్ ఉన్నా అప్పటి జగన్ ప్రభుత్వం ఆయన అరెస్టు కాకుండా అడ్డుకోగలిగింది. దీంతో సీబీఐ చేసేదేం లేక అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండానే అరెస్టు చూపించి స్టేషన్ బెయిలు ఇచ్చేసి వదిలేసింది. అప్పట్లో కేంద్రంలోని మోడీ సర్కార్ అండతో జగన్ ఇవన్నీ చేయించగలిగారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే అయినా కేసు ముందుకు సాగడం లేదు. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వివేకా కుమార్తె సునీత చంద్రబాబును కలిసి కేసు విచారణ వేగవంతం చేయాలని కోరారు. అయినా పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు లేదు. దీనిని బట్టి చూస్తుంటే కేంద్రం పెద్దల వద్ద ఇంకా జగన్ మాటే చెల్లుబాటు అవుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశీలకులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చే స్తున్నారు. అసలింతకీ మోడీ షా చంద్రబాబు వైపా, జగన్ వైపా ఎవరి వైపు ఉన్నారన్న సందేహిలు సామాన్యులలో కూడా వ్యక్తం అవుతున్నాయి. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండి, కనీసం విపక్ష హోదా కూడా దక్కకపోయినా జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద తన పలుకుబడి ఉపయోగించి వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ దూకుడుగా వ్యవహరించకుండా నిలువరించగలుగుతున్నారనీ, అదే సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాత్రం వివేకా సహా జగన్ కేసుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి దర్యాప్తు సంస్థలు చురుకుగా వ్యవహరించేలా చేయడంలో విఫలమౌతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/whose-friends-are-modi-and-shah-25-193954.html





