ఊరంతా ఒకే మాట.. వందల ఏళ్లుగా అదే కట్టుబాటు! స్త్రీపురష సమానత్వానికి పెద్దపీట
Publish Date:May 16, 2022
Advertisement
స్త్రీ పురుష సమానత్వం అన్నదానికి మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తోంది ఆ ఊరు. ఇదేదో ప్రచారం కోసమే, పేరు కోసమో కాదు... ఒక సంప్రదాయంగా శతాబ్దాలుగా ఆ వూరు కొనసాగిస్తోంది. ఎవరేమన్నా సరే మా కట్టుబాట్లు సంప్రదాయం వీడేది లేదంటోంది. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందంటారా? ఆంధ్రప్రదేశ్ లోనే.. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల మత్స్యకార గ్రామం నువ్వల రేవు. ఆ ఊరిలో వివాహ వేడుక ఆ ఊరికే ప్రత్యేకం. ఆ వేడుకలో వారు అనుసరించే సంప్రదాయాలు అంతకు మించి ప్రత్యేకం. స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని వారి వివాహవేడుకల్లోఆచరించి మరీ చూపుతారు. సాధారణంగా వధువు మెడలో వరుడు తాళి కడతాను. నువ్వల రేవు గ్రామంలో మాత్రం వధువు మెడలో వరుడు తాళి కడతాడు. అంతే కాదు వరుడి మెడలో వధువు కూడా తాళి కడుతుంది. అంటే వధూవరులిరువురూ పరస్పరం తాళి కట్టుకుని భార్యాభర్తలు అవుతారు. ఇదొక్కటేనా.. ఆ ఊరిలో జరిగేవన్నీ సామూహిక వివాహాలే. అందు కోసం ఆ గ్రామంలో పెళ్లిళ్లు జరిగేది రెండేళ్లకు ఒక సారే. అదీ గ్రామ పెద్దలు పెట్టిన ముహూర్తానికే. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడి వారినే వివాహం చేసుకుంటారు. పెళ్లిళ్లలో వధూవరులిరువురూ ఇదే గ్రామానికి చెందిన వారై ఉంటారు. బయట ఊర్ల నుంచి సంబంధాలు కలుపుకోరు. వధూవరుల అంగీకారం, పెద్దల అనుమతితో గ్రామ పెద్దలు పెట్టిన ముహూర్తానికే కొత్త జంటల వివాహాలు జరుగుతాయి. శతాబ్దాలుగా సంప్రదాయాన్ని విడవ కుండా కొనసాగిస్తున్నారు మువ్వల రేవు గ్రామస్థులు.
http://www.teluguone.com/news/content/whole-village-stand-by-one-word-25-135961.html





