నడ్డా వారసుడెవరు?
Publish Date:Feb 28, 2025
Advertisement
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం కమలం పార్టీలో తీవ్ర పోరు నెలకొంది. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలన్న నిర్ణయానికి పార్టీ అధిష్ఠానం వచ్చింది. త్వరలో జరగనున్న పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికకు పార్టీలో తీవ్ర పోటీ నెలకొని ఉంది. మరో ఐదేళ్ల పాటు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్ఠానం బలమైన నాయకుడిని జాతీయ అధ్యక్ష స్థానానికి ఎంపిక చేయాలని భావిస్తోంది. ఈ పదవి కోసం పోటీ పడుతున్న వారు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రధానంగా రేసులో నలుగురు ముందు వరుసలో ఉన్నారు. వారిలో మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజె, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, మహారాష్ట్ర బీజేపీ నేత వినోద్ థావ్డే ఉన్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ నలుగురిలో ఒకరు పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వచ్చే నెల 15 నాటికి పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక పూర్తి చేయాలని కమలం అధిష్ఠానం భావిస్తున్నది. అయితే పార్టీ నిబంధనల మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి అయిన తరువాత మాత్రమే జాతీయ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంటుంది. పార్టీ రాష్ట్ర శాఖలలో కనీసం సగం రాష్ట్రాల ఎన్నికలైనా పూర్తైతే కానీ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక చేపట్టడానికి పార్టీ రూల్స్ అంగీకరించవు. ఇప్పటి వరకూ 12 రాష్ట్రాలలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. పార్టీ అధ్యక్ష ఎన్నిక జరపాలంటే మరో ఆరు రాస్ట్రాలలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న గుజరాత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రదేశ్, అసోం రాష్ట్రాలలో పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు చూసింది. అదే సమయంలో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి పేర్లు సూచించాల్సిందిగా కూడా పార్టీ హైకమాండ్ రాష్ట్రాల ఇన్ చార్జ్ లకు సూచించింది. కాగా పోటీ తీవ్రంగా ఉండటంతో బీజేపీ శ్రేణులలో కూడా బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరన్న ఉత్కంఠ నెలకొంది.
http://www.teluguone.com/news/content/who-will-be-nadda-successor-39-193610.html





