పోసాని తర్వాత ఎవరంటే..?
Publish Date:Mar 6, 2025
Advertisement
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చాంపియన్స్ ట్రోఫీలో విజేత ఎవరన్న ఉత్కంఠ కంటే.. వైసీపీ హయాంలో ప్రత్యర్థి పార్టీల నేతలపై బూతులతో రెచ్చిపోయిన నేతల అరెస్టులపైనే ఎక్కువ ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఔను దేశమంతా ఇప్పుడు క్రికెట్ ఫీవర్ తో ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా వరుస విజయాలతో ఫైనల్స్ కు చేరుకుంది. ఫైనల్స్ లో న్యూజిలాండ్ తో తలపడుతోంది. చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకూ ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ సునాయాస విజయాలతో దుమ్ము లేపిన టీమ్ ఇండియా ఫైనల్స్ లో కూడా విజయం సాధించి ముచ్చటగా మూడో సారి చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలుస్తుందా, లేదా చివరిమెట్టు మీద తడబడి న్యూజిలాండ్ కు దాసోహం అంటుందా అన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొని ఉంది. ముఖ్యంగా కింగ్ కోహ్లీ తన పూర్వ ఫామ్ ను అందిపుచ్చుని చెలరేగి ఆడుతుండటంతో దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ చర్చే జరుగుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం క్రికెట్ మానియా పెద్దగా కనిపించడం లేదు. ఇక్కడ అందరి దృష్టి పోసాని తరువాత ఎవరు? జగన్ హయాంలో నోటికొచ్చినట్లు దుర్భాషలాడి రెచ్చిపోయిన నేతలలో పోసాని తరువాత అరెస్టయ్యేది ఎవరు? కోడాలి నాని, గోరంట్ల మాధవ్, దువ్వాడ శ్రీనివాస్ అంటే ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా హూ ఈజ్ నెక్స్ట్ అన్న ఉత్కంఠే, ఆసక్తే కనిపిస్తోంది. అయితే తరువాత వంతు దువ్వాడ శ్రీనివాస్ దే అన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. ఇందుకు రాజకీయాలలో పరుష వ్యాఖ్యలకు దూరంగా ఉండే జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలను ఉదాహరణగా చెబుతున్నారు. నిజమే జగన్ హయాంలో వైసీపీ నాయకులు బరితెగించారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడంలో ఆరితేరిపోయారు. నరం లేని నాలుక కదా ఏం మాట్లాడినా చెల్లిపోతుం దన్న ట్లుగా నోటికి హద్దూ పద్దూ లేకుండా బూతుల పంచాంగం విప్పి మరీ తెలుగుదేశం, జనసేన అగ్రనాయకులపై తిట్ల దండకంతో రెచ్చిపోయారు. అలా ఇష్టారీతిగా మాట్లాడిన వారిలో వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై గుంటూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. మాణిక్యాల రావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దువ్వాడను విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు విషయానికి వస్తే.. పోసాని కృష్ణమురళిపై కూడా జనసేన అధినేతపై చేసిన అనుచిత వ్యాఖ్యలపైనే కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇప్పుడు అదే విధంగా దువ్వాడ శ్రీనివాస్ పై కూడా పవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపైనే కేసు నమోదైంది. దీంతో ఆయనను విచారించి అరెస్టు చేయడం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. బూతుల పంచాంగంతో వైసీపీ హయాంలో రాజకీయాలను కలుషితం చేసిన నేతల అరెస్టుల పట్ల సామాన్య జనంలో కూడా హర్షం వ్యక్తం అవుతోంది. అందుకే వంశీ, పోసానిల అరెస్టులను జనం స్వాగతించారు. నెక్స్ట్ ఎవరంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
http://www.teluguone.com/news/content/who-is-next-after-posani-arrest-25-193966.html





