భీమ్లా బజ్ అయిపోయాక టికెట్ రేట్ల పెంపు!.. జగన్నాటకంలో గెలిచిందెవరు?
Publish Date:Mar 8, 2022
Advertisement
సినిమా వాళ్లకి గుడ్‌న్యూస్. ఎట్టకేళకు ఏపీలో టికెట్ రేట్లు పెంచారు జగనన్న. పెంచడమంటే.. పెంచడం కాదనుకోండి. పాత రేట్లనే మళ్లీ రెజ్యూమ్ చేశారంతే. ఇంతమాత్రానికే ముఖ్యమంత్రిని ఆకాశానికెత్తేస్తున్నారు ఇండస్ట్రీ పెద్దలు. చిరంజీవి అయితే.. తెగ ఖుషీ అవుతున్నారు. సీఎం జగన్‌కు, పేర్ని నానికి థ్యాంక్స్‌ల మీద థ్యాంక్స్‌లు చెబుతున్నారు. అదో టైప్ ఆనందం ఆయనది. దురద పెడితే గోక్కున్నట్టు.. సమ్మగా ఉంది సినిమా వాళ్లకిప్పుడు..అంటున్నారు. అప్పుడెప్పుడో రావాల్సిన ఉత్తర్వులు ఇవి. భీమ్లా నాయక్ రిలీజ్‌కు ముందే ఏపీలో టికెట్ రేట్లు పెరగాల్సింది. కానీ, పెరగలేదు. పెంచలేదు. ఎందుకు పెరగలేదో అందరికీ తెలిసిందే. పవన్ సినిమాను దెబ్బకొట్టేందుకే అన్నారు. కాదు కాదు.. మంత్రి గౌతమ్‌రెడ్డి అకాల మరణం వల్ల.. ఆ బాధలో ఉండటం వల్ల.. ఆలస్యం అయిందనేది సర్కారు సన్నాయి నొక్కులు. ఆ మాటలు నమ్మే అమాయకులు ఎవరూ ఉండరనుకోండి అది వేరే విషయం. మంత్రి మరణంతో పాలన ఏమైనా ఆగిపోయిందా? అధికారులు ఆఫీసులకు రాకుండా రోజుల తరబడి ఇంట్లో కూర్చుని బాధపడ్డారు? అప్పటి నుంచి ఇప్పటి వరకూ జగనన్న.. ఒక్క రివ్యూ కూడా చేయలేదా? ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదా? మిగతా అన్ని కార్యక్రమాలు ఎప్పటిలానే జరిగాయి కానీ.. టికెట్ రేట్ల పెంపు ఉత్తర్యులు మాత్రం ఆలస్యం అయ్యాయా? ఆలస్యం చేశారా? అంటున్నారు. సరే.. భీమ్లా నాయక్ రిలీజ్ అయిపోయింది.. మొదటి మూడు రోజులు గడిచాయి. అప్పటికైనా రేట్లు పెంచొచ్చుగా? కానీ, భీమ్లా సూపర్ హిట్‌తో కలెక్షన్ల వర్షం కురిసింది.. అది కాసుల సునామీగా మారింది.. అందుకే సర్కారుకు మరింత కళ్లమంట మొదలైనట్టుంది. కాస్త లేట్‌గా టికెట్లు పెంచినా.. భీమ్లా నాయక్ బాగుపడుతాడని బెదిరిందో ఏమో.. పీకే సినిమా రిలీజై 10 రోజులు దాటేశాక కానీ.. టికెట్ రేట్లు పెంచలేదు. భీమ్లా బజ్ అంతా అయిపోయాక.. ఇప్పుడిక టికెట్ రేట్లు పెంచినా.. పెద్దగా లాభం వచ్చేది ఏమీ ఉండదని లెక్కేసి మరీ.. రేట్లు పెంచారని అంటున్నారు. మరో రెండు రోజులు ఆలస్యం చేస్తే.. రాథేశ్యామ్ కోసం పెంచారని అంటారని.. ప్రభాస్ మూవీకి మూడు రోజుల ముందు రేట్లు పెంచి.. ఇండస్ట్రీతో చప్పట్లు కొట్టించుకుంటున్నారు జగన్‌రెడ్డి. ఇక, చిరంజీవి.. అమాయకంగా జగనన్నకు దండాల మీద దండాలు పెడుతున్నారు. తమ్ముడి సినిమాకు అంత డ్యామేజ్ జరిగినా.. నోరెత్తని అన్నయ్య.. ఇప్పుడు మాత్రం తెగ హ్యాపీగా ఉన్నారు. గంటలో రావాల్సిన జీవోను.. రెండు వారాల పాటు ఆపేసినా.. కనీసం జీవో ఏదండి జగన్‌రెడ్డి గారూ.. అని ప్రశ్నించని చిరంజీవి.. భీమ్లా నాయక్ కలెక్షన్లు అంతా అయిపోయాక.. చేయాల్సిన ఆర్థిక నష్టం చేసేశాక.. ఇప్పుడు తీరిగ్గా అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరాల్సిన భీమ్లా నాయక్.. జగన్ దెబ్బకి.. సెంచరీ కోసం ఎదురుచూస్తోంది. వకీల్ సాబ్‌తో మొదలై.. భీమ్లా నాయక్‌తో క్లైమాక్స్‌కు చేరింది జగనన్న పొలిటికల్ పిక్చర్. ఈ మధ్యలో టాలీవుడ్‌ను నానా కష్టాల పాలు జేసి.. కన్నీళ్లు పెట్టించి.. పొట్ట కొట్టి.. దివాళా తీయించి.. అదిరించి.. బెదిరించి.. ఇండస్ట్రీని తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసిన జగన్.. చివరాఖరికి ఏం సాధించినట్టు? ఆట ఎక్కడ మొదలైందో.. అక్కడికే వచ్చిందిగా? ఈ రాజకీయ కుట్ర, కుతంత్రంలో.. జగన్నాటకంలో గెలిచిందెవరు? ఓడిందెవరు? పవన్‌కు పోయిందేమీ లేదు.. వకీల్ సాబ్ హిట్టే.. భీమ్లా నాయక్ సూపర్ హిట్టే. జగన్ కొట్టిన దెబ్బతో.. ఎవరికి దిమ్మతిరిగినట్టు?
http://www.teluguone.com/news/content/who-won-in-tollywood-ticket-rates-issue-39-132726.html





